సమస్యల ఆటపాక కేంద్రం | Atapaka center problems | Sakshi
Sakshi News home page

సమస్యల ఆటపాక కేంద్రం

Published Tue, Oct 14 2014 1:29 AM | Last Updated on Sat, Sep 2 2017 2:47 PM

సమస్యల ఆటపాక కేంద్రం

సమస్యల ఆటపాక కేంద్రం

  • పర్యాటక కేంద్రం అభివృద్ధి శూన్యం
  •  చిత్తడిగా మారిన రహదారులు
  •  మూలనపడ్డ ఫెడల్‌బోట్లు
  •  రహదారిలో వీధిలైట్లు లేవు
  • ఆటపాక (కైకలూరు) : జిల్లాలో ప్రసిద్ధి గాంచిన ఆటపాక పక్షుల విహార కేంద్రం సమస్యలతో కునారిల్లుతోంది. ఆస్ట్రేలియా, సైబీరియా వంటి విదేశాల నుంచి అరుదైన పెలికాన్ పక్షులు కొల్లోరు సరస్సుకు తరలివస్తుంటాయి. వాటిని చూసేందుకు సందర్శకులు ఉత్సాహంగా వస్తారు. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఉన్న పక్షుల విహార కేంద్రాల్లో ఆటపాకలో మాత్రమే బోటు షికారు చేస్తూ ఎక్కువ సంఖ్యలో పెలికాన్ పక్షులను తిలకించే అవకాశం ఉంది. పర్యావరణ అధ్యయన కేంద్రం (ఈఈసీ) వద్ద పక్షుల నమూనాలతో ఏర్పాటుచేసిన మ్యూజియం సందర్శకులను ఆకర్షిస్తోంది. జిల్లా నలుమూలల నుంచి, ఇతర జిల్లాల నుంచి కుటుంబ సభ్యులతో ప్రకృతి ఆస్వాదిద్దామని వచ్చే యాత్రికులు ఇక్కడి అసౌకర్యాలను చూసి అటవీ అధికారులు పనితీరును విమర్శిస్తున్నారు.
     
    మౌలిక సదుపాయాలు కరువు

    ఆటపాక పక్షుల కేంద్రంలో యాత్రికులకు కనీస సదుపాయాలు కరువయ్యాయి. ఆట పాక నుంచి ఈఈసీ కేంద్రానికి వెళ్లే మార్గం చిన్నపాటి వర్షంపడినా బురదకయ్యిగా మారుతోంది. వాహనచోదకులు అదుపుతప్పి జారి పడుతున్నారు. పర్యాటకులకు తాగునీటి సౌకర్యం లేదు. పక్షుల కేంద్రం టికెట్టు కౌంటర్ వద్ద ఏర్పాటుచేసిన ట్యాంకులో నీరు తాగేం దుకు వీలుగాలేదని సందర్శకులు పేర్కొంటున్నారు. ఈఈసీ కేంద్రం వద్ద కూడా తాగునీటి వసతి లేదు. పక్షుల కేంద్రం రహదారి వెంబడి ఒక్కటంటే ఒక్క వీధిలైటు లేదు. దీంతో సాయింత్రం వచ్చే యాత్రికులు చికటిపడితే భయపడుతున్నారు.

    ఇటీవల చికట్లో వెళ్తున్న ముగ్గురు యాత్రికులు ఓ పామును తొక్కారు.  అది కాటువేయకపోవడంతో ప్రమాదం తప్పినట్లయింది. యాత్రికులకు కొల్లేరు సరస్సు విశిష్టత, ఆశ్రయం పొందే పక్షుల విరాలు తెలిపేందుకు ఒక్క గైడూ లేడు. పర్యాటక కేంద్రం ప్రవేశానికి రూ.10, బోటు షికారుకు రూ.200 వసూలు చేస్తున్న అటవీ అధికారులు మౌలిక సదుపాయాలు కల్పించాలని          పర్యాటకులు  కోరుతున్నారు.
     
    మూలన పడిన ఫెడల్ బోట్లు

    యాత్రికులను ఆకర్షించడానికి పట్టణాలకే పరిమితమైన ఫెడల్‌బోటు షికారును అటవీ అధికారులు ఆటపాక పక్షుల కేంద్రం వద్ద ఏర్పాటు చేశారు. కొద్ది నెలల క్రితం రెండు బోట్లు మరమ్మతులకు గురయ్యాయి. అయితే వాటికి మరమ్మతులు చేయించడంలేదు. ఆరు నెలల క్రితం ఈదురుగాలులకు ఈఈసీ కేంద్రం పైకప్పు రే కులు ఎగిరి సమీప చేపల చెరువుల వద్ద పడ్డాయి. ఆ రేకులను ఇప్పటి వరకూ తొలగించలేదు. మరోపక్క పక్షుల విహార చెరువు గట్లు కోతకు గురవుతున్నా సరిచేయడంలేదు. అటవీ అధికారులు స్పందించి మౌలిక వసతులు కల్పించడంతోపాటు, సమస్యలను పరిష్కరించాలని సందర్శకులు కోరుతున్నారు.
     
    అంచనాలు రూపొందించాం

    ఆటపాక పక్షుల విహార కేంద్రం రోడ్డు మరమ్మతులకు అంచనాలు రుపొందించామని అటవీశాక రేంజర్ సూర్యప్రకాశరావు చెప్పారు. ఈ కేంద్రం వద్ద పెలికాన్ పక్షుల అవాసాల కోసం కృత్రిమ ఇనుప స్టాండ్లను ఏర్పాటు చేశామన్నారు. రానున్న రోజుల్లో ఈ కేంద్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement