- సమగ్రాభివృద్ధికి ఎంపిక
- నివేదిక రూపకల్పనలో యంత్రాంగం
యలమంచిలి : యలమంచిలి పట్టణ సమగ్రాభివృద్ధికి రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో పెలైట్ ప్రాజెక్టుగా యలమంచిలిని ఎంపిక చేసి మౌలిక వసతుల కల్పనపై నివేదిక తయారు చేయాలని కలెక్టర్‌ను ఆదేశించింది. కలెక్టర్ ఆదేశాలతో జిల్లా ముఖ్య ప్రణాళికా విభాగం, గణాంకశాఖలు నివేదికలు రూపొందించే పనిని చేపట్టారు. పట్టణంతో పాటు విలీన గ్రామాల్లో ఏఏ అంశాలతో నివేదిక సిద్ధం చేయాలో ప్రభుత్వం నిర్ణీత ఫార్మాట్‌ను పంపించింది.
శనివారం యలమంచిలి వచ్చిన ముఖ్య ప్రణాళికా విభాగం, గణాంక శాఖల అధికారులు, మున్సిపల్ కమిషనర్ ఎస్. శ్రీనివాసరావు, యలమంచిలి ఎంపీడీవో బి.శ్రీనివాసరావుతో చర్చించారు. యలమంచిలి విస్తీర్ణం, భౌగోళిక స్థితిగతులు, విలీన గ్రామాల పరిస్థితులను బట్టి ఏ అభివృద్ధి పనులు చేపడితే ఉపయోగం ఉంటుందో ఆరా తీశారు.
అనంతరం మండల పరిషత్ సమావేశ మందిరంలో చైర్‌పర్సన్ పిళ్లా రమాకుమారి అధ్యక్షతన వార్డు సభ్యులు, డ్వాక్రా సంఘాల ప్రతినిధులు, పట్టణ పేదరిక నిర్మూలనా విభాగం, వైద్య ఆరోగ్య శాఖల అధికారులతో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల 8, 9 తేదీల్లో పెలైట్ ప్రాజెక్టు నివేదిక కోసం సర్వేకు మున్సిపల్ అధికారులు సన్నద్ధమవుతున్నారు. వార్డు స్థాయిలో సమావేశాలు నిర్వహించి జనాభా, ఇళ్లు, అద్దె ఇళ్లలో ఉంటున్న వారి వివరాలు, మరుగుదొడ్లు, స్నానపు గదులు, విద్యాసంస్థలు, ఇతర మౌలిక వసతుల వివరాలను సేకరించనున్నారు.
ఇందుకోసం వార్డు సభ్యుని అధ్యక్షతన ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. సర్వే పక్కాగా చేపట్టేందుకు ఈ బృందాల్లో సభ్యులకు అవగాహన కల్పిస్తున్నారు. యలమంచిలిలో తాగునీరు, పారిశుద్ధ్యం మెరుగుకు మున్సిపల్ పాలకవర్గం పెలైట్ ప్రాజెక్టును వినియోగించుకోవాలని భావిస్తోంది. నివేదికలు పూర్తయి కార్యరూపం దాల్చితే యలమంచిలి అభివృద్ధి పథంలో పయనించే అవకాశం ఉంది.