the state minister
-
అంతా హడావుడే !
సాక్షి, గుంటూరు : రాష్ట్ర మంత్రి, జిల్లా కలెక్టర్ సహా అధికార యంత్రాంగం ఉరుకులు పరుగులు పెట్టింది. జిల్లా ఎస్పీలు, రెవెన్యూ అధికారులు అంతా ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. చివరకు ఉసూరుమంటూ వెనుదిరిగారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రోడ్డు మార్గాన వస్తున్నారని, కృష్ణా కరకట్ట ప్రాంతాన్ని పరిశీలిస్తారని సీఎం పేషీ నుంచి ఫోన్ కాల్ రావడంతో అధికారులు పడిన హడావుడి ఇది. ముఖ్యమంత్రి విమానంలో విశాఖపట్నం నుంచి వస్తూ రాజధాని ప్రాంతంపై ఓ లుక్కేసి తిరుపతి వెళ్లిపోయారు. వివరాల్లోకి వెళితే... రాజధాని ప్రాంతంలో మంగళవారం ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే ఉంటుందని, సింగపూర్ మంత్రి ఈశ్వరన్ కూడా ఉంటారని సోమవారం ప్రకటనలు వెలువడ్డాయి. దీంతో మంత్రులు, జిల్లా అధికారులు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాల్లో పాలుపంచుకున్నారు. మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో సీఎం రాజధాని ప్రాంతానికి రోడ్డు మార్గాన వస్తున్నట్లు సంక్రాంతి సంబరాల్లో ఉన్న జిల్లా కలెక్టర్‌కు సమాచారం వచ్చింది. వెంటనే ఆయన గుంటూరు ఆర్డీఓ భాస్కరనాయుడును వెంటతీసుకొని హడావుడిగా వేదిక దిగివెళ్లి పోయారు. జిల్లా ఎస్పీలను, తుళ్లూరులో ఉన్న రెవెన్యూ సిబ్బందిని అప్రమత్తం చేసి ప్రకాశం బ్యారేజీ నుంచి వెంకటపాలెం కరకట్ట వరకు బందోబస్తు ఏర్పాటుకు కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. కొద్దిసేపటికి సంక్రాంతి సంబరాల వేదికపై ఉన్న మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు సమాచారం అందడంతో ఆయన కూడా హడావుడిగా కార్యక్రమాన్ని ముగించుకుని బయలుదేరి వెళ్లారు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డీఓలతో కలిసి వెంకటపాలెం చేరుకొని సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. అయితే సీఎం విశాఖపట్నం నుంచి విమానంలో వస్తూ రాజధాని ప్రాంతంలో ఏరియల్ సర్వే చేసి తిరుపతి వెళ్లిపోవడంతో అంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుని వెనుదిరిగారు. ఇదిలావుండగా, రాజధాని ప్రాంతంలో మంత్రులు, ముఖ్యమంత్రి పర్యటనలు ముందస్తు సమాచారం లేకుండా హఠాత్తుగా ఖరారు అవుతుండటంతో జిల్లా ఉన్న తాధికారులు, పోలీసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
అక్రమాల పునాదులపై..
అక్రమాలకు అడ్డుకట్ట వేయూల్సిన పాలకులే వాటికి అండగా నిలబడితే ఏం జరుగుతుంది? నగరంలోని భారీ భవనాల నిర్మాణాన్ని చూస్తే ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే అక్రమార్కులు అంతస్తులపై అంతస్తులను యథేచ్ఛగా నిర్మించేస్తున్నారు. ఈ తంతు గురించి తెలిసినా నగర పాలక సంస్థ అధికారులు కళ్లకు గంతలు కట్టుకుని పనిచేస్తున్నారు. సాక్షి, గుంటూరు అక్రమ కట్టడాలకు గుంటూరు నగరం కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు పట్టించుకోకపోవటంతో అనుమతులు లేకుండానే భారీ కట్టడాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ప్రధానంగా అధికార పార్టీ నేతలు యథేచ్ఛగా భవనాలు నిర్మిస్తున్నారు. ఇలా నిర్మించిన భవనాలను సాక్షాత్తు రాష్ట్ర మంత్రి, శాసనసభ స్పీకర్లే ప్రారంభిస్తున్నారు. దీంతో వాటివైపు కన్నెత్తి చూసేందుకు అధికారులు హడలిపోతున్నారు. అధికార పార్టీకి చెందిన ఓ ఎంపీతోపాటు పలువురు ముఖ్య నేతలు పాత భవనాలపై అనుమతులు లేకుండానే నిర్మాణాలు చేపడుతున్నారు. ఇలాంటివి కార్పొరేషన్ పరిధిలో 140కి పైగా ఉన్నట్లు ముఖ్యమంత్రికి సైతం ఫిర్యాదులు వెళ్లాయి. కొన్ని అక్రమ కట్టడాల్లో కాలేజి హాస్టళ్లు ఉన్నాయి. నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా నిర్మించిన కట్టడాల్లో ప్రమాదాలు సంభవిస్తే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇవీ ఉదాహరణలు.. = బృందావన్ గార్డెన్స్‌లోని కమ్మజన సేవా సమితి పాత భవనంపై ఇటీవల నిర్మించిన రెండంతస్తులకు అనుమతులు లేవు. ఈ భవనాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు, స్పీకర్ కోడెల శివప్రసాద్, నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావులు ఇటీవల ప్రారంభించారు. = అధికార పార్టీకి చెందిన ఓ ఎంపీ ఎస్వీఎన్ కాలనీలో ఉమెన్స్ కాలేజి హాస్టల్ భవనానికి సంబంధించి ఇటీవల నిర్మించిన రెండంతస్తులకు కూడా అనుమతులు లేవు. ఈ విషయాన్ని కార్పొరేషన్ అధికారులు ధ్రువీకరించారు. = కొత్తపేటలోని బోసుబొమ్మ సెంటర్లో ఓ ఆస్పత్రి, ఓల్డ్ క్లబ్ రోడ్డులోని లలిత హాస్పిటల్ భవనాలకు పూర్తి స్థాయి అనుమతులు లేవు. = అమరావతి మెయిన్ రోడ్డులోని ఓ కాంప్లెక్స్, శ్రీనగర్ కాలనీలోని ఓ అపార్టుమెంట్, పాత గుంటూరు, శ్యామలనగర్‌లలో రెండు అపార్టుమెంట్లను అనుమతులు లేకుండానే నిర్మిస్తున్నారు. ఇలా అక్రమ కట్టడాల జాబితా చాంతాడంత ఉంది. = వీటిలో కొన్నింటికి టౌన్ ప్లానింగ్ అధికారులు నోటీసులు జారీ చేశారు. అక్రమ కట్టడాలపై సమగ్ర విచారణకు గుంటూరు మున్సిపల్ ఆర్డీ శ్రీనివాసరావును నియమించినట్లు సమాచారం. విజిలెన్స్ అధికారులు, కార్పొరేషన్ ప్రత్యేకాధికారైన జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే వీటిపై దృష్టి సారించి విచారణ జరిపిస్తే అన్ని విషయాలు వెలుగు చూసే అవకాశం ఉంది. నోటీసులు జారీ చేశాం.. ఈ విషయమై నగర పాలక సంస్థ ఇన్చార్జి డీసీపీ విశ్వప్రసాద్‌ను వివరణ కోరగా కార్పొరేషన్ పరిధిలో ఇంతవరకు 89 అక్రమ కట్టడాలు ఉన్నట్లు గుర్తించామని వెల్లడించారు. ఇందులో 16 భవనాలను కూలగొట్టామని, 32 భవనాలకు సంబంధించి కోర్టు కేసులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. మిగినవాటికి నోటీసులు జారీ చేశామని తెలిపారు. -
కళ తప్పిన కాంగ్రెస్
ఖమ్మం, న్యూస్‌లైన్: ఓ కేంద్రమంత్రి, రాష్ట్ర మంత్రి, శాసనసభ ఉపసభాపతి వంటి కీలక పదవులు చేజిక్కించుకొని రాష్ట్ర రాజకీయాలనే ప్రభావితం చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ నేడు కళ తప్పింది. పార్టీ జిల్లా అధ్యక్షుని ఎన్నిక జరపకపోవడం, దీనిని భర్తీ చేసేందుకు వేసిన సమన్వయ కమిటీ సభ్యుల మధ్య సమన్వయం లోపించడంతో పార్టీ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. సార్వత్రిక ఎన్నికల్లో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులు గెలిచినా.. రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి రాకపోవడంతో నాయకుల్లో నిరుత్సాహం నెలకొంది. కొత్తగా గెలిచిన వారు తప్ప మిగిలిన వారు కనీసం కార్యకర్తలతో సమావేశం కూడా ఏర్పాటు చేసే పరిస్థితి లేదని ఆయా నియోజకవర్గాల కార్యకర్తలు చెబుతున్నారు. అదేవిధంగా పొత్తుల్లో భాగంగా సీపీఐకి కేటాయించిన స్థానాల్లో ఆ పార్టీ కూడా ఘోర పరాభవం