కష్టాలు తీరవా?? | Ongoing currency issue | Sakshi
Sakshi News home page

కష్టాలు తీరవా??

Published Thu, Mar 9 2017 10:40 PM | Last Updated on Sat, Sep 22 2018 7:53 PM

కష్టాలు తీరవా?? - Sakshi

కష్టాలు తీరవా??

కొనసాగుతున్న కరెన్సీ సమస్య
నగదు కోసం క్యూలైన్లలో పడిగాపులు
సామాన్యులు, ఖాతాదారుల ఇబ్బందులు


శ్రీకాకుళం అర్బన్‌: నగదు కష్టాలు వీడటం లేదు! కరెన్సీ కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి! ఏటీఎంలు ‘నో క్యాష్‌’ బోర్డులతో దర్శనమిస్తున్నాయి! బ్యాంకుల్లోనూ నగదు కొరత తీవ్రంగా ఉండటంతో అధికారులు కూడా చేతులెత్తేస్తున్నారు. దీంతో సామాన్యులు, ఖాతాదారులకు ఇబ్బందులు తప్పడం లేదు.

ఎక్కడికి వెళ్లినా మొండిచెయ్యే..
పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా కరెన్సీ కొరత ఏర్పడింది. అయితే తదనంతర పరిణామాల నేపథ్యంలో ఇప్పుడిప్పుడే ఆ ఇబ్బందులు తప్పాయి అనుకుంటున్న జిల్లా వాసులకు మళ్లీ ‘కరెన్సీ’ షాక్‌ మొదలైంది. ముఖ్యంగా పెద్ద మొత్తంలో నగదు కావాలనుకునే ఖాతాదారులు బ్యాంకులకు వెళ్తే మొండి చెయ్యే ఎదురవు తోంది. దీంతో చేసేది లేక ఉసూరుమంటూ వెనుదిరుగుతున్నారు. చివరికి చిన్న మొత్తం కోసం ఏటీఎం కేంద్రాల వద్దకు వెళ్లినా.. అక్కడ కూడా ‘నో క్యాష్‌’ బోర్డులే కనిపిస్తున్నాయి. దీంతో ఖాతాదారులు, వినియోగదారుల బాధలు వర్ణనాతీతం.

ఎవరైనా బ్యాంకులో డిపాజిట్‌ చేస్తేనే..
నగదు కోసం ఏ బ్యాంకుకు వెళ్లినా ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు. తనకు కావాల్సిన నగదు కోసం విత్‌డ్రా చేసేందుకు వెళితే అక్కడ సరిపడా నగదు ఉండటం లేదు. దీనికి బ్యాంకుల్లో నగదు నిల్వలేకపోవడమే కారణమని తెలుస్తోంది. ఖాతాదారులు నగదును డిపాజిట్‌ చేస్తేనే ఆ సొమ్మును విత్‌డ్రా కోసం వేచి ఉండే ఇతర ఖాతాదారులకు సర్దుబాటు చేస్తున్నారు. డిపాజిట్‌ కనుక రాకపోతే విత్‌డ్రా కోసం వచ్చిన ఖాతాదారులు అలా ఉండాల్సిందే. ఇదే తంతు ఏటీఎంల వద్ద ఏర్పాటు చేసిన క్యాష్‌ డిపాజిట్‌ మెషీన్‌ వద్ద కూడా జరుగుతోంది. ఖాతాదారుడు కొంత మొత్తాన్ని డిపాజిట్‌ చేసిన తర్వాత.. మళ్లీ వేరొకరు విత్‌డ్రా చేస్తే నగదు వస్తోంది. నగదు విషయంలో అంతా సక్రమంగానే ఉందని ఒక పక్క కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు చెబుతుంటే అందుకు భిన్నంగా పరిస్థితులు ఉన్నాయని ప్రజలు, ఖాతాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగదు కష్టాలను ప్రజాప్రతినిధులుగానీ, అధికారులు గానీ పట్టించుకోవడం లేదని వారు ఆందోళన చెందుతున్నారు.

రూ.10నాణేలు తీసుకునేందుకు వెనకడుగు
మరికొన్ని బ్యాంకుల్లో నగదు కోసం వెళ్తే రూ.100, రూ.500, రూ.2వేలు నోట్లు లేకపోవడంతో ఖాతాదారులు ఇబ్బందులు పడ్డారు. ఇదే సమయంలో రూ.10 కాయిన్‌లు తీసుకెళా‍్లలని బ్యాంకు అధికారులు కోరినా.. ఖాతాదారులు వాటిని తీసుకునేందుకు వెనుకడుగు వేస్తున్నారు. రూ.10 కాయిన్లు​చెల్లుబాటు కావనే అపోహ ఉండటంతో తీవ్ర ఇబ్బంది ఎదురవుతోందని సంబంధిత అధికారులు చెబుతున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement