వృద్ధి అస్త్రం.. ఐటీఐఆర్
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ)కి కేరాఫ్ హైదరాబాద్. హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలిలు ఐటీకి కేంద్రబిందువులు. ఇప్పుడు వీటిని తలదన్నే రీతిలో రంగారెడ్డిజిల్లా సరిహద్దు ప్రాంతాలైన మహేశ్వరం, ఆదిబట్ల, పోచారం, ఉప్పల్‌లకు ఐటీరంగ సంస్థలు రానున్నారుు. విభజన నేపథ్యంలో హైదరాబాద్‌లో ఐటీ పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళనకు ఐటీఐఆర్ ప్రాజెక్టు చెక్ పెట్టనుంది. కేంద్రం ప్రకటించిన ఐటీఐఆర్ ప్రాజెక్ట్‌తో నగర శివారు ప్రాంతాల రూపురేఖలు మారనున్నారుు.
- న్యూస్‌లైన్, ఇబ్రహీంపట్నం రూరల్
ఇబ్రహీంపట్నం రూరల్, న్యూస్‌లైన్: ఐటీ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) ప్రధాన కేంద్రం నగరం నుంచి శివారు ప్రాంతాలకు బదిలీ కానుంది. ముఖ్యంగా ఆదిబట్ల, మహేశ్వరంలో ఐటీ అనుబంధ కంపెనీలు రూపుదిద్దుకుంటున్నాయి. టీసీఎస్, కాగ్నిజెంట్, బయోజెనిక్స్, టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్, లాకిడ్ మార్టిన్, ఏరోస్పేస్ అండ్ ప్రెసిషన్ ఇంజినీరింగ్ సెజ్ తదితర ఐటీ కార్యకలాపాలు సాగించే ప్రతిష్టాత్మక సంస్థలకు ఆదిబట్ల కేంద్రస్థానం కాబోతుంది.
ఈ క్రమంలో ఆదిబట్ల పరిసర ప్రాంతా ల్లో మరిన్ని బహుళజాతి, ఐటీ కంపెనీలు వచ్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నా యి. ఇటీవల పలు చిన్న, మధ్యస్థాయి ఐటీ కంపెనీలు సంయుక్తంగా సమూహ ఇంజినీరింగ్ ఇండస్ట్రీస్‌ను ఏర్పాటు చేశాయి. ఇటీవల స్థిరాస్థి వ్యాపారంలో స్తబ్ధత ఏర్పడినప్పటికీ ఐటీఐఆర్ వంటి ప్రాజెక్టులతో భవిష్యత్‌లో పుంజుకునే అవకాశాలు కల్పిస్తున్నాయి.
కేసీఆర్ నోట.. ఐటీఐఆర్ మాట
రాష్ట్ర ముఖ్యమంతి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తన ప్రమాణ స్వీకారం రోజున ముఖ్యంగా ఐటీఐఆర్ గురించి పదేపదే ప్రస్తావించారు. అద్భుతమైన ఐటీఐఆర్ ప్రాజెక్టు వుంది కాబట్టి ఈ ప్రాంత ఐటీ, స్థిరాస్థి వ్యాపారానికి బెంగ అవసరం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చించి ఈ ప్రాజెక్టు కార్యాచరణపై చర్చించనున్నట్లు సీఎం ప్రకటించారు. ఆయన ఢిల్లీ పర్యటనలో భాగంగా ఐటీఐఆర్ గురించి చర్చించే అవకాశాలున్నాయి.
మరోవైపు ఐటీశాఖ మంత్రి తారకరామారావు ఇటీవల ఐటీ కంపెనీల ప్రతినిధులతో సమావేశమైనప్పుడు ఈ ప్రాంతంలో చేపట్టబోయే ఐటీఐఆర్ ప్రాజెక్టుపై ప్రత్యేక ఆసక్తి కనబర్చినట్లు సవూచారం. ఇలాంటి ప్రాజెక్టులతో మరిన్ని పెట్టుబడుల్ని స్వాగతించి ఐటీ కి కేరాఫ్ అడ్రస్‌గా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామని కేటీఆర్ ప్రకటించారు.
