ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ మహిళల సంఖ్య ఇది
ఏడాదిలో ‘జీరో’ టికెట్ రూపేణా రూ.1,152 కోట్లు ఆదా
గ్రేటర్ పరిధిలో 105 శాతం పెరిగిన ఆక్యుపెన్సీ
రోజుకు సుమారు 14.70 లక్షల మంది మహిళల జర్నీ
పురుషులు 6.80 లక్షల మంది మాత్రమే..
సాక్షి, హైదరాబాద్: సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని వినియోగించుకున్న మహిళల సంఖ్య 50 కోట్లకు చేరింది. గృహిణులు సహా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, విద్యారి్థనులు తదితర రంగాల్లో పని చేసే చిరుద్యోగినులు, ఐటీ కారిడార్‌లలో పని చేసే హౌస్‌కీపింగ్ సిబ్బంది వంటి వివిధ కేటగిరీలకు చెందిన మహిళలు ఆర్టీసీ ఉచిత ప్రయాణ సదుపాయాన్ని సది్వనియోగం చేసుకుంటున్నారు. నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న గ్రేటర్ ఆరీ్టసీకి వెన్నుదన్నుగా నిలిచారు. ఆర్టీసీ ఆక్యుపెన్సీని రెట్టింపు చేశారు. ఉచిత ప్రయాణ సదుపాయం వల్ల మహిళా ప్రయాణికులకు ఇప్పటివరకు రూ.1,152 కోట్లు ఆదా అయింది. అదే సమయంలో ‘జీరో’ టికెట్ చార్జీలను ప్రభుత్వమే చెల్లిస్తుండటంతో ఆరీ్టసీకి ఆదాయం పెరిగింది. గత సంవత్సరం డిసెంబర్ 7వ తేదీన ‘మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. గతంలో 45 శాతం మహిళలు, 55 శాతం పురుషులు సిటీ బస్సుల్లో ప్రయాణం చేసేవారు. ఈ పథకం అమల్లోకి వచి్చనప్పటి నుంచి 70 శాతానికి పైగా మహిళలు, 30 శాతం పురుషులు సిటీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు.
ఆక్యుపెన్సీ అదరహో..
ప్రస్తుతం గ్రేటర్‌లోని 25 డిపోల పరిధిలో సుమారు 2,500 బస్సులు ప్రతి రోజు 7.67 లక్షల కిలోమీటర్లు తిరుగుతున్నాయి. రోజుకు 21.50 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. వీరిలో 14.70 లక్షల మంది మహిళలే కావడం గమనార్హం. 6.80 లక్షల మంది మాత్రమే మగవారు ప్రయాణం చేస్తున్నారు. ఈ పథకాన్ని ప్రవేశపెట్టడానికి ముందు సిటీ బస్సుల్లో ఆక్యుపెన్సీ 65 నుంచి 70 శాతం వరకు ఉంటే ఇప్పుడు ఏకంగా 105 శాతానికి పెరిగింది. ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలే ఎక్కువగా ప్రయాణం చేస్తుండగా మగవారు మెట్రోడీలక్స్, ఏసీ బస్సుల్లో ఎక్కువగా ప్రయాణం చేస్తున్నారు. మెట్రో పాస్‌లపై రాకపోకలు సాగించిన విద్యారి్థనులు సైతం ఉచిత పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. దీంతో 1.30 లక్షల బస్సు పాస్‌ల సంఖ్య 60 వేలకు తగ్గినట్లు అధికారులు చెప్పారు. అలాగే మహిళలు, ఎన్జీఓల పాస్‌లు కూడా సుమారు లక్ష వరకు తగ్గాయి.
మెట్రోపై ప్రభావం..
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయంతో గ్రేటర్‌లో ఆటోలు, సెవెన్ సీటర్ ఆటోలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి. నిర్మాణ రంగానికి చెందిన కూలీలు, చిరుద్యోగులు, శివారు ప్రాంతాల నుంచి నగరంలోకి రాకపోకలు సాగించేవారు ఆటోలను ఎక్కువగా వినియోగించేవారు. ప్రస్తుతం ఆ ప్రయాణికులంతా ఆర్టీసీ వైపు మళ్లారు. అలాగే మెట్రో ల్లోనూ ప్రయాణించే మహిళల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం ప్రతిరోజూ 4.8 లక్షల మంది వరకు మెట్రోల్లో ప్రయాణం చేస్తున్నారు. ఈ పథకాన్పి ప్రవేశపెట్టిన తర్వాత కనీసం 10 శాతం మంది మహిళలు ఆర్టీసీ బస్సులను ఆశ్రయించినట్లు మెట్రో అధికారుల అంచనా. మొత్తంగా ఇతర రవాణా సదుపాయాల నుంచి సుమారు 6 లక్షల మందికి పైగా మహిళలు ఆర్టీసీ బస్సుల వైపు మళ్లారు.
చిరుద్యోగులకు భరోసా...
వస్త్ర దుకాణాలు షాపింగ్‌మాళ్లు, సూపర్ మార్కెట్లు, మెడికల్ షాపులు, ఐటీ సంస్థలు తదితర ప్రైవేట్ రంగాల్లో పనిచేసే మహిళలకు ఆర్థికంగా ఈ పథకం భరోసా ఇచ్చింది. ప్రతినెలా సుమారు రూ.3500 వరకు చార్జీల రూపంలో చెల్లించే మహిళలు ఇప్పుడు ఆ డబ్బులను ఇతర అవసరాలకు వినియోగించుకుంటున్నారు. ‘ఇంటి కిరాయిలు, కూరగాయల ధరలు, నిత్యావసరవ వస్తువుల ధరలు భారీగా పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో ఈ భారం తగ్గడం కొద్దిగా ఊరటే కదా’ అని అశోక్‌నగర్‌కు చెందిన సునీత అనే ప్రయాణికురాలు అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment