the district collector
-
అంతా హడావుడే !
సాక్షి, గుంటూరు : రాష్ట్ర మంత్రి, జిల్లా కలెక్టర్ సహా అధికార యంత్రాంగం ఉరుకులు పరుగులు పెట్టింది. జిల్లా ఎస్పీలు, రెవెన్యూ అధికారులు అంతా ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. చివరకు ఉసూరుమంటూ వెనుదిరిగారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రోడ్డు మార్గాన వస్తున్నారని, కృష్ణా కరకట్ట ప్రాంతాన్ని పరిశీలిస్తారని సీఎం పేషీ నుంచి ఫోన్ కాల్ రావడంతో అధికారులు పడిన హడావుడి ఇది. ముఖ్యమంత్రి విమానంలో విశాఖపట్నం నుంచి వస్తూ రాజధాని ప్రాంతంపై ఓ లుక్కేసి తిరుపతి వెళ్లిపోయారు. వివరాల్లోకి వెళితే... రాజధాని ప్రాంతంలో మంగళవారం ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే ఉంటుందని, సింగపూర్ మంత్రి ఈశ్వరన్ కూడా ఉంటారని సోమవారం ప్రకటనలు వెలువడ్డాయి. దీంతో మంత్రులు, జిల్లా అధికారులు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాల్లో పాలుపంచుకున్నారు. మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో సీఎం రాజధాని ప్రాంతానికి రోడ్డు మార్గాన వస్తున్నట్లు సంక్రాంతి సంబరాల్లో ఉన్న జిల్లా కలెక్టర్‌కు సమాచారం వచ్చింది. వెంటనే ఆయన గుంటూరు ఆర్డీఓ భాస్కరనాయుడును వెంటతీసుకొని హడావుడిగా వేదిక దిగివెళ్లి పోయారు. జిల్లా ఎస్పీలను, తుళ్లూరులో ఉన్న రెవెన్యూ సిబ్బందిని అప్రమత్తం చేసి ప్రకాశం బ్యారేజీ నుంచి వెంకటపాలెం కరకట్ట వరకు బందోబస్తు ఏర్పాటుకు కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. కొద్దిసేపటికి సంక్రాంతి సంబరాల వేదికపై ఉన్న మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు సమాచారం అందడంతో ఆయన కూడా హడావుడిగా కార్యక్రమాన్ని ముగించుకుని బయలుదేరి వెళ్లారు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డీఓలతో కలిసి వెంకటపాలెం చేరుకొని సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. అయితే సీఎం విశాఖపట్నం నుంచి విమానంలో వస్తూ రాజధాని ప్రాంతంలో ఏరియల్ సర్వే చేసి తిరుపతి వెళ్లిపోవడంతో అంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుని వెనుదిరిగారు. ఇదిలావుండగా, రాజధాని ప్రాంతంలో మంత్రులు, ముఖ్యమంత్రి పర్యటనలు ముందస్తు సమాచారం లేకుండా హఠాత్తుగా ఖరారు అవుతుండటంతో జిల్లా ఉన్న తాధికారులు, పోలీసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
అంతా స్క్రిప్ట్ ప్రకారమే ..
సాక్షి ప్రతినిధి, కడప: రాజ్యాంగ విధివిధానాలకు లోబడి, రాగద్వేషాలకు అతీతంగా చట్టాన్ని పరిరక్షించాల్సిన జిల్లా యంత్రాంగం తద్భిన్నంగా వ్యవహరిస్తోంది. జెడ్పీ చైర్మన్‌ను వ్యూహాత్మకంగా అధికారపార్టీ సభ్యులు కించపరిస్తే సాక్షాత్తు జిల్లా కలెక్టర్ అందుకు వంత పాడారు. ఛైర్మన్ నిర్ణయాన్ని గౌరవించి, తదనుగుణంగా వ్యవహరించాల్సిన కలెక్టర్ అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. జిల్లాలో ప్రథమ పౌరుడు, కేబినేట్ ర్యాంకు హోదా కల్గిన వ్యక్తి, జిల్లాపరిషత్‌కు సుప్రీం ఛైర్మన్ గూడూరు రవి. రాజ్యాంగం కల్పించిన అవకాశం మేరకు ఆయనకు ఆ హోదా దక్కింది. ఆ హోదాను గౌరవించాల్సిన బాధ్యత జిల్లా వాసులందరిపై ఉంది. శనివారం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం అందుకు వేదికగా నిలిచింది. జెడ్పీ ఛైర్మన్ సమావేశాన్ని కొనసాగిస్తున్నా జిల్లా కలెక్టర్ కేవీ రమణ అధికారులను వెళ్లిపోవాలని ఆదేశించారు. జిల్లా సర్వోన్నతాధికారి ఆదేశాల మేరకు జిల్లాలోని ఇతర అధికారులు సైతం పంచాయితీరాజ్ యాక్టును ఉల్లంఘించారు. ఛైర్మన్ పట్ల స్పష్టమైన వివక్షత.... జిల్లాలో రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తే అధికారపార్టీ నిర్ణయానికి జీ..హుజూర్..అన్న రీతిలో అధికార యంత్రాంగం నడుచుకుంటున్నదని పలువురు భావిస్తున్నారు. అందుకు ఎంపీడీఓల బదిలీలు ప్రభుత్వం నిలిపేస్తూ ఉత్తర్వులు ఇవ్వడమే ప్రత్యక్ష నిదర్శనం. జిల్లా పరిషత్ ఛైర్మన్ గూడూరు రవి పరిపాలన సౌలభ్యం మేరకు 26 మంది ఎంపీడీఓలకు స్థానచలనం కల్పించారు. అయితే బదిలీలల్లో అవినీతి ఆరోపణలు చోటుచేసుకున్నాయని, జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఆమేరకు బదిలీలు రద్దు చేస్తూ నవంబర్ 22న ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఎవరు అవినీతికి పాల్పడ్డారు.. వారిపై ఇంతకాలం ఎందుకు చర్యలు తీసుకోలేదన్న విషయం ప్రశ్నార్థకంగా నిలిచిపోయింది. జిల్లా కలెక్టర్ కేవీ రమణకు లభించిన సమాచారం మేరకు అవినీతికి పాల్పడ్డ వ్యక్తుల్ని గుర్తించడానికి సమయం ఎంత కావాలి.. జిల్లా కలెక్టర్ స్వయంగా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన నేపధ్యంలో ఇప్పటి వరకూ ఎంపీడీఓ బదిలీలల్లో అవినీతికి పాల్పడ్డవారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఛైర్మన్ అధికారపార్టీ సిఫార్సులకు తలొగ్గలేదనే కారణంగానే ఎంపీడీఓల బదిలీలు రద్దు చేయించినట్లు పరిశీలకులు పేర్కొంటున్నారు. అంతటితో సరిపెట్టుకోక సర్వసభ్య సమావేశం లో సైతం మరోమారు వివక్షత ప్రస్ఫుటం అయింది. టీడీపీ సభ్యులు కొందరు ప్రత్యక్షంగా ఛైర్మన్‌ను ఉద్దేశించి డమ్మీ ఛైర్మన్ అంటూ వ్యాఖ్యానాలు చేశారు. రేపు సమావేశంకు సహకారం అందినా? జెడ్పీ సర్వసభ్య సమావేశాన్ని మంగళవారానికి వాయిదా వేస్తూ ఛైర్మన్ రవి నిర్ణయం తీసుకున్నారు. అయితే రేపు నిర్వహించనున్న సమావేశానికి సైతం జిల్లా కలెక్టర్ నుంచి సహకారం ప్రశ్నార్థకమేనని పలువురు చెప్పుకుంటున్నారు. వాస్తవానికి 15రోజులు ముందుగా నోటీసులు ఇవ్వాలని ఎప్పుడంటే అప్పుడు సమావేశం అంటే కుదరదు అని కలెక్టర్ బహిరంగంగా పేర్కొన్నారు. వాస్తవానికి వారం రోజులు ముందుగా సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం అందించాలని పంచాయితీరాజ్ యాక్టు వివరిస్తోంది. ప్రత్యేక సమావేశమైతే 2రోజులు ముందుగా సమాచారం అందించి నిర్వహించాలి. సమావేశం కొనసాగింపు అయితే మరుసటి రోజు సైతం నిర్వహించాల్సి ఉంది. అధికారులకు ఎలాంటి అడ్డంకులు కారాదని, శెలవు దినం ఆదివారం, సోమవారం గ్రీవెన్స్‌సెల్‌ను పరిగణలోకి తీసుకుని మంగళవారానికి వాయిదా వేశారు. మంగళవారం సైతం సమావేశం నిర్వహణకు సభ్యులు హాజరైనా అధికారుల నుంచి సహకారం అందుతుందా? అన్న విషయాన్ని జిల్లా వాసులు చర్చించుకుంటున్నారు. -
బాలికలపై వివక్ష తగదు
