Andhra Pradesh: మారుమూలైనా నిశ్చింత | Andhra Pradesh Govt Services with YSR Thalli Bidda Express Vehicles | Sakshi
Sakshi News home page

Andhra Pradesh: మారుమూలైనా నిశ్చింత

Published Sun, Apr 2 2023 3:44 AM | Last Updated on Sun, Apr 2 2023 10:56 AM

Andhra Pradesh Govt Services with YSR Thalli Bidda Express Vehicles - Sakshi

విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రి నుంచి కృష్ణా జిల్లా మాదలవారిగూడెంలోని ఇంటికి వెళ్లేందుకు తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనం ఎక్కుతున్న బాలింత తేజస్విని

ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న సీఎం వైఎస్‌ జగన్‌.. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కునారిల్లిన 108, 104 సేవలకు ఊపిరిలూదినట్టుగానే తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ సేవలను మరింతగా మెరుగు పరిచారు. గత ఏడాది ఏప్రిల్‌ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 500 కొత్త వాహనాలతో ‘డాక్టర్‌ వైఎస్సార్‌ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌’ సేవలను  విస్తరించడమే కాక, సమర్థవంతంగా అమలు చేయిస్తున్నారు. తల్లీబిడ్డల ఆరోగ్యానికి మరింత భరోసా కల్పిస్తూ వారికి రక్షగా నిలిచారు. 

సాక్షి, అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా బొబ్బరపాలెంకు చెందిన మాండ్రుమాక రాణి అనే గర్భిణి మార్చి 26వ తేదీన విజయవాడ జీజీహెచ్‌లో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. కొద్ది రోజుల విశ్రాంతి అనంతరం బుధవారం ఆస్పత్రి నుంచి వైద్యులు ఆమెను డిశ్చార్జి చేశారు. సిజేరియన్‌ ప్రసవం కావడంతో 150 కిలోమీటర్ల దూరంలోని ఊరికి బస్సు, రైలులో పసికందుతో పాటు ఆమెను తీసుకెళ్లడం కష్టం. ప్రత్యేకంగా ఆటో లేదా ట్యాక్సీ కిరాయికి తీసు­కుని వెళితే రూ.నాలుగైదు వేలు ఖర్చు అవుతుంది.

కూలి పని చేసుకుని జీవనం సాగించే ఈమె కుటుంబం అంత మొత్తం వెచ్చించలేదు. ఈ క్రమంలో ఆందోళన చెందుతున్న కుటుంబ సభ్యులకు ఆస్పత్రి సిబ్బంది ధైర్యం చెప్పారు. ప్రభుత్వం వైఎస్సార్‌ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనంలో ఉచితంగా బాలింతను, బిడ్డను ఇంటికి చేరుస్తుందని తెలిపా­రు. సిబ్బంది చెప్పినట్టుగానే బుధవారం సా­యంత్రం 5.33 గంటలకు రాణి, ఆమె సహాయకులను విజయవాడ జీజీహెచ్‌లో తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనంలో ఎక్కించుకుని రాత్రి 9.20 గంటలకు సొంత ఊరిలో వదిలి పెట్టారు.

ఈ సందర్భంగా రాణి మాట్లాడుతూ.. ‘108 అంబులెన్స్‌లో ఉచితంగా ఆస్పత్రికి తీసుకుని వచ్చారు. ఏ ఇబ్బంది లేకుండా మంచి వైద్య సేవలు అందించి ఆస్పత్రిలో కాన్పు చేశారు. డిశ్చార్జి అయిన నన్ను, నా బిడ్డను క్షేమంగా ఇంటి వద్దకు చేర్చారు. ప్రభుత్వం మాలాంటి వారి ఆరోగ్యం పట్ల ఇంత శ్రద్ధ తీసుకోవడం చూస్తుంటే ఎంతో ఆశ్చర్యంగా ఉంది.

