పొలిటికల్ క్రికెటర్! | Anurag Thakur Political cricketer! | Sakshi
Sakshi News home page

పొలిటికల్ క్రికెటర్!

May 23 2016 1:00 AM | Updated on Sep 4 2017 12:41 AM

చాలా మంది క్రికెటర్లు ముందు ఆటలో గుర్తింపు తెచ్చుకున్న తర్వాత అడ్మినిస్ట్రేషన్‌లోకి దిగుతారు.

ఠాకూర్ ప్రస్థానం విభిన్నం

చాలా మంది క్రికెటర్లు ముందు ఆటలో గుర్తింపు తెచ్చుకున్న తర్వాత అడ్మినిస్ట్రేషన్‌లోకి దిగుతారు. కానీ అనురాగ్ ఠాకూర్ వారందరికంటే స్పెషల్. ఒక రాష్ట్ర క్రికెట్ సంఘంలో పరిపాలకుడిగా ఉంటూ ఫస్ట్‌క్లాస్ క్రికెట్ బరిలోకి దిగిన ఏకైక ‘ఆటగాడిగా’ ఆయన పేరు నిలిచిపోయింది. 2000లో హిమాచల్ క్రికెట్ సంఘానికి అధ్యక్షుడిగా ఉంటూ జమ్మూ కశ్మీర్‌తో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో ఠాకూర్ ఆడారు. జాతీయ జూనియర్ సెలక్టర్ అయ్యేందుకు ఒక్క ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ అయినా ఆడాలన్న నిబంధన పూర్తి చేసేందుకు అది పనికొచ్చింది. ఆ సమయంలో ఠాకూర్ తండ్రి ప్రేమ్ కుమార్ ధుమాల్ హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత నుంచి గత 15 ఏళ్లుగా క్రికెట్ పరిపాలనలో ఠాకూర్ చురుగ్గా ఉన్నారు.

2011లో తొలిసారి సంయుక్త కార్యదర్శి హోదాలో బీసీసీఐలో అడుగుపెట్టిన ఆయన ఐదేళ్లలో అధ్యక్ష స్థాయికి చేరుకున్నారు. ధర్మశాలలో అత్యుత్తమ స్థాయి క్రికెట్ స్టేడియాన్ని నిర్మించడంలో ఠాకూర్‌దే కీలక పాత్ర. 2008 నుంచి హమీర్‌పూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ పార్టీ తరఫున ఎంపీగా వ్యవహరిస్తున్న ఠాకూర్, బీజేవైఎం జాతీయ అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు. ఠాకూర్‌కు భార్య షెఫాలీ, ఇద్దరు కుమారులు జై ఆదిత్య, ఉదయ్‌వీర్ ఉన్నారు.


సవాల్ ముందుంది...
లోధా కమిటీ సిఫారసులలో సాధ్యమైన అంశాలను తాము అమలు చేస్తామని, ఇతర కొన్ని అంశాలపై మాత్రం మరింత ఆలోచించాల్సి ఉందని కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నికైన అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యానించారు. క్రికెట్ పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఆయన కొత్తగా పది రకాల ప్రతిపాదనలు చేశారు. కరవులాంటి సమయాల్లోనూ నీటి సమస్య లేకుండా మ్యాచ్‌లను నిర్వహించేందుకు సోలార్ ప్యానెల్స్ వినియోగం, బధిర క్రికెటర్లకు సహాయం, కొత్తగా చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ ఎంపిక వాటిలో కీలకమైనవి. అదే విధంగా ఐపీఎల్ మరో బోర్డు చేతికి వెళ్లే అవకాశం కూడా లేదని ఆయన స్పష్టం చేశారు. ‘లోధా సిఫారసులను మేం ఒక అవకాశంగా కూడా భావిస్తున్నాం. వాటిలో కొన్ని ఇప్పటికే అమలు చేశాం కూడా. బోర్డులో కొన్ని లోపాలున్నా చాలా విషయాల్లో ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమంగా ఉంది. ఐపీఎల్ అనేది బీసీసీఐ దేశవాళీ టోర్నీల్లో ఒకటి. కాబట్టి దానిని విదేశాలకు తరలించే అవకాశమే లేదు’ అన్న ఠాకూర్... రాబోయే రోజుల్లో బీసీసీఐ ప్రతిష్టను నిలబెడతానని ప్రకటించారు.
 - సాక్షి క్రీడా విభాగం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement