సాక్షి, హైదరాబాద్: బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు పార్టీల ఫెలికాల్ బంధాన్ని గురించి నిజామాబాద్ సాక్షిగా ప్రధాని మోదీ బయటపెట్టారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చడమే బీఆర్ఎస్, బీజేపీ లక్ష్యమని రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కాగా, రేవంత్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ అంటే బీజేపీ రిస్తేదార్ సమితి అని మా నాయకుడు రాహుల్ గాంధీ ముందే చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని సర్వేలు చెబుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి కేసీఆర్‌ను గెలిపించేందుకే మోదీ తెలంగాణలో పర్యటనలు చేస్తున్నారు. పదేళ్లలో విభజన హామీల్లో ఏ ఒక్క హామీ నెరవేర్చే ప్రయత్నం చేయలేదు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను మోదీ అపహాస్యం చేశారు.
మోదీనే ఒప్పుకున్నారు..
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితను అరెస్టు చేయొద్దని కేసీఆర్ అడిగిన విషయాన్ని కూడా మోదీ చెప్పాల్సింది. బీఆర్‌ఎస్ అదేశాలతోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చారు. కేసీఆర్ అవినీతిపై ఎందుకు ఈడీ, సీబీఐ, ఐటీ విచారణ చేయడం లేదు. సీఎం కేసీఆర్ అవినీతి చేశారని ఆరోపణలు చేసినప్పుడు మోదీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ దోపిడీలో బీజేపీకి వాటాలు వెళుతున్నాయి. అందుకే కేసీఆర్‌పై మోదీ చర్యలు తీసుకోవడం లేదు. ఈ నిజాన్ని నిన్న నిజామాబాద్ సాక్షిగా మోదీ ఒప్పుకున్నారు. బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వడంపై ఎంఐఎం పునరాలోచించుకోవాలి. బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటే.. అవిభక్త కవలలు. మోదీ, కేసీఆర్‌ది ఫెవికాల్ బంధం. వారిది గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ. అలాంటి వారికి అసదుద్దీన్ ఎలా మద్దతు ఇస్తారు. ఎంఐఎం ఎవరివైపు నిలబడుతుంది?. బీజేపీతో దోస్తీ కడుతున్న బీఆర్‌ఎస్‌తోనా?. బీజేపీ, బీఆర్‌ఎస్‌ను ఓడించాలంటున్న కాంగ్రెస్ తోనా?.
ఇదంతా నాణేనికి ఒకవైపే..
కేసీఆర్‌కు నీళ్లు అంటే.. కవిత కన్నీళ్లు గుర్తొస్తాయి. నిధులు అంటే దోపిడీ సొమ్ము.. నియామకాలు అంటే కొడుకును సీఎం చేయడం గుర్తొస్తాయి. కేసీఆర్ కొల్లగొట్టిన సొమ్ములతోనే మోదీని ఆయన దర్బారులో సన్మానం చేశారు. ఇదంతా కనిపించే ఒకవైపు మాత్రమే. మరి ఎన్నికల కోసం పంపిన కనిపించని వేల కోట్ల సంగతి ఏంటి?. బీఆర్‌ఎస్ దోపిడీపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. కేసీఆర్ అధిష్టానం నరేంద్ర మోదీ అని స్పష్టత వచ్చింది. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో బీఆర్‌ఎస్ పొత్తు ఉంటుందని ఆ పార్టీ ఎంపీలే నాకు చెప్పారు. 9 బీఆర్‌ఎస్, 7 బీజేపీకి, 1 ఎంఐఎంకు అని పంపకాలు చేసుకున్నారు. బండారం బయటపడిందనే కాంగ్రెస్‌పై బీజేపీ, బీఆర్‌ఎస్ ఆరోపణలు చేస్తున్నాయి. వాళ్లిద్దరూ కాంగ్రెస్‌ను ఉమ్మడి శత్రువుగా భావిస్తున్నారు. మోదీ చెప్పింది నిజమో కాదో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను.
ఇది కూడా చదవండి: ‘బీఆర్‌ఎస్ మేనిఫెస్టో.. శుభవార్తకు రెడీగా ఉండండి’
Comments
Please login to add a commentAdd a comment