మహబూబ్‌నగర్ విద్యావిభాగం: బాలికలపై వివక్ష తగదని జిల్లాలోని బాలికల సమగ్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయూల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ జి.డి.ప్రియదర్శిని అన్నారు. మంగళవారం స్థానిక ఐసీడీఎస్ రాష్ట్ర సదన్‌లో నిర్వహించిన ‘బేటీ బచావో-బేటీ పడా వో’ అవగాహన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యూరు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో బాలికల నిష్పత్తి నానాటికి తగ్గుతుందన్నారు. మనకంటే వెనకబడిన దేశాలైన శ్రీలంక, నేపాల్, అప్ఘనిస్తాన్, మయన్మార్‌లలో కూడా బాలికల నిష్పత్తి మెరుగ్గా ఉందని తెలిపారు. సమాజంలో బాల, బాలికలు సమానమే అరుునా మహిళలకు రోజూ ఎక్కడో ఒక చోట అన్యాయం జరుగుతుందని ఆవేద న వ్యక్తం చేశారు. బాల,బాలికలకు సమానంగా చదువు నేర్పించాలని ఏ ఒక్కరిపైనా వివక్ష చూపరాదన్నారు. జిల్లా లింగ నిర్ధారణ చేసే స్కానింగ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని, అక్రమ స్కానింగ్ సెంట ర్లపై అధికారులకు సమాచారం అందించాలని కోరారు. మిహ ళా చట్టాలను పకడ్బందీగా అమలు చేసేం దుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం ఆడపిల్ల అభివృద్ధికి చేపట్టిన పథకాలపై విస్తృ త ప్రచారం కల్పించాలన్నారు. జిల్లాలో విద్యాభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. గర్భిణీలకు పౌష్టికాహారం పంపిణీని సమీక్షించాలన్నారు. జిల్లాలో దాదాపు 10వేల మంది బడిఈడు పిల్లలు బడిబయట ఉన్నారని, వారిని పాఠశాలల్లో చేర్పించేం దుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. బాలికలకు ఆహారం, వసతి, ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఏజేసీ డాక్టర్ రాజారాం మాట్లాడుతూ మహిళలకు ప్రత్యేకంగా రూపొం దించిన ‘బంగారు తల్లి’, కళ్యాణ లక్ష్మి వంటి పథకాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో ఐసీడీఎస్ పీడీ ఇందిర, డీఎంఅండ్‌హెచ్‌ఓ సరస్వతి, సమితి ప్రతినిధులు శ్రీధర్, విజయలక్ష్మి, సిడిపిఓలు పాల్గొన్నారు. అంతకు ముందు శిశువిహార్‌లో ఉన్న చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని కలెక్టర్ అడి గి తెలుసుకున్నారు. చిన్నారులకు ఎలాం టి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను అదేశించారు. -
రిటర్నింగ్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన 24 గంటల తర్వాత కూడా జిల్లా కేంద్రానికి వివరాలు అందకపోవడంపై జిల్లా కలెక్టర్ సంబంధిత రిటర్నింగ్ అధికారుల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ ముగిసిన తర్వాత వివరాలను అంచనా మీద తెలిపారు. కచ్చితమైన వివరాలు గురువారం మధ్యాహ్నానికి అందాల్సి ఉండగా.. ఒకటి, రెండు నియోజకవర్గాల నుంచి రాత్రి 7 గంటలకు రాకపోవడం కలెక్టర్ మండిపడ్డారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ పోలింగ్ వివరాలు సత్వరం పంపాలని సాయంత్రం నుంచి కలెక్టర్ వెంటపడుతుండగా.. పలువురు ఆర్ఓలు పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేకపోవడం గమనార్హం. ఆలూరు నియోజకవర్గానికి సంబంధించి పూర్తిగా వివరాలు మధ్యాహ్నానికి తయారు చేశారు. అయితే కలెక్టర్ కార్యాలయానికి మాత్రం వివరాలను ఏడు గంటలకు అందజేశారు. పాణ్యం రిటర్నింగ్ అధికారిపై జిల్లా అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వివరాలు ఇవ్వడానికి కరెంటు లేదని చెప్పడాన్ని కలెక్టర్ తీవ్రంగా పరిగణించారు. ఫోన్లు చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో చివరకు డీఆర్ఓ, జెడ్పీ సీఈఓ తదితరులు లైన్లోకి వెళ్లి గట్టిగా అడగటంతో నింపాదిగా వివరాలు అందజేశారు. కర్నూలు, శ్రీశైలం, ఆర్ఓలు కూడా వివరాలు ఇవ్వడంలో అలసత్వం వహించారు. -
ఎంసెట్ కౌన్సెలింగ్ తప్పుల తడక!
