
సాక్షి, అమరావతి: సంక్షోభాన్ని సానుకూలంగా మలుచుకుని అభివృద్ధి చెందిన సింగపూర్ దేశం తమకెంతో స్ఫూర్తిదాయకమని సీఎం చంద్రబాబు అన్నారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ఆయన సోమవారం అక్కడి లీక్వాన్ యూనివర్సిటీలో ఏర్పాటైన సమావేశంలో మాట్లాడారు. సింగపూర్‌కు, ఆంధ్రప్రదేశ్‌కు సారూప్యం ఉందని.. విభజనతో సింగపూర్ బాలారిష్టాలను ఎదుర్కొని అధిగమించినట్లే ఏపీని విభజన గాయాల నుంచి క్రమంగా కోలుకునే స్థాయికి తీసుకొచ్చామన్నారు. అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగా ఎదగాలన్న తమ లక్ష్య సాధనకు ఎల్‌కేవై ఇన్‌స్టిట్యూట్ సహకారం కోరుతున్నట్లు తెలిపారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో ముందు వరుసలో నిలిచామని, వ్యాపార సానుకూలతలో ప్రథమ స్థానంలో ఉన్నామని సీఎం చెప్పారు.
తమ హయాంలో ఏపీలో ఆటోమొబైల్ రంగం అభివృద్ధి చెందుతున్నదని ఆహారశుద్ధి పరిశ్రమలైన మోండెలెజ్, పెప్సీ, ఐటీసీ, ఇతర చిన్న తరహా కంపెనీల రూపంలో భారీ పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. తిరుపతి నగరాన్ని ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పాదక హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని, మొబైల్ ఫోన్ల తయారీలో అంతర్జాతీయ ఖ్యాతి పొందిన ఫ్యాక్స్‌కాన్‌కు తిరుపతి సమీపంలో భారీ ఉత్పాదక సదుపాయ ప్రాంగణం ఉందని తెలిపారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతాంగ శ్రేయస్సుకు, పచ్చదనం విస్తరణకు భారీస్థాయిలో కృషి చేస్తున్నామన్నారు. ఏపీ రెండో స్వగృహంగా, స్వస్థలంగా భావించి పెట్టుబడులు పెట్టాలని సీఎం కోరారు. అనంతరం ఎల్‌కేవై స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ప్రాథమిక అవగాహనా ఒప్పందం కుదరగా ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠా, ప్రొఫెసర్ డానీ దానిపై సంతకాలు చేశారు.
సింగపూర్ తరహా ఇళ్లు
సింగపూర్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన సిటీ సొల్యూషన్స్ ఎగ్జిబిషన్ చూసిన ముఖ్యమంత్రి చంద్రబాబు, సింగపూర్ తరహా ఇళ్లను రాష్ట్రంలోనూ కట్టాలని.. అక్కడి జీవ వైవిధ్య అత్యుత్తమ విధానాలపై అధ్యయనం చేసి వాటిని రాష్ట్ర అవసరాలకు తగినట్టుగా అమలుచేయాలని అధికారులకు సూచించారు. కాగా, సింగపూర్ పర్యటనలో ఆయన ప్రపంచ నగరాల ప్లీనరీ సెషన్‌లో ‘పట్టణీకరణ నీరు, పర్యావరణం, ప్రజా రవాణా నిర్వహణ’ అనే అంశంపై మాట్లాడుతూ.. రాజధాని అమరావతిని ఐదున్నర కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే విధంగా నిర్మిస్తున్నామని చెప్పారు. ఇందులో అందరి భాగస్వామ్యం కోరుతున్నట్లు తెలిపారు. నదుల అనుసంధానం ద్వారా తాగునీటికే కాకుండా వ్యవసాయ, పారిశ్రామిక అవసరాలకూ తగినంత నీటిని ఇవ్వగలిగే పరిస్థితిని తీసుకొచ్చామని, కరువు ఛాయలను తరమికొట్టామని చెప్పారు.
సమస్యలను పరిష్కరించాలి: శ్రీలంక ప్రధాని
సమావేశంలో పాల్గొన్న శ్రీలంక ప్రధాని విక్రమ్ రణిల్ సింఘే మాట్లాడుతూ.. నగరాలు ఇప్పుడు సంపద సృష్టించే వనరులుగా ఉన్నాయని, తద్వారా ఇవి భారీ అంతర్గత వలసలను ఆకర్షిస్తున్నాయని చెప్పారు. నగరవాసులు కాలుష్యంతో కూడిన గాలి, నీరు, వాతావరణ సమస్యలను ఎదుర్కొంటున్నారని, వీటితో పాటు నేరాలు పెరిగిపోవడం కూడా వారికి ముప్పుగా మారిందని, ఈ అడ్డంకులన్నీ పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచ దేశాలు వాతావరణ మార్పు, అసమాన వృద్ధి, పేదరికం వంటి సంక్లిష్ట సవాళ్లను ఎదుర్కొంటున్నాయని, ఇవన్నీ ఒకదానితో మరొకటి ముడిపడి వున్నాయని సింగపూర్ ఉప ప్రధాని థర్మన్ షణ్ముగరత్నం ఆందోళన వ్యక్తం చేశారు.
సింగపూర్ భవనాలు పరిశీలించిన బృందం
సీఎం సారథ్యంలో సింగపూర్‌లో పర్యటిస్తున్న మంత్రి నారాయణతోపాటు మరో 26 మంది భవన నిర్మాణ ప్రతినిధులు సోమవారం అక్కడ నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనాలను సందర్శించి వాటిల్లో ఆధునిక సాంకేతికతను పరిశీలించారు. అంతేకాక, సింగపూర్లోని బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ అథారిటీ అధికారులతో సమావేశమయ్యారు.