దేశాన్ని పాలించే అర్హత యూపీఏకు లేదు: బాబు
యూపీఏ ప్రభుత్వంపై తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబు మంగళవారం నిప్పులు చెరిగారు. ఆ ప్రభుత్వం దేశాన్ని భ్రష్టుపట్టించిందని ఆయన ఆరోపించారు. దేశాన్ని పాలించే అర్హత ఆ ప్రభుత్వానికి లేదని చంద్రబాబు స్ఫష్టం చేశారు. మంగళవారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో చంద్రబాబు ప్రసంగించారు. భారత్లో 1991 నాటి ముందు పరిస్థితులు పునరావృతం కావని భారత ప్రధాని మన్మోహాన్ సింగ్ పేర్కొనడం హస్యాస్పదంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు.
గతంలో దేశంలో విధించిన అత్యవసర పరిస్థితి సమయంలో కూడా ఇలాంటి పరిస్థితులు లేవని చంద్రబాబు వ్యాఖ్యానించారు. దేశంలో ఇంత నీచమైన పాలన ఇంతవరకు చూడలేదని అన్నారు. విధాన పరమైన నిర్ణయాలు తీసుకోవడంలో యూపీఏ సర్కార్కు పక్షవాతం వచ్చిందన్నారు. ఉల్లిధరలు ఎప్పుడు తగ్గుతాయో వ్యవసాయ శాఖ మంత్రే చెప్పలేకపోతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
భారత్,పాక్ సరిహద్దుల్లో పొరుగుదేశం పాక్ సైనికులు కాల్పులు జరిపితే, ఆ అంశంపై రక్షణ మంత్రి ఇచ్చిన వివరణ పొంత లేకుండా ఉందని చంద్రబాబు ఆగ్రహాం వ్యక్తం చేశారు. దేశంలోని వివిధ రంగాల్లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతించిన పెట్టుబడులు రాని పరిస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొంత మంది స్వార్థం వల్ల దేశంలో నేడు ఈ పరిస్థితులు నెలకొన్నాయన్నారు.
బొగ్గు కుంభకోణానికి సంబంధించిన దస్త్రాలు గల్లంతుపై ఆయన మండిపడ్డారు. ఆ కుంభకోణంలో దేశ సంపదను దిగమింగిన విషయం బహిర్గతమవుతోందని, ఆ దస్త్రాలను గల్లంతు చేశారని ఆయన ఆరోపించారు. మరో వైపు రూపాయి విలువ దారుణంగా పడిపోయిందన్నారు. రాష్ట్ర విభజన ద్వారా కాంగ్రెస్ లబ్ధి పొందాలని భావిస్తోందని బాబు పేర్కొన్నారు.