
మోదీ పాలనలో అన్నీ వైఫల్యాలే
- హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విమర్శ
- ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది
- ఔరంగజేబు రోడ్డుకు కలాం పేరు పెట్టడం సరికాదు
- ఇకపై కాంగ్రెస్ మాట వినం
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ 15 నెలల పాలనలో అన్ని రంగాల్లో వైఫల్యాలేనని మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. సోమవారం రాత్రి మజ్లిస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత అబ్దుల్ వాహెద్ ఒవైసీ 40వ వర్థంతి సందర్భంగా పాతబస్తీలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలు నెరవేర్చడంలో మోదీ పూర్తిగా విఫలమయ్యారని, ఎన్‌డీఏ పాలనలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని దుయ్యబట్టారు. నిత్యావసర సరుకుల ధరలు, రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని, మోదీ విధానాలతో విదేశీ పెట్టుబడిదారులు వెనక్కి వెళ్లిపోయారని విమర్శించారు. దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాంను అవమానించేందుకు మోదీ సర్కార్ ప్రయత్నిస్తోందని, ఔరంగజేబు రోడ్డు పేరును మార్చి కలాం పేరు పెట్టడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. కలాంపై ప్రేమ ఉంటే ఆయన పేరుతో స్కూల్ పిల్లలకు సైన్స్ స్కాలర్‌షిప్ పథకాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.
దిగ్విజయ్‌కు నోటీస్ పంపిస్తా..
బీజేపీకి లాభం చేకూర్చేలా మజ్లిస్ పార్టీ వ్యవహరిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్ ఆరోపించడం విడ్డూరంగా ఉందని అసదుద్దీన్ అన్నారు. మజ్లిస్ పార్టీపై అనుచిత వాఖ్యలు చేసిన దిగ్విజయ్‌కు లీగల్ నోటీసు పంపిస్తామని, ఆయన చేసిన వాఖ్యలను నిరూపించాలని సవాల్ చేశారు. 70 ఏళ్ల పాటు కాంగ్రెస్ చెప్పింది విన్నామని.. ఇకపై వినేది లేదని స్పష్టం చేశారు. యూపీ రాజకీయాల్లోకి అడుగుపెట్టి తీరుతామన్నారు. బెంగళూర్ స్థానిక ఎన్నికల సందర్భంగా ప్రచారం చేయడానికి అనుమతి ఇవ్వలేదని, బస చేయడానికి కూడా అవకాశం లేకుండా ఇక్కట్లకు గురిచేశారన్నారు. రాబోయే సాధారణ ఎన్నికల్లో తడాఖా చూపిస్తామని ఒవైసీ హెచ్చరించారు. ఈ సభలో మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.