పెబ్బేరు కొత్త మున్సిపల్ కార్యాలయం
సాక్షి, వనపర్తి: ప్రజలకు పాలన మరింత చేరువ చేయాలని ఉద్దేశ్యంతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం కొత్త గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టి సరిగ్గా శుక్రవారానికి ఏడాది పూర్తయ్యింది. కొత్త పంచాయతీల ఏర్పాటు చేసిన ఆరు మాసాల్లోనే ఎన్నికలు నిర్వహించిన ప్రభుత్వం కొత్త మున్సిపాలిటీల విషయంలో ఉదాసీనత వహిస్తోంది. పాత, కొత్త మున్సిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని భావించినా సాధ్యం కాలేదు. ఫలితంగా ఏడాది కాలంగా అధికారుల పాలనే సాగుతోంది.
జిల్లా ఏర్పాటు అనంతరం..
2016 అక్టోబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం 14 మండలాలతో వనపర్తిని జిల్లాగా ఏర్పాటు చేసింది. నాడు ఒకే మున్సిపాలిటీతో ఏర్పాటు చేసిన జిల్లాలో రెండేళ్ల పూర్తికావస్తున్న తరుణం 2018 ఆగస్టు 2వ తేదీన 15 వేల జనాభా కలిగిన మేజర్ గ్రామ పంచాయతీలను ప్రభుత్వం మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్ చేసింది. దీంతో జిల్లాలో మున్సిపాలిటీల సంఖ్య ఐదుకు చేరింది. పాత మున్సిపాలిటీ వనపర్తి సరసన కొత్తగా పెబ్బేరు, ఆత్మకూరు, అమరచింత, కొత్తకోట పట్టణాలు మున్సిపాలిటీలుగా చేరాయి. కానీ మున్సిపాలిటీల్లో అందించాల్సిన సేవలుగాని, ఏర్పాటు చేయాల్సిన సేవలుగాని పూర్తిస్థాయిలో అమలుచేయలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయా మండల ఎంపీడీఓలకే, ఆయా మున్సిపల్ కమిషనర్ బాధ్యతలను అప్పగించి పాలన నెట్టుకొస్తున్నారు. ఇళ్ల నిర్మాణానికి సైతం అనుమతులు ఇవ్వకుండా అధికారులు ఎనిమిది నెలల పాటు ఆయా మున్సిపాలిటీల ప్రజలను ఇబ్బందులకు గురిచేశారు. విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లటంతో నెమ్మదిగా ఇంటి నిర్మాణాలకు అనుమతి ఇస్తున్నట్లు తెలుస్తోంది.
జిల్లాలో కొత్తగా 79 పంచాయితీలు
ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు 500 జనాభా ఉన్న తండాలను, ఆవాస ప్రాంతాలను ప్రభుత్వం పంచాయతీలుగా గుర్తించింది. జిల్లాలో మునుపు 185 గ్రామ పంచాయతీలు ఉండగా సుమారు తొమ్మిది గ్రామపంచాయతీలను కొత్తగా ఏర్పాటు చేసి మున్సిపాలిటీల్లో విలీనం చేసింది. కొత్తగా 33 గిరిజన తండాలను, 46 ఆవాస ప్రాంతాలను కొత్త గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. 2019 జనవరి కొత్త పాత పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించారు. ఆరు నెలల తర్వాత సర్పంచులకు చెక్‌పవర్ ఇచ్చారు. కొద్దోగొప్పో పాలన గాడిన పడుతోంది. కానీ కొత్త మున్సిపాలిటీల విషయంలోనే.. ప్రజల అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జిల్లాలో గ్రామ పంచాయతీల సంఖ్య 255కు చేరింది.
పెరిగిన పన్నులు
కొత్త మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేసిన జిల్లాలోని నాలుగు పట్టణాల్లో ప్రజలకు మెరుగైన పాలన అందించటం పక్కన పెడితే పంచాయితీ ఉన్నప్పటికంటే ఎక్కువగా ఇంటి టాక్సీలు వసూలు చేస్తున్నారు. దీంతో మున్సిపాలిటీగా ఎందుకు అప్‌గ్రేడ్ చేశారోనని అసంతృప్తి వాదనలు లేకపోలేదు.
వేల మందికి ఉపాధి కరువు
జిల్లాలో నాలుగు పట్టణాలను మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్ చేయటంతో జిల్లా సుమారు 9084 మంది కూలీలు ఉపాధి కోల్పోయారు. వారికి మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యామ్నాయంగా ఇప్పటివరకు పని లభించలేదు. చేసేది లేక కూలీలు ఇతర పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. కొత్త గ్రామ పంచాయితీలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించి పాలకవర్గాలను ఏర్పాటు చేసింది కానీ నేటికీ ఎన్‌ఆర్‌ఈజీఎస్ పనులు ఉమ్మడి పంచాయతీ పరిధిలోనే కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు, సంక్షేమ పథకాలు ఉమ్మడి పంచాయతీ లెక్కనే వర్తింప జేస్తున్నారు.
పారిశుద్ధ్య సేవలు అంతంతే..
మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్ అయిన పట్టణాల్లో గతంలో కంటే పారిశుధ్య నివారణ చర్యలు ఎలాంటి పురోగతిని సాధించలేదు. నాటి పంచాయతీలో ఉన్న సిబ్బందితోనే కాలం నెట్టుకొస్తున్నారు.
ఏర్పాటు కాని పాలనా విభాగాలు
కొత్త మున్సిపాలిటీల్లో టౌన్‌ప్లానింగ్ సెక్షన్, ఇంజనీరింగ్ విభాగం, శానిటేషన్ విభాగాలను ఏర్పాటు నేటికీ ఏర్పాటు కాలేదు. అన్ని పనులను ఇన్‌చార్జ్ కమిషనర్ మాత్రమే చూసుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నట్లు విమర్శలు ఉన్నాయి. నూతన మున్సిపాలిటీలకు పాలకవర్గాలు వస్తేగాని పాలన గాడిలో పడే పరిస్థితులు కనిపించటం లేదు.
Comments
Please login to add a commentAdd a comment