![Dilip Ghosh Takes U Turn After Praises Mamata Administration Control Yaas - Sakshi](/styles/webp/s3/article_images/2021/05/27/Dilip.jpg.webp?itok=Zb4hTbNt)
కోల్‌కతా: అత్యంత తీవ్ర తుఫానుగా మారిన 'యాస్' పశ్చిమ బెంగాల్‌లో పెను విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. తూర్పు మిడ్నాపూర్ జిల్లాలోని దిఘాపై తుపాను ప్రభావం తీవ్రంగా ఉంది. శంకర్‌పుర్, మందర్‌మని, తేజ్పూర్‌ల్లోని చాలా ప్రాంతాలు నీటమునిగాయి. అయితే ముందు జాగ్రత్త చర్యలతో మమతా బెనర్జీ ప్రభుత్వం లక్షలాది మందిని సురక్షిత ప్రాంతానికి తరలించింది.ఈ నేపథ్యంలో బీజేపీ నేత.. ఎంపీ దిలీప్ ఘోష్ బుధవారం బెంగాలీ దినపత్రిక సంగబాద్ ప్రతిదిన్‌తో మాట్లాడుతూ మమతా ప్రభుత్వాన్ని ప్రశంసల్లో ముంచెత్తారు.
''యాస్ తుఫాను విధ్వంసాన్ని ముందే ఊహించి ఎక్కువ ప్రాణనష్టం జరగకుండా ప్రభుత్వం తీసుకున్న ముందు చర్య నాకు నచ్చింది. గతంలో 'అంఫన్' తుఫాన్ సృష్టించిన విధ్వంసం నుంచి పాఠాలు నేర్చుకున్న మమతా ప్రభుత్వం ఈసారి మంచి పని చేసింది. తీరప్రాంతాల్లోని ప్రజలకు తుఫాను గురించి ముందే అవగాహన కల్పించి వారని సురక్షిత ప్రాంతానికి తరలించి ప్రాణనష్టం జరగకుండా చూసుకున్నారు. ప్రస్తుతం తుఫాను ప్రభావంతో రాష్ట్రం అల్లకల్లోలంగా ఉందని.. పరిస్థితి మాములుకు వచ్చిన తరువాత నష్టం విలువ తెలుస్తుంది. అయితే మమతా ముందు చూపుతో నష్టం తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది'' అని పేర్కొన్నారు.
అయితే ఒక్క రోజు తేడాతోనే దిలీప్ ఘోష్ మాట మార్చారు. తుఫాను కట్టడిలో ముందస్తు చర్యలు బాగానే ఉన్నా ప్రభుత్వం సరైన లెక్కలు చెప్పడం లేదన్నారు. . '' రాష్ట్రంలో 134 నదీ తీరాలు తుఫాను కారణంగా కొట్టుకుపోయాయని ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతుంది. వారు ఈ నంబర్ ఎక్కడ నుంచి పొందారో నాకు తెలియదు. రానున్న తుఫాను ముందే పసిగట్టిన మమత ప్రభుత్వం సంఖ్యలను ముందే నిర్థారించారించింది'' అని చురకలంటించారు
కాగా అంతకముందు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తుఫాను ప్రభావంపై స్పందించారు. రాష్ట్రంలో దాదాపు కోటి మందిపై ఈ తుపాను ప్రభావం చూపిందని ఆమె తెలిపారు. 15 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. 3 లక్షల ఇళ్లు ధ్వంసమయ్యాయన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాలకు రూ. 10 కోట్ల విలువైన సహాయసామగ్రిని పంపిణీ చేశామని తెలిపారు. భీకర ఈదురుగాలులు, భారీ వర్షాలను తీసుకువస్తూ బుధవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఒడిశాలోని ధమ్ర పోర్ట్ సమీపంలో తుపాను తీరం దాటింది. మధ్యాహ్నానికి బలహీనపడి జార్ఖండ్ దిశగా వెళ్లింది.
చదవండి: తుఫాన్ వస్తుంటే బయటకొచ్చావ్ ఏంటి.. రిప్లై ఏంటో తెలుసా!
Comments
Please login to add a commentAdd a comment