
ఒబామా పాలనపై అసంతృప్తి, ఆగ్రహం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా చివరి ఏడాదిలో అడుగుపెట్టిన బరాక్ ఒబామా, దేశంలో సానుకూల మార్పులు తీసుకొచ్చారా లేక ప్రతికూల మార్పులు తీసుకొచ్చారా? అన్న అంశంపై ప్రజలు, పార్టీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. సీఎన్‌ఎన్-ఓఆర్‌సీ నిర్వహించిన సర్వే ప్రకారం ఒబామా పాలనపై 75 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేయగా, దేశంలో నెలకొన్న పరిస్థితుల పట్ల 69 శాతం మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు అంశాల్లోనూ 2014 కన్నా ఇప్పుడూ పరిస్థితి మరింత దిగజారిందన్నది మొత్తంగా ప్రజల భావన.
రాజకీయ పార్టీల అభిప్రాయం కూడా దాదాపు ఇలాగే ఉంది. వచ్చే అధ్యక్ష ఎన్నికల బరిలో డోనాల్డ్ ట్రంప్ నామినేషన్‌ను సమర్థిస్తున్న రిపబ్లికన్లలో 90 శాతం మంది ఒబామా పాలనపై అసంతృప్తి వ్యక్తం చేయగా, దేశంలో నెలకొన్న పరిస్థితుల పట్ల 91 శాతం మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో మార్పు తీసుకొస్తానన్న నినాదంతో 2008లో అధికారంలోకి వచ్చిన ఒబామా ఈ ఏడేళ్ల కాలంలో నిజంగా మార్పు తీసుకొచ్చారా? అని అడిగితే కూడా మెజారిటీ ప్రజలు పెదవి విరుస్తున్నారు.
సానుకూల మార్పులు తీసుకొచ్చారని 37 శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేయగా, అంతేమంది ప్రజలు పరిస్థితులను మరింత దిగజార్చారని అభిప్రాయపడ్డారు. ఎలాంటి మార్పు తీసుకరాలేదని 21 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఇక ఒబామా ప్రాతినిధ్యం వహిస్తున్న డెమోక్రట్లను ప్రశ్నించగా, 67 శాతం మంది సానుకూల మార్పులు తీసుకొచ్చారని సమాధానం ఇచ్చారు. పరిస్థితులను మరింత దిగజార్చారని 63 శాతం మంది రిపబ్లికన్లు అభిప్రాయపడ్డారు.
మొత్తంగా ఒబామా పాలన ఎలా ఉందని ప్రశ్నించగా 48 శాతం మంది సానుకూలంగాను, 50 శాతం మంది ప్రతికూలంగా స్పందించారు. ఇదే విషయంలో గతంలో అనుకూలంగా 52 శాతం మంది సానుకూలంగా, 47 శాతం మంది ప్రతికూలంగా స్పందించారు. ఓ నెల రోజుల్లోనే ప్రజల అభిప్రాయంలో మార్పు కనిపిస్తోంది. ఇక దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడంలో ఒబామాకు కొద్దిగా మెరుగైన మార్కులు పడ్డాయి. అదీ ఆశావహ దృక్పథంతో వ్యక్తం చేసిన అభిప్రాయల మేరకు మాత్రమే. ఇందులో ఆయనకు 52 శాతం మంది సానుకూలంగా స్పందించారు. 2009 నుంచి ఇప్పటికీ ఆయనకు ఆర్థిక రంగంలో 50 శాతానికి మంచి సానుకూల స్పందన లభించలేదు. ఇంతకు బాగుందా, లేదా? అంటూ కచ్చితమైన ప్రశ్నకు 49 శాతం మంది ఒబామా ఆధ్వర్యంలో దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందని అభిప్రాయపడగా, 51 శాతం మంది ప్రతికూలంగా స్పందించారు. ఇప్పటి నుంచి వచ్చే ఏడాదిలో ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుందని 56 శాతం మంది ఆశాభావం వ్యక్తం చేశారు. గత నెలలో రేటింగ్స్‌కన్నా ఇప్పటి రేటింగ్స్ కొద్దిగా మెరుగ్గా ఉన్నాయి. దీనికి కారణం చమురు ధరలు పడిపోవడం కావచ్చు.
పారిస్‌లో జరిగిన సమావేశంలో వాతావరణ మార్పులపై ఒప్పందం కుదరడంతో ఈ అంశంలో గత నెలలోకన్నా ఒబామాకు నాలుగు పాయింట్లు పెరిగాయి. ఈ విషయంలో 49 శాతం మంది సానుకూలంగా స్పందించారు. తుపాకుల సంస్కృతిని అరికట్టడంలో ఒబామా విఫలమయ్యారని 62 శాతం మంది ప్రజలు అభిప్రాయపడగా, కేవలం 35 శాతం మంది మాత్రమే సానుకూలంగా స్పందించారు. తుపాకి చట్టాలను కఠినతరం చేయడంలో ఒబామా విజయం సాధించారా? అన్న ప్రశ్నకు 48 శాతం మంది సానుకూలంగా స్పందించగా, 38 శాతం మంది ఇంకా ఎంతో చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. డిసెంబర్ 17 నుంచి 21వ తేదీల మధ్యన టెలిఫోన్ ద్వారా ర్యాండమ్‌గా నిర్వహించిన ఈ సర్వేను సోమవారం విడుదల చేశారు.