తెలంగాణ టూరిజానికి మరిన్ని సొబగులు
సాక్షి, హైదరాబాద్: పర్యాటకంగా తెలంగాణ రాష్ట్రం మరింత శోభను సంతరించుకునేలా అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. రాష్ర్టంలోని పురాతన కోటలు, శిల్పకళా సౌందర్యాలు, పర్యాటక ప్రాంతాలకు అద్దంపట్టే విశిష్ట ప్రాంతాల ప్రత్యేకతలు తెలుసుకునేలా సందర్శకుల కోసం వివిధ చోట్ల ‘కియోస్క్’ యంత్రాలను ఏర్పాటు చే స్తున్నారు. వీటి నుంచి పర్యాటక ప్రాంతాలు, ఆయా ప్రాంతాలకు వెళ్లే మార్గం, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఆధ్వర్యంలో అమలులో ఉన్న ప్యాకేజీలు వంటివన్నీ చిటికెలో తెలుసుకోవచ్చు. మహా నగరానికి ఇతర రాష్ట్రాలతో ప్రత్యేకించి విదేశీయుల సంఖ్య ఏటా పెరుగుతోంది.
ఇలాంటి వారందరి కోసం ఆంగ్ల, హిందీ భాషల్లో ఈ ప్రాంత ప్రత్యేకతలు తెలిపే కియోస్క్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మొదటి దశలో శంషాబాద్, బేగంపేట్ విమానాశ్రయాలు, ఎంజీబీఎస్, ప్రధాన రైల్వే స్టేషన్లను ఎంపిక చేశారు. ఇటీవల ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా తారామతి బారాదరిలో కియోస్క్‌ను ఆవిష్కరించారు. సింగపూర్, అమెరికా, జపాన్ తదితర ప్రాంతాల్లో వీటిని విరివిగా ఉపయోగిస్తున్నారు.
ఆయా ప్రాంతాలను పరిశీలించిన పర్యాటకాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు వీటిని రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలకు ప్రభుత్వం నుంచి ఆమోదం లభించింది. ఇప్పటికే బషీర్‌బాగ్ టూరిజం కార్యాలయంలో వీటిని ఏర్పాటు చేశారు. అలాగే నగరానికి కొత్త గా వచ్చే పర్యాటకుల కోసం విమానాశ్రయం, రైల్వేస్టేషన్, బస్ కాంప్లెక్స్, రవీంద్రభారతి తదితర ప్రాంతాల నుంచి ముఖ్యమైన సందర్శనీయ ప్రాంతాలకు వెళ్లేందుకు మార్గాన్ని సూచించేలా నగరంలో పలుచోట్ల ప్రత్యేకంగా బోర్డులు ఏర్పాటు చేయాలని అధికార యంత్రాంగం ఆలోచిస్తోంది.
పర్యాటకుల దిక్సూచీ... ‘కియోస్క్’!
Published Mon, Oct 12 2015 2:27 AM | Last Updated on Sun, Sep 3 2017 10:47 AM
Advertisement
Advertisement