Innova accident
-
Software Employees: ప్రాణాలు తీసిన ఓవర్ టేక్
శామీర్‌పేట్: మితిమీరిన వేగం.. నిర్లక్ష్యం.. ఇద్దరు యువ సాఫ్ట్వేర్ ఉద్యోగులను బలిగొంది. ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో మొదట రోడ్డు డివైడర్‌ను ఢీకొని ఆ తర్వాత ఫార్మా కంపెనీ బస్సును ఢీకొట్టిన ప్రమాదంలో కారులోని ఇద్దరూ దుర్మరణం చెందారు. ఈ ఘటన శుక్రవారం నగర శివారులోని శామీర్‌పేట మండలం జినోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తూంకుంట మున్సిపాలిటీ హకీంపేటకు చెందిన మోహన్ (25), మౌలాలీకి చెందిన దీపిక(23) స్నేహితులు. మాదాపూర్ మైండ్‌స్పేస్‌లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో వీరు పని చేస్తున్నారు. శుక్రవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఇన్నోవా కారులో కరీంనగర్– హైదరాబాద్ రాజీవ్ రహదారి తుర్కపల్లిలో అల్పాహారం తిని తిరిగి వెళ్తున్నారు. ఈ క్రమంలో లాల్‌గడి మలక్‌పేట విమల ఫీడ్స్ వద్ద.. ముందు వెళ్తున్న వాహనాన్ని వీరి కారు ఓవర్ టేక్ చేయబోయి డివైడర్‌ను ఢీకొట్టి.. శామీర్‌పేట నుంచి తుర్కపల్లి వైపు వస్తున్న బయోలాజికల్ ఫార్మా కంపెనీకి చెందిన బస్సుతో పాటు స్కూటీని ఢీకొని పల్టీలు కొట్టి నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో ఇన్నోవా కారులో ప్రయాణిస్తున్న మోహన్, దీపిక అక్కడికక్కడే మృతి చెందారు. బయోలాజికల్ కంపెనీకి చెందిన బస్సులో ప్రయాణిస్తున్న 10 మందితో పాటు, స్కూటీపై వెళ్తున్న ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మోహన్, దీపిక మృతదేహాలను గాంధీ మార్చురీకి పంపించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన డీసీపీ.. ప్రమాద స్థలాన్ని మేడ్చల్ జోన్ డీసీపీ కోటిరెడ్డి, పేట్ బషీరాబాద్ ఏసీపీ రాములు, అల్వాల్ ట్రాఫిక్ ఏసీపీ వెంకట్‌రెడ్డి, ట్రాఫిక్ సీఐ హన్మంత్‌రెడ్డి పరిశీలించారు. ఇన్నోవా కారు అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక దర్యాప్తులో తెలుస్తోందని పోలీసులు అంచనా వేస్తున్నారు. చాకచక్యంగా వ్యవహరించిన బస్సు డ్రైవర్.. ఇన్నోవా కారు అతివేగంతో వచ్చి ఢీకొన్న ఘటనలో ఫార్మా కంపెనీ బస్సు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో భారీ ప్రమాదం తప్పింది. ఆ సమయంలో బస్సులో 44 మంది ఉన్నారు. కారు ఢీ కొనడంతో బస్సును డ్రైవర్ ఎడమవైపు చెట్ల పొదల్లోకి తీసుకెళ్లాడు. బస్సులో ఉన్నవారిలో 10 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. -
ఆర్టీసీ బస్సు ఇన్నోవా కారు ఢీ