ఐటీఐఆర్..
గత ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఐటీఐఆర్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్) ప్రాజెక్ట్ కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేసింది. రూ.2.19 లక్షల కోట్లతో 50వేల ఎకరాల్లో ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలను ఏర్పాటు చేసి ఈ ప్రాంత అభివృద్ధికి కేంద్రం ఆమోదం తెలిపింది. హైదరాబాద్ నగరం చుట్టూ మూడు క్లస్టర్‌లుగా ఐటీఐఆర్ ప్రాజెక్టులను ఏర్పాటు చే య నున్నారు. ఎయిర్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ క్లస్టర్ పరిధిలో శంషాబాద్ విమానాశ్రయం, మామిడిపల్లి, మహేశ్వ రం, ఆదిబట్ల వున్నాయి. ఔటర్‌రింగ్‌రోడ్డు చుట్టూ అభివృద్ధి చేసే దిశగా ఈ ప్రాంతాన్ని గుర్తించారు.
సైబరాబాద్ డెవలప్‌మెంట్ ఏరియాలో మాదాపూర్, మణికొండ, గచ్చిబౌలి, కోకాపేట తది తర ప్రాంతాలు వున్నాయి. ఉప్పల్ క్లస్టర్ పరిధిలో పోచారం తదితర ప్రాంతాలున్నాయి. ఎయిర్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ క్లస్టర్‌లో భాగంగా ఆదిబట్ల, మహేశ్వరం, రావిర్యాల, మామిడిపల్లిలో 79.2 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఈ రీజియన్ ఏర్పాటవుతోంది. ఔటర్‌రింగ్‌రోడ్డు గ్రోత్‌కారిడార్-1కు 11.5 చ.కిమీ, కారిడార్-2కు 14.3చ.కిమీ కేటాయించి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి బొంగ్లూర్ ఔటర్‌రింగ్‌రోడ్డు వరకు దీనిని అనుసంధానం చేస్తారు.
రెండు దశల్లో..
ఐటీఐఆర్‌లో చిన్న, మధ్య తరహా సంస్థలను ఏర్పాటు చేస్తారు. మొదటిదశలో 2013 నుంచి 2018 వరకు ప్రాజెక్టు పనులను చేపడతారు. ఇందులో భాగంగా రూ.3,275 కోట్ల వ్యయంతో ఔటర్‌రింగ్‌రోడ్డుకు గల 3రేడియల్ రోడ్లను అభివృద్ధి చేస్తారు. రెండో దశలో 2018 నుంచి 2038 వరకు ఐటీఐఆర్ మౌలిక సదుపాయాలను రూపొందిస్తారు.
కేంద్ర సాయం..
ఐటీఐఆర్‌లో రహదారులు, విమాన ప్రయాణ సదుపాయాల అభివృద్ధి కోసం అయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వం భరించనుంది. మౌలిక వసతుల కల్పన వ్యయ అంచనాను రూ.4863 కోట్లుగా కేంద్రం అంచనా వేసింది. తొలిదశలో రూ.942 కోట్లు, మలిదశలో రూ.3921 కోట్లు కేటాయించనుంది. ఇవన్నీ ఏర్పాటైతే నగరశివారు ప్రాంతాలు దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి వస్తాయి.
ఉపాధి..
ఐటీఐఆర్‌తో తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ పరిస్థితిని కొంతవరకు రూపుమాపొచ్చని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఇరు ప్రభుత్వాలు కృషిచేయాల్సిన ఆవశ్యకత వుంది. దాదాపు 15లక్షల వుందికి ప్రత్యక్ష, 56లక్షల వుందికి పరోక్షంగా ఉపాధి లభించే అవకాశం ఉన్నట్లు ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. ఐటీఐఆర్‌తో శేరిలింగంపల్లి, హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం, రామచంద్రాపురం, ఘట్‌కేసర్, ఉప్పల్, మహేశ్వరం, రాజేంద్రనగర్, సరూర్‌నగర్ మండలాలు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతాయుని స్థానికులు ఆశిస్తున్నారు.