(న్యూస్‌లైన్, శ్రీకాకుళం ఫీచర్స్) : ఎంసెట్ కౌన్సెలింగ్‌ను ఎలాగైనా జరిపించి తీరాలన్న అధికారుల పట్టుదల విద్యార్థులకు శాపంగా పరిణమిస్తోంది. శిక్షణ లేని సిబ్బందితో విద్యార్థుల దరఖాస్తులు, ధ్రువీకరణ పత్రాల పరిశీలనను జరిపిస్తుండటంతో కౌన్సెలింగ్ తప్పుల తడకగా సాగుతోంది. రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా పాలిటెక్నిక్‌ల సిబ్బంది ఎంసెట్ కౌన్సెలింగ్‌ను బహిష్కరించటంతో సీమాంధ్రలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌లలో మొదటి రెండు రోజులూ కౌన్సెలింగ్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఉన్నత విద్యామండలి అధికారులు జిల్లా కలెక్టర్ల సాయంతో కౌన్సెలింగ్ నిర్వహణకు నడుం కట్టారు. అందుబాటులో ఉన్న సిబ్బందితో సర్టిఫికెట్ల పరిశీలనను నిర్వహించాలని నిర్ణయించారు. ఇదే విద్యార్థులకు చిక్కులు తెచ్చిపెడుతోంది. కౌన్సెలింగ్‌లో సర్టిఫికెట్ల పరిశీలన కీలకం. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతోపాటు, లోకల్ స్టేటస్‌కు సంబంధించిన పత్రాలను సిబ్బంది చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. రెండ్రోజుల కిందట రాజమండ్రిలో జరిగిన కౌన్సెలింగ్‌లో సర్టిఫికెట్ల పరిశీలనలోనే 150 తప్పులు జరిగినట్లు సమాచారం. శ్రీకాకుళం పాలిటెక్నిక్‌లో గురువారం జరిగిన కౌన్సెలింగ్‌లో అంబేద్కర్ యూనివర్సిటీ ఉద్యోగులు ధ్రువీకరణ పత్రాలను పరిశీలించారు. వీరు తాత్కాలిక సిబ్బంది కావడంతో జవాబుదారీతనం ఉండటం లేదు. ఎస్వీ యూనివర్సిటీ పరిధికి చెందిన ఓ విద్యార్థినిని నాన్‌లోకల్(రాష్ట్రేతర) కేటగిరీలోకి మార్చేశారు. పాలిటెక్నిక్ లెక్చరర్ ఒకరు దీనిని గమనించి అధికారులను హెచ్చరించారు. అధికారుల దృష్టికిరాని ఇలాంటి తప్పులు మరెన్ని జరిగి ఉంటాయోనని ఇటు తల్లిదండ్రులు, అటు విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. వేరే సిబ్బందితో ఎలా చేయిస్తారు..? శిక్షణ లేని సిబ్బందితో కౌన్సెలింగ్ నిర్వహించడంపై పాలిటెక్నిక్ ఆల్ లెక్చరర్స్ అసోసియేషన్(పాలా) అధ్యక్షుడు చంద్రశేఖర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారుల అత్యుత్సాహం వల్ల వేలాదిమంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరించారు. కౌన్సెలింగ్ ముగిసి సీట్లు కేటాయించిన తర్వాత విద్యార్థులు కోర్టులను ఆశ్రయించే ప్రమాదం ఉందన్నారు. అనుభవం లేని సిబ్బందితో కౌన్సెలింగ్ నిర్వహించకూడదని ఎంసెట్ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయని, అధికారుల తొందరపాటు నిర్ణయాలు విద్యార్థుల జీవితాలను గందరగోళంలో పడేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జేఏసీ ఏర్పాటుకు చర్యలు ‘పాలా’తో తెలంగాణ పాలిటెక్నిక్ లెక్చరర్ల నాయకులు తెగతెంపులు చేసుకోవడంతో సమైక్యాంధ్ర పాలిటెక్నిక్ టీచర్స్ జేఏసీ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. సీమాంధ్రలోని పాలిటెక్నిక్‌లలో ఉన్న పాలా, నాన్ పాలా సభ్యులంతా కలిసి జేఏసీగా ఏర్పడి సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్లేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చంద్రశేఖర్ ‘న్యూస్‌లైన్’తో చెప్పారు. రెండ్రోజుల్లో జేఏసీ సభ్యుల వివరాలు, కార్యాచరణ వెల్లడిస్తామని తెలిపారు.