ఇంత సాయం అందుతుందని నేను ఊహించలేదు. నిరుపేదలమైన మాపై ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది’ అని సంతోషం వ్యక్తం చేసింది. రాణి తరహాలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించిన మహిళలకు రాష్ట్రంలో వైఎస్సార్‌ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాలు అండగా నిలుస్తున్నాయి. 
 
రోజుకు సగటున 631 మందికి సాయం     
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బోధనాస్పత్రుల్లో 183, జిల్లా ఆస్పత్రుల్లో 107, ఏరియా ఆస్పత్రుల్లో 98, సీహెచ్‌సీల్లో 67, పీహెచ్‌సీల్లో 45 తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాలను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. ఈ వాహనాలు ఆయా ఆస్పత్రుల్లో ప్రసవించిన బాలింతల్లో రోజుకు సగటున 631 మంది చొప్పున ఏడాదిగా క్షేమంగా ఇంటికి చేర్చాయి. ఈ లెక్కన ఏడాదిలో 2,30,505 బాలింతలు సేవలు పొందారు. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 22,315 మంది లబ్ధి పొందారు. కాకినాడలో 15,881, విశాఖపట్నంలో 13,320, అనంతపురంలో 11,646 మంది బాలింతలు ఉన్నారు.  
 
రూపాయి ఖర్చు లేకుండా ఇంటికి.. 
గత ఏడాది ఏప్రిల్‌కు ముందు కేవలం 279 వాహనాలు మాత్రమే అందుబాటులో ఉండేవి. దీంతో డిశ్చార్జిలకు అనుగుణంగా వాహనాలు అందుబాటులో ఉండేవి కాదు. బాలింతలు సొంత డబ్బు ఖర్చు పెట్టి బస్సు, ఆటోలు, ట్యాక్సీల్లో ఇళ్లకు వెళ్లేవారు. ఈ అంశాన్ని గమనించిన ప్రభుత్వం పేదలపై రవాణా ఖర్చుల భారం పడకుండా చర్యలు తీసుకుంది. అప్పటి వరకూ ఉన్న పాత వాహనాలను పూర్తిగా తొలగించి, ఏకంగా 500 ఎయిర్‌ కండీషన్డ్‌ బ్రాండ్‌ కొత్త వాహనాలతో సేవలను విస్తరించింది.   
 
సురక్షిత ప్రయాణం 
గతంలో ఒక్కో వాహనంలో ఇద్దరు, ముగ్గురు బాలింతలు, వారి సహాయకులను తరలించేవారు. దీంతో వాహనంలో స్థలం సరిపోక తీవ్ర అవస్థలు పడేవారు. ప్రస్తుతం ఒక్కో ట్రిప్‌లో ఒకే బాలింతను తరలిస్తున్నారు. 400, 500 కి.మీ సుదూర ప్రాంతాల్లో సొంతూళ్లు ఉన్న బాలింతలను సైతం ఉచితంగా తరలిస్తున్నారు. ఆస్పత్రి నుంచి తల్లీ బిడ్డను ఇంటికి తరలించే సమయంలో భద్రత, రక్షణ విషయంలో ప్రభుత్వం అత్యంత శ్రద్ధ కనబరుస్తోంది. ప్రతి వాహనానికి జీపీఎస్‌ ట్రాకింగ్‌ ఉంటుంది. ఒక ప్రత్యేక యాప్‌ సైతం తయారు చేశారు.

ఈ యాప్‌లో డ్రైవర్‌ లాగిన్‌ అయ్యి, ఆస్పత్రి వద్ద బాలింతను ఎక్కించుకునే సమయంలో, సొంత ఊరిలో దించిన తర్వాత ఫొటోలు అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. సంబంధిత డ్రైవర్‌ డబ్బులు డిమాండ్‌ చేశాడా? గమ్య స్థానంలోనే వదిలాడా? లేదా? ప్రవర్తన లోపాలపై ఇళ్లకు చేరిన బాలింతలకు ఫోన్‌ చేసి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకుంటున్నారు. తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ సేవలను సమర్థవంతంగా అమలు చేయడం కోసం క్షేత్ర స్థాయిలో తలెత్తే సమస్యలు, ఇబ్బందులపై వైద్య శాఖ టోల్‌ ఫ్రీ నంబర్‌ 104 ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తోంది.  
 