చెన్నేకొత్తపల్లి (రాప్తాడు) : హైదరాబాద్-బెంగళూరు 44వ నంబర్ జాతీయ రహదారిలోని చెన్నేకొత్తపల్లి మండలం ఎన్ఎస్గేట్ వై.జంక్షన్లో ఆర్టీసీ బస్సు ఇన్నోవా కారు శుక్రవారం ఢీకొన్నాయి. రెండు వాహనాల్లోని ఎనిమిది మంది గాయపడినట్లు ఎస్ఐ మహహ్మద్ రఫీ తెలిపారు. తాడిపత్రి డిపొకు చెందిన ఆర్టీసీ బస్సు 39 మంది ప్రయాణికులతో బెంగళూరుకు బయలుదేరింది. ఇన్నోవా కారులో ఆరుగురు కర్ణాటక రాష్ట్రం బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్నారు. మార్గమధ్యంలో వై.జంక్షన్లోకి రాగానే ఇన్నోవా కారు, ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. ప్రమాదంలో ఇన్నోవా ముందు భాగం నుజ్జునుజ్జు కాగా, ఆర్టీసీ బస్సు పాక్షికంగా దెబ్బతింది. జాతీయ రహదారి నుంచి ఎన్.ఎస్.గేట్ వైపునకు వెళ్లే ఆర్టీసీ బస్సు ఎలాంటి సిగ్నల్ ఇవ్వకపోవడంతోనే ప్రమాదం జరిగిందని ఎస్ఐ తెలిపారు. ఇన్నోవాలో ప్రయాణిస్తున్న మహేశ్దేశాయి, నవనీత్రాయి, మీనాబెన్, మహేశ్బాయి, సిం«ధూబెన్, విఘ్నేష్ ఉపా«ధ్యాయతో పాటు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న తాడిపత్రికి చెందిన విజయలక్ష్మీ, లక్ష్మీ గాయపడ్డారు. వారిని 108, హైవే పెట్రోలింగ్ అంబులెన్సులో అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే ఎస్ఐ సహా ఎంపీడీఓ రామాంజినేయులు, ధర్మవరం డిపో మేనేజర్ ప్రశాంతి, తహశీల్దార్ నాగరాజు, ఆర్ఐ హరికుమార్, వీఆర్వో నజీర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను ప్రయాణికులు, స్థానికులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి, ఇతర ప్రయాణికులను మరో బస్సులో బెంగళూరుకు పంపారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ప్రమాదానికి గురైన వాహనాలను తొలగించి చెన్నేకొత్తపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఐదుగురిని కాపాడిన చెట్టు..!
⇒ ఘాట్‌పై సెల్ఫీ తీసుకుంటున్న వారిని కాపాడబోయి ప్రమాదం ⇒ హార్సిలీహిల్స్ ఘాట్‌లో లోయలోకి దూసుకెళ్లిన ఇన్నోవా బి.కొత్తకోట(చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలంలోని ప్రఖ్యాత పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్ ఘాట్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో ఐదుగురు పర్యాటకులను ఓ చెట్టు ఆధారంగా బయటపడ్డారు. ఈ సంఘటన బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. మదనపల్లె పట్టణానికి చెందిన హరీశ్ తన నలుగురు మిత్రులతో కలసి ఇన్నోవా వాహనంలో హార్సిలీహిల్స్ సందర్శనకు వచ్చారు. కొండపై పర్యటన ముగించుకొని వెళ్తుండగా.. 9వ ఘాట్‌రోడ్డు మలుపు వద్ద కొందరు యువకులు బైక్‌ను రోడ్డుపై నిలబెట్టి సెల్ఫీ తీసుకుంటున్నారు. ఇది గమనించిన డ్రైవర్ రాజేష్ వారిని తప్పించేందుకు సడన్ బ్రేక్‌వేసినప్పటికీ ఇన్నోవా ఆగలేదు. రక్షిత గోడను ఢీకొంటూ లోయవైపు దూసుకెళ్లింది. అయితే వాహనం 10 అడుగుల ముందుకువెళ్లి అక్కడే ఉన్న ఓ చెట్టును ఢీకొనడంతో లోయలో పడకుండా తప్పించుకున్నారు. ముందు చక్రం మొక్కను గట్టిగా అతుక్కుపోవడంతో ఇన్నోవా ముందుకు కదల్లేదు. కాసేపటికి తేరుకున్న డ్రైవర్ మిగతా వారు డోర్లు తీసుకుని బయటపడ్డారు.