న్యూ ఇయర్ రోజూ అవే కష్టాలు
నగరంలో తెరుచుకోని
సుమారు 4 వేల ఏటీఎంలు
సిటీబ్యూరో: క్యాలెండర్ మారింది... కొత్త సంవత్సరం వచ్చింది. కానీ న్యూ ఇయర్ సంబురాలకు గ్రేటర్ సిటీజన్లకు నగదు కటకట తప్పలేదు. డిసెంబర్ 31, జనవరి ఒకటవ తేదీల్లో నగరంలో ఎక్కడ చూసినా ఏటీఎం కేంద్రాల్లో నో క్యాష్ బోర్డులు దర్శనమివ్వడంతో సిటీజన్లు విందు, వినోదాలకు దూరమయ్యారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రముఖ పర్యాటక, దర్శనీయ కేంద్రాలు, పార్కులకు వెళ్దామనుకున్న వారికీ కరెన్సీ కష్టాలు తప్పలేదు. ఆదివారం (జనవరి 1న) మటన్, చికెన్, ఫిష్, బిర్యానీ వంటకాలతో కడుపునిండా భోజనం చేద్దామనుకున్నవారికి నగదు కష్టాలు తప్పలేదు. చేసేది లేక తమ వద్ద నున్న క్రెడిట్, డెబిట్ కార్డులతో రెస్టారెంట్లు, ఇతర పర్యాటక ప్రదేశాల్లో సిటీజన్లు నెట్టుకొచ్చారు.
కాగా మహానగరం పరిధిలో సుమారు ఐదువేల ఏటీఎం కేంద్రాలుండగా..ఆదివారం కూడా ఇందులో వెయ్యికి మించి పనిచేయకపోవడం గమనార్హం. సోమవారం నుంచైనా నగరంలోని అన్ని ఏటీఎం కేంద్రాల్లో నగదు నిల్వలు ఉండేలా బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలని..ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం బ్యాంకుల్లో నగదు ఉపసంహరణకు అనుమతినివ్వాలని వినియోగదారులకు కోరుతున్నారు. కాగా నోట్ల రద్దు దెబ్బకు నగరంలోని పలు ప్రధాన మార్కెట్లు, మటన్, చికెన్, ఫిష్ మార్కెట్లలో సాధారణం కంటే గిరాకీ భారీగా తగ్గముఖం పట్టినట్లు వ్యాపారులు వాపోయారు.