డబ్బులు ఖాతాల్లో.. కష్టాలు ఇళ్లల్లో!
డబ్బులు ఖాతాల్లో.. కష్టాలు ఇళ్లల్లో!
Published Sun, Dec 11 2016 9:42 PM | Last Updated on Mon, Sep 4 2017 10:28 PM
- బ్యాంకులకు సెలవులు... ఏటీఎంల్లో డబ్బుల్లేవ్
- ప్రజలకు పెరిగిన ఆర్ధిక సమస్యలు
- నగదు ఉన్న ఏటీఎంలకు పెరిగిన జనాల తాకిడి
- మహిళలు ఏటీఎం బాట
కర్నూలు(అగ్రికల్చర్): ఆదివారం .. సెలవు రోజు. ఇంటి పనులు చూసుకుని కుటుంబీకులతో సరదాగా గడిపేందుకు అందరూ ఇష్టపడతారు. పెద్ద నోట్ల మార్పిడితో ఏర్పడిన నగదు సంక్షోభంతో అందరూ ఏటీఎం బాట పడ్డారు. మహిళలు సైతం పనులు వదులుకుని ఏటీఎం వద్ద క్యూలో నిలబడ్డారు. బ్యాంకుల్లో నగదు కొరత వల్ల 4 వేల వరకు మాత్రమే ఇస్తుండటం, గురువారం నుంచి పలు బ్యాంకుల్లో కరెన్సీ లేకపోవడం, ఏటీఎంల్లో నగదు ఉన్న ఏటీఎంల్లో రూ.2000. 2500 మాత్రమే వస్తుండటంతో ఇవి ఏ మూలకు సరిపోవడం లేదు. మొబైల్ ఏటీఎంలు మూడు ప్రారంభించినా అవి మూన్నాళ్ల ముచ్చట అయింది. అవి కూడా మూలన పడటంతో ఆర్థిక సమస్యలు పెరిగాయి.దీనికి తోడు బ్యాంకులకు సెలవులు రావడం.... ఏటీఎంల్లో డబ్బులు లేకపోవడంతో అన్ని వర్గాల ప్రజలకు కష్టాలు, కన్నీళ్లు తప్పడం లేదు. ఫలాన ఎటీఎంలో నగదు ఉందంటే చాలు నిమిషాల్లో వందలాది మంది తరలివస్తున్నారు. మొన్నటి వరకు ఏటీఎంల దగ్గర మహిళలు అంతాగా ఉండటం లేదు.ఆదివారం మాత్రం మహిళలు పనులు వదులు కొని భారీగా వచ్చారు.
జిల్లాకు రూ.75 కోట్లు..
ఆంధ్రబ్యాంకు, ఎస్‌బీఐ కరెన్సీ చెస్ట్‌లకు రూ.75 కోట్ల కరెన్సీ వచ్చినా బ్యాంకులకు సోమవారం వరకు సెలవులు ఉండటంతో నగదు బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది. సెలవుల కారణంగా ఏటీఎంల్లో నగదు కరువు అయింది. జిల్లా మొత్తం 10లోపు ఏటీఎంలు పనిచేస్తున్నా వాటిల్లోను నగదు ఖాళీ కావడంతో ప్రజలకు ఆర్థిక ఇబ్బందులు మరిన్ని ఎక్కువ అయ్యాయి. జిల్లాలో 485 ఏటీఎంలు ఉన్నాయి. మొన్నటి వరకు కర్నూలులో ఎస్‌బీఐ మొయిన్ బ్రాంచిలోని ఏటీఎంలతో పాటు మరో మూడు ఏటీఎంలు పనిచేశాయి. బ్యాంకులకు సెలవులు రావడం, వచ్చిన నగదు కూడా బ్యాంకులకు వెల్లకపోవడంతో ఆదివారం వీటిలోను ఒకటి రెండు మాత్రమే పనిచే శాయి. ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచిలో నగదు ఉండటంతో తీసుకునేందుకు జనాలు పోటెత్తారు. ఏటీఎంలోకి పోవడానికి దాదాపు మూడు గంటలు పడుతుందంటే తాకిడీ ఏ స్థాయిలో ఉందో స్పష్టం అవుతోంది. సోమవారం కూడ బ్యాంకులకు సెలవు ఉండటంతో ప్రజలకు ఇబ్బందులు తప్పని పరిస్థితి ఏర్పడింది. ఆంధ్రబ్యాంకు, ఇండియన్ బ్యాంకు, విజయబ్యాంకు, కెనరాబ్యాంకు తదితర బ్యాంకుల ఏటీఎంలు గత నెల నుంచి మూత పడే ఉన్నాయి.
Advertisement
Advertisement