ఎంసెట్ కౌన్సెలింగ్ తప్పుల తడక!
Published Fri, Aug 23 2013 4:07 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
(న్యూస్‌లైన్, శ్రీకాకుళం ఫీచర్స్) : ఎంసెట్ కౌన్సెలింగ్‌ను ఎలాగైనా జరిపించి తీరాలన్న అధికారుల పట్టుదల విద్యార్థులకు శాపంగా పరిణమిస్తోంది. శిక్షణ లేని సిబ్బందితో విద్యార్థుల దరఖాస్తులు, ధ్రువీకరణ పత్రాల పరిశీలనను జరిపిస్తుండటంతో కౌన్సెలింగ్ తప్పుల తడకగా సాగుతోంది. రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా పాలిటెక్నిక్‌ల సిబ్బంది ఎంసెట్ కౌన్సెలింగ్‌ను బహిష్కరించటంతో సీమాంధ్రలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌లలో మొదటి రెండు రోజులూ కౌన్సెలింగ్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఉన్నత విద్యామండలి అధికారులు జిల్లా కలెక్టర్ల సాయంతో కౌన్సెలింగ్ నిర్వహణకు నడుం కట్టారు.
అందుబాటులో ఉన్న సిబ్బందితో సర్టిఫికెట్ల పరిశీలనను నిర్వహించాలని నిర్ణయించారు. ఇదే విద్యార్థులకు చిక్కులు తెచ్చిపెడుతోంది. కౌన్సెలింగ్‌లో సర్టిఫికెట్ల పరిశీలన కీలకం. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతోపాటు, లోకల్ స్టేటస్‌కు సంబంధించిన పత్రాలను సిబ్బంది చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. రెండ్రోజుల కిందట రాజమండ్రిలో జరిగిన కౌన్సెలింగ్‌లో సర్టిఫికెట్ల పరిశీలనలోనే 150 తప్పులు జరిగినట్లు సమాచారం. శ్రీకాకుళం పాలిటెక్నిక్‌లో గురువారం జరిగిన కౌన్సెలింగ్‌లో అంబేద్కర్ యూనివర్సిటీ ఉద్యోగులు ధ్రువీకరణ పత్రాలను పరిశీలించారు. వీరు తాత్కాలిక సిబ్బంది కావడంతో జవాబుదారీతనం ఉండటం లేదు. ఎస్వీ యూనివర్సిటీ పరిధికి చెందిన ఓ విద్యార్థినిని నాన్‌లోకల్(రాష్ట్రేతర) కేటగిరీలోకి మార్చేశారు. పాలిటెక్నిక్ లెక్చరర్ ఒకరు దీనిని గమనించి అధికారులను హెచ్చరించారు. అధికారుల దృష్టికిరాని ఇలాంటి తప్పులు మరెన్ని జరిగి ఉంటాయోనని ఇటు తల్లిదండ్రులు, అటు విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
వేరే సిబ్బందితో ఎలా చేయిస్తారు..?
శిక్షణ లేని సిబ్బందితో కౌన్సెలింగ్ నిర్వహించడంపై పాలిటెక్నిక్ ఆల్ లెక్చరర్స్ అసోసియేషన్(పాలా) అధ్యక్షుడు చంద్రశేఖర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారుల అత్యుత్సాహం వల్ల వేలాదిమంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరించారు. కౌన్సెలింగ్ ముగిసి సీట్లు కేటాయించిన తర్వాత విద్యార్థులు కోర్టులను ఆశ్రయించే ప్రమాదం ఉందన్నారు. అనుభవం లేని సిబ్బందితో కౌన్సెలింగ్ నిర్వహించకూడదని ఎంసెట్ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయని, అధికారుల తొందరపాటు నిర్ణయాలు విద్యార్థుల జీవితాలను గందరగోళంలో పడేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
జేఏసీ ఏర్పాటుకు చర్యలు
‘పాలా’తో తెలంగాణ పాలిటెక్నిక్ లెక్చరర్ల నాయకులు తెగతెంపులు చేసుకోవడంతో సమైక్యాంధ్ర పాలిటెక్నిక్ టీచర్స్ జేఏసీ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. సీమాంధ్రలోని పాలిటెక్నిక్‌లలో ఉన్న పాలా, నాన్ పాలా సభ్యులంతా కలిసి జేఏసీగా ఏర్పడి సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్లేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చంద్రశేఖర్ ‘న్యూస్‌లైన్’తో చెప్పారు. రెండ్రోజుల్లో జేఏసీ సభ్యుల వివరాలు, కార్యాచరణ వెల్లడిస్తామని తెలిపారు.
Advertisement
Advertisement