అంతా స్క్రిప్ట్ ప్రకారమే ..
సాక్షి ప్రతినిధి, కడప: రాజ్యాంగ విధివిధానాలకు లోబడి, రాగద్వేషాలకు అతీతంగా చట్టాన్ని పరిరక్షించాల్సిన జిల్లా యంత్రాంగం తద్భిన్నంగా వ్యవహరిస్తోంది. జెడ్పీ చైర్మన్‌ను వ్యూహాత్మకంగా అధికారపార్టీ సభ్యులు కించపరిస్తే సాక్షాత్తు జిల్లా కలెక్టర్ అందుకు వంత పాడారు. ఛైర్మన్ నిర్ణయాన్ని గౌరవించి, తదనుగుణంగా వ్యవహరించాల్సిన కలెక్టర్ అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. జిల్లాలో ప్రథమ పౌరుడు, కేబినేట్ ర్యాంకు హోదా కల్గిన వ్యక్తి, జిల్లాపరిషత్‌కు సుప్రీం ఛైర్మన్ గూడూరు రవి.
రాజ్యాంగం కల్పించిన అవకాశం మేరకు ఆయనకు ఆ హోదా దక్కింది. ఆ హోదాను గౌరవించాల్సిన బాధ్యత జిల్లా వాసులందరిపై ఉంది. శనివారం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం అందుకు వేదికగా నిలిచింది. జెడ్పీ ఛైర్మన్ సమావేశాన్ని కొనసాగిస్తున్నా జిల్లా కలెక్టర్ కేవీ రమణ అధికారులను వెళ్లిపోవాలని ఆదేశించారు. జిల్లా సర్వోన్నతాధికారి ఆదేశాల మేరకు జిల్లాలోని ఇతర అధికారులు సైతం పంచాయితీరాజ్ యాక్టును ఉల్లంఘించారు.
ఛైర్మన్ పట్ల స్పష్టమైన వివక్షత....
జిల్లాలో రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తే అధికారపార్టీ నిర్ణయానికి జీ..హుజూర్..అన్న రీతిలో అధికార యంత్రాంగం నడుచుకుంటున్నదని పలువురు భావిస్తున్నారు. అందుకు ఎంపీడీఓల బదిలీలు ప్రభుత్వం నిలిపేస్తూ ఉత్తర్వులు ఇవ్వడమే ప్రత్యక్ష నిదర్శనం. జిల్లా పరిషత్ ఛైర్మన్ గూడూరు రవి పరిపాలన సౌలభ్యం మేరకు 26 మంది ఎంపీడీఓలకు స్థానచలనం కల్పించారు.
అయితే బదిలీలల్లో అవినీతి ఆరోపణలు చోటుచేసుకున్నాయని, జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఆమేరకు బదిలీలు రద్దు చేస్తూ నవంబర్ 22న ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఎవరు అవినీతికి పాల్పడ్డారు.. వారిపై ఇంతకాలం ఎందుకు చర్యలు తీసుకోలేదన్న విషయం ప్రశ్నార్థకంగా నిలిచిపోయింది. జిల్లా కలెక్టర్ కేవీ రమణకు లభించిన సమాచారం మేరకు అవినీతికి పాల్పడ్డ వ్యక్తుల్ని గుర్తించడానికి సమయం ఎంత కావాలి.. జిల్లా కలెక్టర్ స్వయంగా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన నేపధ్యంలో ఇప్పటి వరకూ ఎంపీడీఓ బదిలీలల్లో అవినీతికి పాల్పడ్డవారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.
ఛైర్మన్ అధికారపార్టీ సిఫార్సులకు తలొగ్గలేదనే కారణంగానే ఎంపీడీఓల బదిలీలు రద్దు చేయించినట్లు పరిశీలకులు పేర్కొంటున్నారు. అంతటితో సరిపెట్టుకోక సర్వసభ్య సమావేశం లో సైతం మరోమారు వివక్షత ప్రస్ఫుటం అయింది. టీడీపీ సభ్యులు కొందరు ప్రత్యక్షంగా ఛైర్మన్‌ను ఉద్దేశించి డమ్మీ ఛైర్మన్ అంటూ వ్యాఖ్యానాలు చేశారు.
రేపు సమావేశంకు సహకారం అందినా?
జెడ్పీ సర్వసభ్య సమావేశాన్ని మంగళవారానికి వాయిదా వేస్తూ ఛైర్మన్ రవి నిర్ణయం తీసుకున్నారు. అయితే రేపు నిర్వహించనున్న సమావేశానికి సైతం జిల్లా కలెక్టర్ నుంచి సహకారం ప్రశ్నార్థకమేనని పలువురు చెప్పుకుంటున్నారు. వాస్తవానికి 15రోజులు ముందుగా నోటీసులు ఇవ్వాలని ఎప్పుడంటే అప్పుడు సమావేశం అంటే కుదరదు అని కలెక్టర్ బహిరంగంగా పేర్కొన్నారు.
వాస్తవానికి వారం రోజులు ముందుగా సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం అందించాలని పంచాయితీరాజ్ యాక్టు వివరిస్తోంది. ప్రత్యేక సమావేశమైతే 2రోజులు ముందుగా సమాచారం అందించి నిర్వహించాలి. సమావేశం కొనసాగింపు అయితే మరుసటి రోజు సైతం నిర్వహించాల్సి ఉంది.
అధికారులకు ఎలాంటి అడ్డంకులు కారాదని, శెలవు దినం ఆదివారం, సోమవారం గ్రీవెన్స్‌సెల్‌ను పరిగణలోకి తీసుకుని మంగళవారానికి వాయిదా వేశారు. మంగళవారం సైతం సమావేశం నిర్వహణకు సభ్యులు హాజరైనా అధికారుల నుంచి సహకారం అందుతుందా? అన్న విషయాన్ని జిల్లా వాసులు చర్చించుకుంటున్నారు.