ప్రారంభం కాని ఎంసెట్ కౌన్సెలింగ్
Published Tue, Aug 20 2013 6:13 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
ఎచ్చెర్ల క్యాంపస్, న్యూస్‌లైన్: అనుకున్నట్లే జరిగింది. ఉవ్వెత్తున సాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమం ముందు సర్కారు ఎత్తులు పారలేదు. ఎంత ఒత్తిడి చేసినా అధ్యాపకులు లొంగలేదు. ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం కాలేదు. మిణుకుమిణుకుమంటున్న ఆశతో రవాణా సౌకర్యాలు లేకపోయినా అష్టకష్టాలు పడి వచ్చిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు నిరాశే మిగిలింది. గంటల తరబడి వేచి చూసి ఉసూరుమంటూ వెనుదిరగాల్సి వచ్చింది. ఈ విషయం తెలిసినా.. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో ఎదుర్కొన్న అనుభవాలు గుర్తున్నా.. ఉప ముఖ్యమంత్రి, సాంకేతిక విద్యాశాఖ మంత్రి దామోదర రాజనరసింహ మొండిగా కౌన్సెలింగ్ ప్రారంభించాలని ఆదేశించడంతో విద్యార్థులకు కష్టనష్టాలే మిగిలాయి. ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ధ్రువీకరణ పత్రాల పరిశీలన, వెబ్ కౌన్సెలింగ్‌ను సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా పాలిటెక్నిక్ అధ్యాపకుల జేఏసీ తీర్మానం మేరకు బహిష్కరించారు.
కౌన్సెలింగ్ ఎట్టి పరిస్థితుల్లోనూ జరుగుతుందని ఉప ముఖ్యమంత్రి ప్రకటించడంతో శ్రీకాకుళం పురుషుల పాలిటెక్నిక్‌లో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ కేంద్రానికి సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుంచే విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. తొమ్మిది గంటల నుంచి ప్రవేశాల దరఖాస్తు పత్రాలను ప్రిన్సిపాల్ డాక్టర్ వీఎస్ దత్ విద్యార్థులకు అందజేశారు. అయితే రిజిస్ట్రేషన్ కౌంటర్ మాత్రం ప్రారంభించలేదు. దరఖాస్తులు పూర్తి చేసిన విద్యార్థులు ధ్రువీకరణ పత్రాల పరిశీలన కోసం నిరీక్షించారు. అధ్యాపకులు మాత్రం హెల్ప్‌లైన్ సెంటర్‌లో విధులకు హాజరు కాలేదు. మిగతా జిల్లాల్లో కౌన్సెలింగ్ పరిస్థితిని టీవీ చానళ్ల ద్వారా తెలుసుకున్న వీరు విధులకు హాజరుకాబోమని స్పష్టం చేశారు. మరోపక్క ప్రిన్సిపాల్ దత్‌కు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, ఎంసెట్ కన్వీనర్, జిల్లా కలెక్టర్ల నుంచి ఫోన్లు వచ్చాయి.
ఎలా అయినా ధ్రువీకరణ పత్రాలు పరిశీలించాలని, కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభించాలన్నది వాటి సారాంశం. ఇదే విషయాన్ని అయన అధ్యాపకులకు వివరించి, విధుల్లోకి రావాలని కోరగా సమైక్యాంధ్రకు మద్దతుగా విధులు బహిష్కరిస్తున్నట్లు వారు తేల్చి చెప్పారు. ఎస్మా, నో వర్క్-నో పే వంటి బెదిరింపులకు ప్రభుత్వం పాల్పడుతున్నా అధ్యాపకులు తమ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోలేదు. కాంట్రాక్ట్ అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది కూడా వారి బాటలోనే నడిచారు. ఫలితంగా 1 నుంచి 15వేల ర్యాంకర్లకు ధ్రువీకరణ పత్రాల పరిశీలన జరగలేదు. ఈ ర్యాంకుల మధ్య జిల్లాకు చెందినవారు 130 నుంచి 150 మంది వరకు ఉంటారని అధికారుల అంచనా. కాగా ఉదయం ఎనిమిది గంటలకే హెల్ప్‌లైన్ కేంద్రానికి చేరుకున్న విద్యార్థులు 11గంటల వరకు వేచి చూసి నిరాశతో వెనుదిరిగారు. ముందు జాగ్రత్త చర్యగా పాలిటెక్నిక్ కళాశాల గేటు ముందు,సహాయ కేంద్రం ముందు పోలీసులు భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఈనెల 22, 23 తేదీల్లో 40 వేల లోపు ర్యాంకు పొందినవారు ఆప్షన్లు నమోదు చేయాల్సి ఉంటుంది. అంటే 23లోగావీరందరి ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తి కావాలి. అసలు పరిశీలనే ప్రారంభం కాకపోతే మొత్తం ప్రక్రియను వాయిదా వేయాల్సింది. ఎందు కంటే రాష్ట్రం యూనిట్‌గా కౌన్సెలింగ్ జరుగుతుంది. విద్యార్థులు తమ ర్యాంకును బట్టి నచ్చిన కళాశాలలు, బ్రాంచీలకు ఆప్షన్లు ఇచ్చు కోవాలి. ఏ ఒక్కచోట ఇవి జరగకపోయినా రాష్ట్రమంతటా కౌన్సెలింగ్ నిలిచిపోతుంది. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా పాలిటెక్నిక్ అధ్యాపకులు విధులు బహిష్కరించారు. ప్రభుత్వ ఒత్తిడికి వారు లొంగడంలేదు. ఇంకా బెదిరిస్తే బోధన, మూల్యాంకన మాత్రమే తమ విధుల్లో భాగమని.. ధ్రువీకరణ పత్రాల పరిశీలన, వెబ్ కౌన్సెలింగ్‌లో పాల్గొనడం అదనపు బాధ్యతలని తేల్చి చెప్పాలని నిర్ణయించుకున్నారు. ఈ పరిస్థితుల్లో మంగళవారం కూడా ప్రారంభమయ్యే అవకాశం లేదు. కౌన్సెలింగ్ వాయిదా అనివార్యంగా కనిపిస్తోంది.
Advertisement
Advertisement