చవిచూడటంతో అక్కడ పార్టీ పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారిందని పలువురు సీనియర్ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సారధి లేడు... జాతీయ పార్టీ, చెక్కుచెదరని ఓటు బ్యాంకు అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీకి జిల్లా అధ్యక్షుడు కరువయ్యాడు. సార్వత్రిక ఎన్నికల ముందు వరకు అధ్యక్షుడిగా ఉన్న వనమా వెంకటేశ్వరరావు పార్టీని వీడడంతో ఖాళీ అయిన అధ్యక్ష పదవిని ఇంకా భర్తీ చేయలేదు. ఎన్నికల ముందు భర్తీ చేద్దామని తెలంగాణ పీసీసీ భావించినా జిల్లాపార్టీలోని వర్గ విభేదాలతో... అటు రాంరెడ్డి వెంకటరెడ్డి, ఇటు రేణుకాచౌదరి వర్గాలలో ఎవరికీ అధ్యక్షపదవి కట్టబెట్టలేక తాత్కాలికంగా ఏడుగురు సభ్యులతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. అయితే ఈ కమిటీలో ఉన్న సభ్యుల మధ్యే సమన్వయం లోపించిందని, ఈ కమిటీతో ఎటువంటి పని జరగలేదనే విమర్శలు వచ్చాయి. కీలకమైన ఎన్నికల సమయంలో కూడా ఈ కమిటీ సమావేశం కాకపోవడం విశేషం. అయితే కమిటీ సభ్యులు నామ మాత్రమే అని.. వారి మాట వినేవారు ఏరని జిల్లా కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఇదిలా ఉంటే కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరగుతుందని గతంలో ప్రచారం కాగానే... పదవికోసం క్యూ కట్టిన నాయకులు ఇప్పుడు వెనకడుగు వేస్తున్నట్లు తెలిసింది. పార్టీ అధికారంలో లేదు... అధ్యక్ష పదవి తీసుకుంటే అన్ని మీదవేసుకుని పనిచేయాలి.... ప్రతిపక్ష పార్టీగా కార్యక్రమాలు చేయాలి... అనే ఆలోచనతో గతంలో అధ్యక్ష పదవికోసం గాఢ్ ఫాదర్స్ చుట్టు తిరిగిన వారు ఇప్పుడు ఆ ఊసే ఎత్తడంలేదని ప్రచారం. కాగా, ఇంతకాలం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అధ్యక్షుడు లేకపోయినా పని జరిగేదని.. ఇప్పుడు అధ్యక్షుడు లేకుండా పార్టీ మనుగడ ఇబ్బందికరమని కార్యకర్తలు అంటున్నారు. గెలిచిన ఎమ్మెల్యేల్లో నిరుత్సాహం.. హోరాహోరీ పోటీని ఎదుర్కొని గెలిచినా కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో నిరుత్సాహమే మిగిలింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రి వర్గం నుంచి మొన్నటి వరకు మంత్రిగా కొనసాగిన రాంరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉపసభాపతి మల్లు భట్టి విక్రమార్కలకు ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కీలక పదవులు లభించేవి. కానీ అంతా తారుమారై తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చింది. దీంతో వారిలో, వారి అనుచరగణంలోనూ నిరుత్సాహం నెలకొంది. నూతనంగా గెలిచిన ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్యలు మాత్రం గెలిచిన నాటి నుంచి కార్యకర్తలను కలవడం, అభినందన సభల్లో పాల్గొనడంతోనే సరిపెట్టుకుంటున్నారు. మరోవైపు జిల్లా సీనియర్ నాయకులు మాజీ మంత్రి సంబాని చంద్రశేఖర్ కనీస ఉనికిని కూడా చాటుకోలేదు. ఇక అశ్వారావుపేట, భద్రాచలం మాజీ ఎమ్మెల్యేలకు క్యాడర్ దూరమయింది. పొత్తులో భాగంగా పినపాకను సీపీఐకి కేటాయిండంతో అలిగిన రేగ కాంతారావుకు సముచిత స్థానం కల్పిస్తామన్న అధిష్టానం చతికిల పడటంతో ఆయన భవిష్యత్తు కూడా ఆగమ్య గోచరంగా మారింది. ఇలా గెలిచిన వారు, ఓడిన వారు అంతా నిరుత్సాహంతో ఉండటంతో కార్యకర్తలు ప్రత్యామ్నాయం వైపు చూడాల్సి వస్తోందని జిల్లా రాజకీయ పరిశీలకులు అంటున్నారు.