‘దుర్గం’పైసుందర మార్గం
- రూ. 250 కోట్లతో వేలాడే వంతెన
- సందర్శకులను ఆకట్టుకునేలా ‘హౌరా’ తరహాలో ఏర్పాటు
- జూబ్లీహిల్స్- హైటెక్‌సిటీ రోడ్డులో తప్పనున్న ‘జాం’జాటం
సాక్షి, సిటీబ్యూరో : ఓవైపు .. జూబ్లీహిల్స్ నుంచి హైటెక్‌సిటీ, మాదాపూర్‌ల వైపు వెళ్లే వారికి ట్రాఫిక్ జాంజాటాన్ని తప్పిస్తూనే, మరోవైపు.. పర్యాటక కేంద్రంగానూ సందర్శకులను ఆకట్టుకునేలా ఓ అందమైన వంతెన నగరంలో అందుబాటులోకి రానుంది. ఎలాంటి స్తంభాల ఆధారం లేకుండా ఏర్పాటు కానున్న ఈ వేలాడే వంతెన(సస్పెన్షన్ బ్రిడ్జి)ను దుర్గం చెరువుపై నిర్మించనున్నారు.
హౌరా- కోల్‌కతాల మధ్య ఉన్న హౌరా బ్రిడ్జిని( రవీంద్ర సేతు) తలపించే ఈ వంతెనను జీహెచ్‌ఎంసీ, ఏపీఐఐసీ, పర్యాటకశాఖల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించనున్నారు. దీనికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) బాధ్యతను ఏపీఐఐసీ.. ‘రైల్ ఇండియా టెక్నో, ఎకనామిక్, సర్వీసెస్(రైట్స్)’కు అప్పగించింది. అది ట్రాఫిక్, పర్యావరణం, చెరువుపై నిర్మాణం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని క్షేత్రస్థాయి సర్వేతో డీపీఆర్‌ను పూర్తిచేసింది. నిర్మాణవ్యయాన్ని రూ. 250 కోట్లుగా ప్రాథమికంగా అంచనా వేశారు.
ఈ బ్రిడ్జి ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ఆయా ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారుల నేతృత్వంలో సాంకేతిక, స్టీరింగ్ కమిటీలను ఏర్పాటు చేసింది. ఏపీఐఐసీ టూరిజం, జీహెచ్‌ఎంసీల అధికారులు ఈ కమిటీల్లో సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీలు త్వరలో సమావేశమై బ్రిడ్జి పనులకు సంబంధించి నిర్ణయం తీసుకోనున్నాయి. ఏయే ప్రభుత్వ విభాగాలు ఎంత వ్యయాన్ని భరించాలనే అంశాలను సైతం త్వరలో జరగబోయే సమావేశాల్లో నిర్ణయించనున్నారు.
అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి సమీప ప్రాంతం నుంచి మాదాపూర్ ఇనార్బిట్‌మాల్ వరకు ఈ వంతెనను నిర్మించనున్నట్లు సంబంధిత అధికారి తెలిపారు. ఆరు లేన్లతో నిర్మించే ఈ వంతెన పొడవు 350 మీటర్లు. దీని ట్రాఫిక్ సామర్ధ్యం 7000 పీసీయూ (పర్ అవర్ కార్ యూనిట్). అంటే గంట సమయంలో ప్రయాణించే వాహనాలు. హౌరా బ్రిడ్జి సామర్ధ్యం రోజుకు దాదాపు లక్ష వాహనాలు. ఈ బ్రిడ్జి వాడుకలోకి వస్తే జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 36పై వాహన భారం తగ్గుతుంది.