సాక్షి, గుంటూరు : రాష్ట్ర మంత్రి, జిల్లా కలెక్టర్ సహా అధికార యంత్రాంగం ఉరుకులు పరుగులు పెట్టింది. జిల్లా ఎస్పీలు, రెవెన్యూ అధికారులు అంతా ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. చివరకు ఉసూరుమంటూ వెనుదిరిగారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రోడ్డు మార్గాన వస్తున్నారని, కృష్ణా కరకట్ట ప్రాంతాన్ని పరిశీలిస్తారని సీఎం పేషీ నుంచి ఫోన్ కాల్ రావడంతో అధికారులు పడిన హడావుడి ఇది. ముఖ్యమంత్రి విమానంలో విశాఖపట్నం నుంచి వస్తూ రాజధాని ప్రాంతంపై ఓ లుక్కేసి తిరుపతి వెళ్లిపోయారు. వివరాల్లోకి వెళితే...
రాజధాని ప్రాంతంలో మంగళవారం ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే ఉంటుందని, సింగపూర్ మంత్రి ఈశ్వరన్ కూడా ఉంటారని సోమవారం ప్రకటనలు వెలువడ్డాయి. దీంతో మంత్రులు, జిల్లా అధికారులు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాల్లో పాలుపంచుకున్నారు.
మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో సీఎం రాజధాని ప్రాంతానికి రోడ్డు మార్గాన వస్తున్నట్లు సంక్రాంతి సంబరాల్లో ఉన్న జిల్లా కలెక్టర్‌కు సమాచారం వచ్చింది. వెంటనే ఆయన గుంటూరు ఆర్డీఓ భాస్కరనాయుడును వెంటతీసుకొని హడావుడిగా వేదిక దిగివెళ్లి పోయారు. జిల్లా ఎస్పీలను, తుళ్లూరులో ఉన్న రెవెన్యూ సిబ్బందిని అప్రమత్తం చేసి ప్రకాశం బ్యారేజీ నుంచి వెంకటపాలెం కరకట్ట వరకు బందోబస్తు ఏర్పాటుకు కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు.
కొద్దిసేపటికి సంక్రాంతి సంబరాల వేదికపై ఉన్న మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు సమాచారం అందడంతో ఆయన కూడా హడావుడిగా కార్యక్రమాన్ని ముగించుకుని బయలుదేరి వెళ్లారు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డీఓలతో కలిసి వెంకటపాలెం చేరుకొని సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు.
అయితే సీఎం విశాఖపట్నం నుంచి విమానంలో వస్తూ రాజధాని ప్రాంతంలో ఏరియల్ సర్వే చేసి తిరుపతి వెళ్లిపోవడంతో అంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుని వెనుదిరిగారు.
ఇదిలావుండగా, రాజధాని ప్రాంతంలో మంత్రులు, ముఖ్యమంత్రి పర్యటనలు ముందస్తు సమాచారం లేకుండా హఠాత్తుగా ఖరారు అవుతుండటంతో జిల్లా ఉన్న తాధికారులు, పోలీసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అంతా హడావుడే !
Published Wed, Jan 14 2015 1:33 AM | Last Updated on Sat, Sep 2 2017 7:39 PM
Advertisement
Advertisement