ముగిసిన కమిటీ విచారణ
ముగిసిన కమిటీ విచారణ
Published Tue, Jul 26 2016 5:28 PM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
వివరణ పత్రాలు, నోట్ ఫైళ్ల జిరాక్స్‌లతో హైదరాబాద్ పయనమైన కమిటీ
అన్ని ఆరోపణలపై క్షేత్ర స్థాయిలో విచారణ
అవసరమైతే మరోసారి ఏఎన్‌యూని సందర్శించనున్న కమిటీ
కమిటీ నివేదికపై సర్వత్రా ఉత్కంఠ
ఏఎన్‌యూ: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో గతంలో జరిగిన పలు ఆర్థిక, పరిపాలన, కార్యనిర్వహణ, ఉద్యోగ నియామకాలు, పదోన్నతులు, వేతనాల చెల్లింపు తదితర అంశాలపై వచ్చిన ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం త్రిసభ్య విచారణ కమిటీని నియమించిన విషయం విధితమే. ఈ కమిటీ రెండో విడత పర్యటన ఈనెల 22 నుంచి 25వ తేదీ వరకు జరిగింది. సోమవారం మధ్యాహ్నం కమిటీ సభ్యులైన కృష్ణమూర్తి, కన్నమ్‌దాస్ హైదరాబాద్ వెళ్లారు. ఐదు రోజుల పాటు జరిగిన విచారణలో ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఆరోపణల పాయింట్ల ఆధారంగా ఆయా శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది, ఉన్నతాధికారులను విచారించి కమిటీ సభ్యులు వివరాలు నమోదు చేసుకున్నారు. ఆరోపణలతో పాటు దానికి సంబంధించిన కొన్ని అంశాలతో ప్రశ్నావళిని ముందుగానే సిద్ధం చేసుకున్న కమిటీ సభ్యులు క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి వివరాలు సేకరించారు. ఆయా శాఖల అధికారులు ఇచ్చిన మౌఖిక వివరణను నమోదు చేసుకున్న కమిటీ వాటికి సంబంధించిన పత్రాలు, అధికారిక నిర్ణయాలు, వాటి అమలుకు తీసుకున్న చర్యల నోట్‌ఫైల్స్ తదితర జిరాక్సులను ఫైల్ చేసి వెంట తీసుకెళ్లారు. ప్రధాన ఆరోపణలైన అధికారిక నిర్ణయాలు, పదోన్నతులు, ఉద్యోగ నియామకాలు, దూరవిద్యలో రెగ్యులర్ ఉద్యోగుల విధులు నిర్వహణ, వేతనాల చెల్లింపులు, బ్యాంక్‌ల లావాదేవీలు, ఫిక్స్‌డ్ డిపాజిట్‌లపై కమిటీ సభ్యులు పూర్తి సమాచారాన్ని సేకరించారు. రెండో విడత పర్యటనలో ఆన్ని ఆరోపణలకు సంబంధించిన సమాచారాన్ని కమిటీ పూర్తి స్థాయిలో సేకరించింది. అన్ని అంశాలను పరిశీలించి నివేదిక రూపొందించే క్రమంలో పరిశీలన అవసరమైతే మరోసారి కమిటీ యూనివర్సిటీని సందర్శించే అవకాశం ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా యూనివర్సిటీ వ్యవహారాలపై ప్రభుత్వం కమిటీని నియమించడం ఆ కమిటీ రెండుసార్లు యూనివర్సిటీని సందర్శించి పకడ్బందీగా ఆధారాలు తీసుకెళ్లడం, ఈ నెలాఖరుకు నివేదికను సిద్ధం చేస్తామని చెప్పడంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఉత్కంఠ నెలకొంది. కమిటీ ఏ అంశాలను నివేదికలో పొందుపరుస్తుంది... ఎవరిని దోషులుగా పేర్కొంటుంది... దాని ఆధారంగా ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందనే అంశాలపై యూనివర్సిటీలో ప్రధానంగా చర్చ జరుగుతోంది.
పూర్తి సమాచారం ఇచ్చాం : వీసీ
కమిటీ రెండో విడత పర్యటన పూర్తయిందని, కమిటీ సభ్యులు అడిగిన అన్ని అంశాలకు సంబంధించిన సమాచారాన్ని ఆయా శాఖలు అందజేశాయని వీసీ ఎ.రాజేంద్రప్రసాద్ విలేకరులకు తెలిపారు. అవసరమైతే మరోసారి యూనివర్సిటీకి వస్తామని కమిటీ సభ్యులు చెప్పారన్నారు.
Advertisement