సీతంపేట:జిల్లాలోని గిరిజనుల పట్ల ప్రభుత్వం ఎంత నిర్లక్ష్య ధోరణితో ఉందో సీతంపేట ఐటీడీఏ(సమగ్ర గిరిజనాభ్యుదయ సంస్థ) పరిస్థితిని చూస్తే అర్థమవుతుంది. ఐఏఎస్ అధికారి నేతృత్వం వహించాల్సిన ఐటీడీఏ పాలనను గ్రూప్ వన్ అధికారితో సరిపెట్టిన ప్రభుత్వం, కీలక పోస్టుల భర్తీ విషయాన్నీ పట్టించుకోవడంలేదు. ఫలితంగా పరిపాలనతోపాటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పర్యవేక్షణ కొరవడుతోంది. రాష్ట్రంలోనిమిగతా ఐటీడీఏలు అన్నింటికీ ఐఏఎస్ అధికారులను పీవోలుగా నియమించిన ప్రభుత్వం సీతంపేట ఐటీడీఏను మాత్రం గత కొన్నేళ్లుగా గ్రూప్ వన్ అధికారులతోనే నడిపిస్తోంది.
దీంతో పాలనలో ప్రజాప్రతినిధుల జోక్యం పెరుగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 274 జీవో ప్రకారం ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్లు సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేషన్ కింద పాలన సాగించాలి. పూర్తిస్థాయిలో పథకాలు అమలు చేయాలన్నా, ఎవరిపైనైనా చర్యలు తీసుకోవాలన్నా వీరికి జిల్లా కలెక్టర్‌తో సమాన అధికారాలు ఉంటాయి. అయితే గ్రూప్ వన్ అధికారులు స్వేచ్ఛగా విధులు నిర్వర్తించే పరిస్థితి ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇందుకు తగినట్లే ఇటీవలి కాలంలో అధికార పార్టీ ఒత్తిడి ఎక్కువైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఐఏఎస్ అధికారి అయితే స్వయంగా నిర్ణయాలు తీసుకోగలరని, ఒత్తిళ్లను సైతం తలొగ్గే పరిస్థితి ఉండదని అంటున్నారు.
మిగతా పోస్టుల పరిస్థితి దయనీయం
కాగా ఐటీడీఏలో ఇతర కీలక పోస్టులన్నీ దాదాపు ఖాళీగా ఉన్నాయి. చాలా కాలంగా ఖాళీగా ఉన్న ఈ పోస్టులు ఇప్పట్లో భర్తీ అయ్యే అవకాశాలు కూడా కనిపించడం లేదు. దీంతో పథకాల పర్యవేక్షణ నామమాత్రంగా ఉంది. ఐటీడీఏ పరిధిలో 20 సబ్‌ప్లాన్ మండలాలున్నాయి. వీటిలో 1200కు పైగా గ్రామాలున్నాయి. ఈ గ్రామాలకు మౌలిక వసతుల కల్పన, పథకాాలు సక్రమంగా అమలయ్యేలా పర్యవేక్షించడం ఆయా శాఖల అధికారుల బాధ్యత. అయితే చాలా శాఖలు ఇన్‌చార్జీల ఏలుబడిలో ఉండటంతో పర్యవేక్షణ అంతంతమాత్రంగా సాగుతోంది. గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకుడి(డీడీ) పోస్టు రెండేళ్లుగా ఖాళీగా ఉంది. ప్రస్తుతం వంశధార ఎస్‌డీటీ సుదర్శన దొర ఇన్‌చార్జిగా అదనపు బాధ్యతలు నిర్వరిస్తున్నారు. అలాగే మూడు అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని సీనియర్ వార్డెన్లు అదనపు బాధ్యతగా నిర్వరిస్తున్నారు. గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ ఈఈ పోస్టు ఖాళీగా ఉండగా విజయనగరం జిల్లా పార్వతీపురం డీఈ ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు.
ఖాళీగా ఉన్న ఐకేపీ ఏపీడీ పోస్టును శ్రీకాకుళం ఏపీడీ సావిత్రి అదనపు బాధ్యతగా నిర్వర్తిస్తున్నారు. ఉపాధి హామీ ఏపీడీ పోస్టు సైతం ఖాళీగానే ఉంది. ప్రాజెక్టు హార్టీకల్చర్ ఆఫీసర్ ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. ఐటీడీఏ ఏపీవో (అసిస్టెంట్ ప్రాజెక్టు అధికారి) నెలరోజులుగా సెలవులో ఉన్నారు. ప్రాజెక్టు అగ్రికల్చర్ అధికారి పోస్టులో ఏడీఏ రాజగోపాల్ (వ్యవసాయశాఖ) ఇన్‌చార్జిగా విధులు నిర్వర్తిస్తున్నారు. డిప్యూటీ డీఈవో పోస్టును కూడా సీనియర్ హెచ్‌ఎం మల్లయ్య అదనపు బాధ్యతగా మోస్తున్నారు. డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో పోస్టులో మర్రిపాడు వైద్యాధికారి రామ్మోహన్ ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు. పోస్టుల ఖాళీ విషయమై ఇటీవల సీతంపేట పర్యటనకు వచ్చిన గిరిజన సంక్షేమశాఖ రాష్ట్ర కమిషనర్ ఉదయలక్ష్మి వద్ద ప్రస్తావించగా ఖాళీల భర్తీ ప్రభుత్వ పరిధిలోని అంశమన్నారు. అయినా త్వరలో భర్తీ కావచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఐటీడీఏ ఖాళీ!
Published Mon, Nov 17 2014 1:38 AM | Last Updated on Sat, Sep 2 2017 4:35 PM
Advertisement
Advertisement