ఆర్టీసీ బస్సు ఇన్నోవా కారు ఢీ
చెన్నేకొత్తపల్లి (రాప్తాడు) : హైదరాబాద్-బెంగళూరు 44వ నంబర్ జాతీయ రహదారిలోని చెన్నేకొత్తపల్లి మండలం ఎన్‌ఎస్‌గేట్ వై.జంక‌్షన్‌లో ఆర్టీసీ బస్సు ఇన్నోవా కారు శుక్రవారం ఢీకొన్నాయి. రెండు వాహనాల్లోని ఎనిమిది మంది గాయపడినట్లు ఎస్‌ఐ మహహ్మద్ రఫీ తెలిపారు. తాడిపత్రి డిపొకు చెందిన ఆర్టీసీ బస్సు 39 మంది ప్రయాణికులతో బెంగళూరుకు బయలుదేరింది. ఇన్నోవా కారులో ఆరుగురు కర్ణాటక రాష్ట్రం బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్నారు. మార్గమధ్యంలో వై.జంక‌్షన్‌లోకి రాగానే ఇన్నోవా కారు, ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. ప్రమాదంలో ఇన్నోవా ముందు భాగం నుజ్జునుజ్జు కాగా, ఆర్టీసీ బస్సు పాక్షికంగా దెబ్బతింది.
జాతీయ రహదారి నుంచి ఎన్.ఎస్.గేట్ వైపునకు వెళ్లే ఆర్టీసీ బస్సు ఎలాంటి సిగ్నల్ ఇవ్వకపోవడంతోనే ప్రమాదం జరిగిందని ఎస్‌ఐ తెలిపారు. ఇన్నోవాలో ప్రయాణిస్తున్న మహేశ్‌దేశాయి, నవనీత్‌రాయి, మీనాబెన్, మహేశ్‌బాయి, సిం«ధూబెన్, విఘ్నేష్ ఉపా«ధ్యాయతో పాటు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న తాడిపత్రికి చెందిన విజయలక్ష్మీ, లక్ష్మీ గాయపడ్డారు. వారిని 108, హైవే పెట్రోలింగ్ అంబులెన్సులో అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే ఎస్‌ఐ సహా ఎంపీడీఓ రామాంజినేయులు, ధర్మవరం డిపో మేనేజర్ ప్రశాంతి, తహశీల్దార్ నాగరాజు, ఆర్‌ఐ హరికుమార్, వీఆర్‌వో నజీర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను ప్రయాణికులు, స్థానికులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి, ఇతర ప్రయాణికులను మరో బస్సులో బెంగళూరుకు పంపారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ప్రమాదానికి గురైన వాహనాలను తొలగించి చెన్నేకొత్తపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.