పల్టీ కొట్టి.. స్కూటీకి తగిలి బోల్తాపడిన ఇన్నోవా
ఇద్దరు యువ సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల దుర్మరణం
కారు మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణం
శామీర్‌పేట జినోమ్‌వ్యాలీ ఠాణా పరిధిలో ఘటన
శామీర్‌పేట్: మితిమీరిన వేగం.. నిర్లక్ష్యం.. ఇద్దరు యువ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను బలిగొంది. ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్‌టేక్ చేసే క్రమంలో మొదట రోడ్డు డివైడర్‌ను ఢీకొని ఆ తర్వాత ఫార్మా కంపెనీ బస్సును ఢీకొట్టిన ప్రమాదంలో కారులోని ఇద్దరూ దుర్మరణం చెందారు. ఈ ఘటన శుక్రవారం నగర శివారులోని శామీర్‌పేట మండలం జినోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తూంకుంట మున్సిపాలిటీ హకీంపేటకు చెందిన మోహన్ (25), మౌలాలీకి చెందిన దీపిక(23) స్నేహితులు.
మాదాపూర్ మైండ్‌స్పేస్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో వీరు పని చేస్తున్నారు. శుక్రవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఇన్నోవా కారులో కరీంనగర్– హైదరాబాద్ రాజీవ్ రహదారి తుర్కపల్లిలో అల్పాహారం తిని తిరిగి వెళ్తున్నారు. ఈ క్రమంలో లాల్‌గడి మలక్‌పేట విమల ఫీడ్స్ వద్ద.. ముందు వెళ్తున్న వాహనాన్ని వీరి కారు ఓవర్ టేక్ చేయబోయి డివైడర్‌ను ఢీకొట్టి.. శామీర్‌పేట నుంచి తుర్కపల్లి వైపు వస్తున్న బయోలాజికల్ ఫార్మా కంపెనీకి చెందిన బస్సుతో పాటు స్కూటీని ఢీకొని పల్టీలు కొట్టి నుజ్జునుజ్జయింది.
ఈ ప్రమాదంలో ఇన్నోవా కారులో ప్రయాణిస్తున్న మోహన్, దీపిక అక్కడికక్కడే మృతి చెందారు. బయోలాజికల్ కంపెనీకి చెందిన బస్సులో ప్రయాణిస్తున్న 10 మందితో పాటు, స్కూటీపై వెళ్తున్న ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మోహన్, దీపిక మృతదేహాలను గాంధీ మార్చురీకి పంపించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ప్రమాద స్థలాన్ని పరిశీలించిన డీసీపీ..
ప్రమాద స్థలాన్ని మేడ్చల్ జోన్ డీసీపీ కోటిరెడ్డి, పేట్ బషీరాబాద్ ఏసీపీ రాములు, అల్వాల్ ట్రాఫిక్ ఏసీపీ వెంకట్‌రెడ్డి, ట్రాఫిక్ సీఐ హన్మంత్‌రెడ్డి పరిశీలించారు. ఇన్నోవా కారు అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక దర్యాప్తులో తెలుస్తోందని పోలీసులు అంచనా వేస్తున్నారు.
చాకచక్యంగా వ్యవహరించిన బస్సు డ్రైవర్..
ఇన్నోవా కారు అతివేగంతో వచ్చి ఢీకొన్న ఘటనలో ఫార్మా కంపెనీ బస్సు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో భారీ ప్రమాదం తప్పింది. ఆ సమయంలో బస్సులో 44 మంది ఉన్నారు. కారు ఢీ కొనడంతో బస్సును డ్రైవర్ ఎడమవైపు చెట్ల పొదల్లోకి తీసుకెళ్లాడు. బస్సులో ఉన్నవారిలో 10 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment