ధరాఘాతం
సాక్షి, హైదరాబాద్ : లారీ సమ్మె పేరుతో వ్యాపారులు నిత్యావసర వస్తువుల ధరలు ఎడాపెడా పెంచేశారు. సమ్మెను బూచీగా చూపుతూ పండ్లు, కూరగాయలను అడ్డగోలు రేట్లకు అమ్ముతున్నారు. డిమాండ్ల పరిష్కారం కోసం లారీ ఆపరేట్లు శుక్రవారం నుంచి దేశవ్యాప్తంగా నిరవధిక సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. అయితే పాలు, పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ రవాణాకు అయిదు రోజుల వరకు ఎలాంటి ఆటంకం కల్పించబోమని సంఘాలు ప్రకటించాయి. అయితే తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే అత్యవసర ఉత్పత్తుల రవాణాను కూడా నిలిపేస్తామని హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి తెలంగాణకు వచ్చే ఉల్లి, ఆలుగడ్డల దిగుమతులను పలుచోట్ల నిలిపేశారు. వాటిని అత్యవసరాలుగా పరిగణించకపోవడమే కారణమని వ్యాపారులు అంటున్నారు. మరోవైపు లారీల సమ్మె పాక్షికమని వ్యాపారులు ఈ పేరుతో ధరలు పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామని పౌరసరఫరాల శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. మంగళవారం నుంచి దాడులు నిర్వహిస్తామని ఓ అధికారి వెల్లడించారు.
ఉల్లి రేటు పెరుగుతుందా?
మహారాష్ట్రలో సమ్మె ఉధృతంగా సాగుతుండటంతో కొద్దిరోజుల్లో ఉల్లిగడ్డ కొరత ఏర్పడే ప్రమాదం కనిపిస్తోంది. అదే జరిగితే మళ్లీ ఉల్లి ధర పెరుగుతుందని అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పప్పులు, ఉప్పులు ఇతర నిత్యావసర సరుకులు ఎక్కువగా ఉత్తర భారతదేశం నుంచి తెలంగాణకు వస్తాయి. తెలంగాణకు పప్పు దినుసులు రోజూ 600 లారీల ద్వారా వస్తాయని అంటున్నారు. వాటి రాక దాదాపు 60 శాతం నిలిచిపోయిందని వ్యాపారులు చెబుతున్నారు. మరోవైపు జమ్మూకశ్మీర్ నుంచి వచ్చే యాపిల్ సరఫరా దాదాపు నిలిచిపోయింది. దీంతో వాటి ధరలు ఆకాశాన్ని అంటాయి. ఒక్కో యాపిల్ ధర రూ.50 వరకు అమ్ముతున్నారు. కొన్నిచోట్ల అంతకంటే ఎక్కువకు అమ్ముతున్నారు. అరటి పండ్ల ధరలూ పెరిగాయి. మొన్నటిదాకా రూ.40 డజన్ ఉండగా.. ప్రస్తుతం రూ.60–70కి అమ్ముతున్నారు. అలాగే హైదరాబాద్కు విదేశాల నుంచి వచ్చే పండ్ల ధరలు కూడా పెరిగాయి. సమ్మెతో దాదాపు 75 శాతం పండ్ల దిగుమతి నిలిచిపోయిందని ఓ అంచనా.
తగ్గిన కూరగాయల సరఫరా
అత్యవసరాలైన కూరగాయలను లారీ సమ్మె నుంచి మినహాయించినా సమ్మె ప్రభావం కొంతమేర కనిపిస్తోందని మార్కెటింగ్ శాఖ వర్గాలు తెలిపాయి. సమ్మెకుతోడు మహారాష్ట్రలో ఇటీవల భారీ వర్షాలు కురవడంతో కూరగాయల కొరత ఏర్పడింది. డీసీఎం వ్యాన్లలో కూరగాయలను తరలిస్తే ఇబ్బందుల్లేవని, కానీ లారీల్లో తరలిస్తే నిలిపివేస్తున్నారని మార్కెటింగ్ అధికారులు చెబుతున్నారు. మన రాష్ట్రానికి రోజూ 38.54 లక్షల టన్నుల కూరగాయలు అవసరం కాగా 19.54 లక్షల టన్నులు మాత్రమే ఇక్కడ ఉత్పత్తి అవుతున్నాయి. మిగిలిన కూరగాయలు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్నాయి. టమాట మదనపల్లి నుంచి, వంకాయ, బెండ, మిరపకాయ అనంతపురం నుంచి, మునగ గుజరాత్ నుంచి, క్యాబేజీ, క్యారెట్, బీన్స్ కర్ణాటక నుంచి వస్తాయి. మరికొన్ని నిత్యావసరాలు ఢిల్లీ, మహారాష్ట్ర నుంచి వస్తాయి. సమ్మె కారణంగా వీటి సరఫరా తగ్గింది. ఒకవైపు వర్షాలు, మరోవైపు లారీల సమ్మెతో కూరగాయల ధరలు కిలోకు నాలుగైదు రూపాయలు అధికంగా ఉన్నట్లు మార్కెటింగ్ శాఖ వర్గాలు చెబుతున్నాయి.
ఉల్లిగడ్డ సరఫరా ఆగింది
మహారాష్ట్ర నుంచి ఉల్లిగడ్డల సరఫరా నిలిచిపోయింది. రెండ్రోజులుగా ఉల్లి సరఫరా లేకపోవడంతో కొరత ఏర్పడింది. దీంతో ధర పెంచక తప్పడం లేదు. -వెంకన్న, వ్యాపారి, మెహిదీపట్నం