ఐదుగురిని కాపాడిన చెట్టు..!
⇒ ఘాట్‌పై సెల్ఫీ తీసుకుంటున్న వారిని కాపాడబోయి ప్రమాదం
⇒ హార్సిలీహిల్స్ ఘాట్‌లో లోయలోకి దూసుకెళ్లిన ఇన్నోవా
బి.కొత్తకోట(చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలంలోని ప్రఖ్యాత పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్ ఘాట్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో ఐదుగురు పర్యాటకులను ఓ చెట్టు ఆధారంగా బయటపడ్డారు. ఈ సంఘటన బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. మదనపల్లె పట్టణానికి చెందిన హరీశ్ తన నలుగురు మిత్రులతో కలసి ఇన్నోవా వాహనంలో హార్సిలీహిల్స్ సందర్శనకు వచ్చారు.
కొండపై పర్యటన ముగించుకొని వెళ్తుండగా.. 9వ ఘాట్‌రోడ్డు మలుపు వద్ద కొందరు యువకులు బైక్‌ను రోడ్డుపై నిలబెట్టి సెల్ఫీ తీసుకుంటున్నారు. ఇది గమనించిన డ్రైవర్ రాజేష్ వారిని తప్పించేందుకు సడన్ బ్రేక్‌వేసినప్పటికీ ఇన్నోవా ఆగలేదు. రక్షిత గోడను ఢీకొంటూ లోయవైపు దూసుకెళ్లింది. అయితే వాహనం 10 అడుగుల ముందుకువెళ్లి అక్కడే ఉన్న ఓ చెట్టును ఢీకొనడంతో లోయలో పడకుండా తప్పించుకున్నారు. ముందు చక్రం మొక్కను గట్టిగా అతుక్కుపోవడంతో ఇన్నోవా ముందుకు కదల్లేదు. కాసేపటికి తేరుకున్న డ్రైవర్ మిగతా వారు డోర్లు తీసుకుని బయటపడ్డారు.