శివాజీ పరిపాలన-రెవెన్యూ విధానం | Chatrapati Shivaji administration-revenue Policy | Sakshi
Sakshi News home page

శివాజీ పరిపాలన-రెవెన్యూ విధానం

Published Thu, Dec 1 2016 4:07 AM | Last Updated on Mon, Sep 4 2017 9:32 PM

శివాజీ పరిపాలన-రెవెన్యూ విధానం

శివాజీ పరిపాలన-రెవెన్యూ విధానం

 1674, జూన్ 16న పట్టాభిషక్తుడైన శివాజీ.. ఛత్రపతి అనే బిరుదును స్వీకరించాడు. తన రాజ్యానికి ‘స్వరాజ్’ అని నామకరణం చేశాడు. సైన్యాన్ని నడపడంలోనూ, గెరిల్లా యుద్ధాలు చేయడంలోనూ శివాజీ అసమాన ప్రతిభను కనబరిచాడు. పరిపాలనలో  ప్రజా సంక్షేమానికి బాటలు పరిచాడు. ఇందుకోసం మంచి పరిపాలన వ్యవస్థను ఏర్పాటు చేశాడు.
 పరిపాలనలో తనకు సహకరించడానికి ఎనిమిది మంది మంత్రులను నియమించుకున్నాడు. వారిని ‘అష్ట ప్రధానులు’గా పిలిచేవారు.
  పీష్వా: అష్ట ప్రధాన వ్యవస్థలో పీష్వా అత్యంత ప్రధానమైన వ్యక్తి. ఇతనిది ప్రధానమంత్రి హోదా. చక్రవర్తి తర్వాత స్థానం అతనిదే. రాజ శాసనాలపై పీష్వా అధికార ముద్ర ఉండేది.
 అమాత్య: ఇతడ్ని మజుందార్ అని కూడా వ్యవహరించేవారు. ఆర్థిక శాఖకు అధినేత. స్వరాజ్ ఆదాయ వ్యయాలన్నీ ఈయన అధీనంలోని ముఖ్య అధికారులు, ఉద్యోగులు చూసుకొనేవారు.
 మంత్రి: రాజ దర్బారుకు సంబంధించిన కార్యకలాపాలు, ఆస్థాన వ్యవహారాలను నిర్వహించడం, ముఖ్య సమావేశాలను ఏర్పాటు చేయడం ఇతని విధి.
 సచివ: చక్రవర్తి తరఫున ఉత్తరాలను, అధికార ప్రకటనలను రాసి రాష్ట్రాల అధికారులకు, సామంత రాజులకు అందజేయడం ఇతని విధి.
 సుమంత్: ఇతడు విదేశాంగ శాఖ అధినేత. ఇతర రాజ్యాలతో సంబంధాలు, యుద్ధాలు, ఒప్పందాలు తదితర అంశాల్లో చక్రవర్తికి సలహాలిచ్చేవారు.
 సేనాపతి: సైనిక బలగాల అధిపతి. సైనికుల నియామకం, శిక్షణ మొదలైన విధులు నిర్వర్తించేవారు.
 పండిత్ రావ్: మత వ్యవహారాల శాఖ మంత్రి.
 న్యాయాధీశ్: స్వరాజ్‌లో ఉన్నత న్యాయాధికారి.
 రెవెన్యూ విధానం
 రైతు సంక్షేమాన్ని, ప్రజాహితాన్ని దృష్ట్టిలో పెట్టుకొని శివాజీ భూమిశిస్తు, రెవెన్యూ విధానాన్ని రూపొందించాడు.
 భూమిశిస్తు శాఖలో పనిచేసే అధికారులు, ఉద్యోగులకు నగదు రూపంలో జీతభత్యాలు చెల్లించే పద్ధతిని ప్రవేశపెట్టాడు.
 మొత్తం ఫలసాయంలో ఐదింట రెండో వంతును(2/5) భూమిశిస్తుగా నిర్ణయించాడు.
 భూమి శిస్తును ధన రూపంలో, ధాన్య రూపంలో చెల్లించవచ్చు.
 జాగీర్దారీ పద్ధతిని రద్దు చే శాడు.
 కరువు కాటకాల సమయంలో రైతులకు విత్తనాలు, పశువులను కొనడానికి రుణాలిచ్చేవారు.
 రైతాంగానికి సులభ వాయిదా పద్ధతిపై రుణాలిచ్చే సౌకర్యం కల్పించారు.
 మహారాష్ర్ట ప్రజలు దోపిడీ, దండయాత్రలకు గురి కాకుండా ఉండేందుకు కొన్ని ప్రాంతాల్లో  చౌత్ (1/4) అనే పన్నును విధించారు. ఇది జిల్లా ఆదాయంలో నాల్గో వంతు ఉండేది.
 శివాజీ గౌరవార్థం సర్దేశ్‌ముఖ్ అనే పన్ను విధించారు. ఇది జిల్లా ఆదాయంలో పదోవంతు ఉండేది. 
 ప్రభుత్వ కోశాగారానికి వచ్చిన ఆదాయాన్ని ఎక్కువ భాగం ప్రజాహితానికి వ్యయం చేసేవారు.
 లార్‌‌డ కారన్ వాలీస్ (1786-93)
  శాశ్వత భూమిశిస్తు విధానం: లార్‌‌డ కారన్ వాలీస్ 1786లో గవర్నర్ జనరల్‌గా నియమితులయ్యారు. ఇతడ్ని భారతదేశానికి పంపేటప్పుడు రాజ్య విస్తరణ జోలికి వెళ్లవద్దని, పరిపాలనా వ్యవస్థ మీద ముఖ్యంగా భూమిశిస్తు సంస్కరణలపై దృష్టి పెట్టాలని ఇంగ్లండ్ ప్రభుత్వం ఆదేశించింది.
 లార్‌‌డ కారన్ వాలీస్ గవర్నర్ జనరల్ అయ్యే నాటికి జమిందారులు భూమిశిస్తును వసూలు చేసి అందులో తమ వాటా పోగా మిగిలింది ప్రభుత్వానికి చెల్లించేవారు.
 ఈ పద్ధతిలో ఏ ఏడాదికి ఆ ఏడాదే శిస్తు నిర్ణయమయ్యేది. అందుకే దీన్ని తాత్కాలిక పద్ధతిగా పేర్కొనేవారు.
 ఈ రకమైన భూమిశిస్తు వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో కచ్చితత్వం ఉండేది కాదు. 
 ఈ లోపాలను సరిదిద్దడానికి 1793లో (జమిందారీ) శాశ్వత శిస్తు పద్ధతిని ప్రవేశపెట్టారు.
 వేలంపాటలో ఎక్కువ పాట పాడిన వ్యక్తులకు రైతుల నుంచి శిస్తు వసూలు చేసే అధికారం కల్పించారు. వీరినే జమిందారులుగా 
 పేర్కొన్నారు.
 
 వేలం పాట వ్యవధి 25 నుంచి 30 సంవత్సరాలు ఉండేది.
 జమిందారీ పద్ధతి రూపశిల్పి అప్పటి రెవెన్యూ బోర్డు అధ్యక్షుడు సర్ జాన్ షోర్.
 భూమి శిస్తు ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కచ్చితంగా ఉండేందుకే ఈ పద్ధతిని ప్రవేశపెట్టారు.
 దీన్ని మొదటగా బెంగాల్, బిహార్, ఒడిశా, వారణాసి తదితర ప్రాంతాలతోపాటు మద్రాస్‌లో ఉన్న ఆంధ్ర ప్రాంతంలోనూ ప్రవేశపెట్టారు.
 ఈ విధానం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ప్రాబల్యం ఉన్న బలమైన జమిందారీ వర్గం ప్రభుత్వానికి విధేయంగా ఉండే పరిస్థితులు ఏర్పడ్డాయి.
 
 జమిందార్ల ఆదాయం పెరగడంతో విలాస జీవితానికి, వ్యసనాలకు అలవాటుపడ్డారు. దీంతో రైతు సంక్షేమాన్ని, వ్యవసాయాభివృద్ధిని అశ్రద్ధ చేయడంతో రైతాంగం అనేక ఇబ్బందులకు గురైంది.
 విలియం బెంటింక్ (1828-35)
 విలియం బెంటింక్ గవర్నర్ జనరల్ పదవి చేపట్టే నాటికి అధిక వ్యయాల కారణంగా ప్రభుత్వం అప్పుల్లో ఉంది. దీంతో ఆయన ఖర్చులను తగ్గించేందుకు చర్యలు చేపట్టాడు.
 
 సైనికుల భత్యాలను తగ్గించాడు.
 సైన్య, న్యాయ శాఖ ఉద్యోగుల జీతాల్లో కోత విధించాడు.
 బెంగాల్, మద్రాస్, బొంబాయి రాష్ట్రాల్లోని అదనపు సైన్యాన్ని తగ్గించాడు.
 నల్ల మందు వ్యాపారాన్ని క్రమబద్ధం చేశాడు.
 ఎక్కువ వేతనాలు పొందే ఇంగ్లండ్ వారికి బదులు తక్కువ వేతనాలకు భారతీయులను ఉన్నత పదవుల్లో నియమించాడు.
 ఈ సంస్కరణల ఫలితంగా ఒక మిలియన్ పౌండ్ల్ల లోటు పూడ్చడమే కాకుండా, ఒక మిలియన్ పౌండ్ల మిగులును సాధించాడు. 
 మహళ్వారీ పద్ధతి
 1833లో విలియం బెంటింక్ ఈ పద్ధతిని ప్రవేశపెట్టాడు. దీని రూపకర్త హాల్డ్ మెకంజే.
 ఈ విధానం ప్రకారం ఒక గ్రామంలోని భూమి అంతా ఆ గ్రామస్తులకు చెందిన ఆస్తిగా భావించి భూమికి సంబంధించిన అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని ఆ గ్రామం మొత్తానికి ఉమ్మడిగా శిస్తు విధించేవారు.
 
 గ్రామపెద్ద లంబార్దార్ శిస్తును వసూలు చేసేవాడు. శిస్తును వసూలు చేసినందుకు బ్రిటిష్ ప్రభుత్వం అతనికి 5 శాతం (పంచోత్రా) 
 కమీషన్ ఇచ్చేది.
 ఈ పద్ధతి ఉత్తరప్రదేశ్, ఔద్, పంజాబ్ తదితర ప్రాంతాల్లో అమల్లో ఉండేది.
 థామస్ మున్రో రైత్వారీ పద్ధతి
 1792లో సేలం జిల్లాలోని బారామహల్ ప్రాంతంలో నాటి కలెక్టర్ కెప్టెన్ రీడ్ ఈ విధానాన్ని ప్రవేశపెట్టాడు. కానీ ఇది ప్రచారంలోకి రాలేదు.
 కెప్టెన్ రీడ్‌కు సహాయ కలెక్టర్ అయిన థామస్ మున్రో 1800లో దత్త మండలాలకు కలెక్టర్ అయిన తర్వాత ఈ పద్ధతిని విజయవంతంగా అమలు చేశాడు.
 మద్రాసు, బొంబాయి, అస్సాం తదితర ప్రాంతాల్లో ఈ పద్ధతిని అమలు చేశాడు.
 ఈ విధానంలో ప్రభుత్వానికి, రైతులకు ప్రత్యక్ష సంబంధం ఉంటుంది.
 మధ్యవర్తులు లేని విధానం కావడం వల్ల            దీన్ని భూస్వామ్య పద్ధతుల్లో మేలైందిగా పేర్కొనవచ్చు.
 
 బ్రిటిష్ - ఆర్థిక విధానాలు
 ప్లాసీ యుద్ధం (1757) వరకు బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ కేవలం ఒక వర్తక సంఘంగా మాత్రమే వ్యవహరించేది. ఇంగ్లండ్‌లో తయారైన పారిశ్రామిక ఉత్పత్తులను మన దేశంలో అమ్మేవారు. మనదేశంలో కుటీర పరిశ్రమల్లో తయారైన కళాత్మక వస్తువులను ఇంగ్లండ్, ఐరోపా దేశాల్లో అధిక ధరలకు విక్రయించి మంచి లాభాలను గడించేవారు.
 
 ఈస్టిండియా కంపెనీ, వారి వ్యాపార కార్యకలాపాలు మనదేశ వస్తువుల ఉత్పత్తికి ఊతమిచ్చాయి. దీంతో బ్రిటిష్ ఉత్పత్తిదారులు కోపంతో రగిలిపోయారు. మనదేశ వస్తువుల దిగుమతులపై అనేక ఆంక్షలు విధించేందుకు వీలుగా బ్రిటిష్ పార్లమెంటులో అనేక చట్టాలు తీసుకువచ్చారు. అయినప్పటికీ మనదేశ వస్తువులకు 18వ శతాబ్దం మధ్యభాగం వరకు ఇంగ్లండ్‌లో మంచి గిరాకీ ఉండేది.
 
 ఈస్టిండియా కంపెనీ మనదేశంలో క్రమేపీ రాజ్య విస్తరణలో ఆసక్తి చూపడం వల్ల, 1757తర్వాత వారి వ్యాపార సరళిలో మార్పు వచ్చింది. కంపెనీ తన రాజకీయ, సైనిక శక్తిని ఉపయోగించి మన ఉత్పత్తులను తక్కువ ధరలకు బ్రిటిష్ వర్తకులకు మాత్రమే అమ్మేలా నిర్బంధ చర్యలకు పూనుకుంది.
 18వ శతాబ్దం మధ్య భాగంలో ఇంగ్లండ్‌లో వచ్చిన పారిశ్రామిక విప్లవం మూలంగా వస్తూత్పత్తిలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. మనదేశ వ్యాపారంలో ఈస్టిండియా కంపెనీకి మాత్రమే ఉన్న గుత్తాధిపత్య అధికారాన్ని 1813లోని చార్టర్ చట్టం ద్వారా తొలగించారు. దీంతో ప్రతి బ్రిటిష్ పౌరుడు మనదేశంలో వ్యాపారం చేసుకోవడానికి అవకాశం ఏర్పడింది.
 
 భారతదేశం.. ఇంగ్లండ్ పాలనలో ఉన్నందుకు వారి అవసరాలకు అనుగుణంగా మన ఆర్థిక వ్యవస్థను ఉపయోగించుకున్నారు. మనదేశాన్ని ఒక వలస రాజ్యంగా మార్చడం వల్ల, వారి ఆర్థిక విధానాల మూలంగా మన చేనేత, కళాత్మక చేతివృత్తులు ధ్వంసమయ్యాయి.
 
 మనదేశ సంపదను వీలైంత మేరకు ఇంగ్లండ్ కొల్లగొట్టింది. దాదాపు రెండు శతాబ్దాలపాటు తిరుగులేని రాజ్యాధికారం చెలాయించి, దేశ సంపదను కొల్లగొట్టి ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసింది.
 
 బ్రిటిష్ వారి కంటే ముందు మనదేశాన్ని ఆక్రమించి పాలించిన విదేశీయులు మనదేశ ఆర్థిక వ్యవస్థ స్వరూపాన్ని గుర్తించారు. భారత, ఆర్థిక, రాజకీయ జీవన స్రవంతిలో భాగమై పరిపాలన కొనసాగించారు. అయితే బ్రిటిష్ ప్రభుత్వం ఎన్నడూ మనదేశ జీవనంలో అంతర్భాగం కాలేదు. 
 
 
 అక్కెనపల్లి మీనయ్య
 ఎకనామిక్స్ (హెచ్‌వోడీ)- రిటైర్డ్
 నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల,
 నల్లగొండ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement