డివైడర్‌ను బైక్ ఢీకొని ఇద్దరు యువ సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల దుర్మరణం
గచ్చిబౌలి: అతివేగం ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల ప్రాణాలను బలిగొంది. మితిమీరిన వేగం ఎంతటి ప్రమాదమో ఈ విషాదకర ఘటన తెలియజెప్పింది. గచ్చిబౌలి పరిధిలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో వెంకన్న స్వామి (30), దేవ్ కుమార్ స్వామి (25) అనే యువ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు దుర్మరణం చెందారు.
గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్ హబీబుల్లా ఖాన్ తెలిపిన వివరాలప్రకారం.. ఏపీలోని కాకినాడకు చెందిన కేవీ కృష్ణారావు కుమారుడు కేసాని వెంకన్న స్వామి అమెజాన్ కంపెనీలో, వైజాగ్‌లోని హరిజన బస్తీకి చెందిన చెందిన పిల్లి కుమార స్వామి కుమారుడు దేవ్‌కుమార్ స్వామి మైక్రోసాఫ్ట్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పని చేస్తున్నారు. నానక్‌రాంగూడలో ఓ పీజీ హాస్టల్‌లో ఉంటున్నారు.
గురువారం రాత్రి వీరిద్దరూ కలిసి సెకండ్ షో సినిమాకు వెళ్లారు. సినిమా చూసి శుక్రవారం తెల్లవారు జామున 2.15 గంటల సమయంలో బైక్‌పై వస్తుండగా ట్రిపుల్ ఐటీ జంక్షన్ వద్ద ఎడమ వైపు ఉన్న డివైడర్‌ను ఢీకొట్టారు. బైక్ ఎగిరి పల్టీ కొట్టింది. ఇద్దరూ కిందపడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కొండాపూర్ జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందారు. మృతదేహాలకు ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అతివేగం కారణంగానే బైక్ అదుపుతప్పి ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. గచి్చ»ౌలి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment