పాలన మెరుగు పడాల్సిందే!
పాలన మెరుగు పడాల్సిందే!
Published Sat, Oct 8 2016 4:56 PM | Last Updated on Mon, Sep 4 2017 4:40 PM
* అభిప్రాయం వ్యక్తం చేసిన త్రిసభ్య కమిటీ
* పలు అంశాలపై ఏఎన్‌యూలో ముగిసిన విచారణ
* దూరవిద్య నకిలీ చలానాలపైనా సమాచారం సేకరణ
ఏఎన్‌యూ: యూనివర్సిటీలో గతంలో జరిగిన పలు ఆర్థిక కార్యకలాపాల నిర్వహణ, ఉద్యోగులకు పదోన్నతులు, రోజువారీ, ఔట్ సోర్సింగ్ నియామకం, మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన అంశాల్లో వచ్చిన ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ విచారణ శుక్రవారంతో ముగిసింది. విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ చక్రపాణి, తిరుపతి ఎస్‌వీయూ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ విజయలక్ష్మి, రాష్ట్ర ఉన్నత విద్యామండలి డిప్యూటీ డైరెక్టర్ కృష్ణమూర్తిలతో కూడిన కమిటీ నాలుగు రోజులపాటు 45 అంశాలపై ఆయా శాఖలు యూనివర్సిటీ అధికారులను విచారించింది. దానికి సంబంధించి ఆయా శాఖలు ఇచ్చిన వివరణను నోట్ చేసుకోవటంతోపాటు వాటా తాలూకా నోట్‌ఫైల్స్ జిరాక్స్ తదితర ఆధారాలను కూడా కమిటీ సేకరించింది. గతంలో ఫోస్ట్‌ఫ్యాక్టో అప్రూవల్ పేరుతో రోజువారీ ఉద్యోగులlవేతనాల చెల్లింపులపై సమాచారం సేకరించింది.
ఫిర్యాదులో లేని అంశాలూ పరిశీలన
ఆరోపణలు వచ్చిన 45 అంశాలతోపాటు ఇటీవల వెలుగులోకి వచ్చిన పలు కుంభకోణాలు, అవినీతి ఆరోపణలపైనా కమిటీ సమాచారం సేకరించింది. దూరవిద్యా కేంద్రంలో ఇటీవల వెలుగులోకి వచ్చిన చలానాల కుంభకోణం, రెగ్యులర్ పరీక్షల్లో మార్కుల తారుమారు తదితర అంశాలపై కమిటీ పరిశీలించింది. సంబంధించిన ఆధారాలు, పత్రికల్లో వచ్చిన కథనాలను సేకరించింది. మార్కుల తారుమారు కుంభకోణం, పరీక్షల వ్యవహారాలపై ఏఎన్‌యూ పరీక్షల విభాగం అధికారులను కమిటీ సభ్యులు శుక్రవారం క్షుణ్ణంగా విచారించింది. విచారణలో కోరిన సమాచారంతోపాటు అవసరం అనుకుంటే ఆయా అంశాల్లో యూనివర్సిటీ శాఖాపరమైన అభిప్రాయాన్ని కూడా లిఖితపూర్వకంగా చెప్పవచ్చని కమిటీ తెలిసింది. దర్యాప్తు చేసిన అంశాలపై సీబీసీఐడీ విచారణకు సిఫార్సు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
20వ తేదీ తర్వాత మళ్లీ వస్తాం..
పాలనాపరమైన అంశాల నిర్వహణ, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం వంటి కీలకాంశాల్లో ఏఎన్‌యా మెరుగవ్వాల్సి ఉందని కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. విచారణ అనంతరం వారు విలేకర్లతో మాట్లాడారు. 45 అంశాలతోపాటు దూరవిద్య చలానాల కుంభకోణంపై సమాచారం సేకరించామన్నారు. ఇంకా కొంత సమాచారం తీసుకోవాల్సి ఉందని భావిస్తుస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 20వ తేదీ తరువాత ఏఎన్‌యూలో మరో విడత పర్యటించనున్నామన్నారు. దీనిపై నెలాఖరులోగా రాష్ట్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పిస్తామని తెలిపారు.
Advertisement