గర్భిణులకు అన్ని విధాలా భరోసా 
మహిళ గర్భం దాల్చిన నాటి నుంచి పండంటి బిడ్డకు జన్మనిచ్చి, ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకునేంత వరకు అన్ని దశల్లో ప్రభుత్వం అండగా నిలుస్తోంది. నెల నెలా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించడం, పౌష్టికాహారం అందించడం వంటి చర్యలు చేపడుతోంది. నెలలు నిండిన గర్భిణులను ఇంటి నుంచి 108 వాహనంలో తీసుకెళ్లి కాన్పుకు ఆసుపత్రిలో చేరుస్తున్నారు. ఆస్పత్రిలో నాణ్యమైన వైద్య సేవలు, డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాలు కలిగిన మందులు ఉచితంగా అందిస్తున్నారు. ప్రసవానంతరం డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా కింద తల్లికి విశ్రాంతి సమయానికి రూ.5 వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నారు.  
      
తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్‌ సేవల్లో మార్పులు  
నాడు (2022 ఏప్రిల్‌కు ముందు వరకు)         
– 279 వాహనాలు     
– ఇరుకైన మారుతీ ఓమినీ వాహనం     
– ఏసీ సౌకర్యం ఉండదు     
– ట్రిప్‌కు ఇద్దరు ముగ్గురు బాలింతల తరలింపు     
 
నేడు (2022 ఏప్రిల్‌ తర్వాత) 
– 500 వాహనాలు     
– విశాలమైన మారుతీ ఈకో వాహనం     
– ఏసీ సౌకర్యం ఉంటుంది         
– ట్రిప్‌కు ఒక బాలింత మాత్రమే తరలింపు     

క్షేమంగా తీసుకొచ్చి.. తీసుకెళ్తున్నారు 
గత నెల 22న నాకు పురిటి నొప్పులు వచ్చాయి. ఇంట్లో వాళ్లు 108కు ఫోన్‌ చేశారు. నిమిషాల్లో అంబులెన్స్‌ వచ్చింది. నన్ను హుఠాహుటిన విజయవాడ ఆస్పత్రికి తీసుకువచ్చి అడ్మిట్‌ చేశారు. అదే రోజు వైద్యులు నాకు కాన్పు చేశారు. బాబు పుట్టాడు. డిశ్చార్జి అయిన నన్ను ప్రత్యేక వాహనంలో ఇంటికి తీసుకెళ్లారు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్షేమంగా ఆస్పత్రికి తీసుకుని రావడం.. ఉచితంగా వైద్యం అందించడం.. తిరిగి ఇంటికి తీసుకు వెళ్లడం గొప్ప విషయం.  
– వి.తేజస్విని, బాలింత, మాదలవారిగూడెం, కృష్ణా జిల్లా 
 
రూ.నాలుగు వేలు ఆదా 
ఇటీవల గుంటూరు జీజీహెచ్‌లో బిడ్డకు జన్మనిచ్చాను. మా ఊరు గుంటూరు నుంచి 100 కి.మీ పైనే ఉంటుంది. డిశ్చార్జి అయ్యాక ప్రత్యేక వాహనంలో నన్ను, నా వెంట ఉన్న వారిని ఎక్కించుకుని ఇంటికి చేర్చారు. మేం ప్రత్యేక వాహనం మాట్లాడుకుని వెళ్లింటే రూ.నాలుగు వేల వరకు ఖర్చయ్యేది. ఆ మొత్తం మాకు ఆదా అయింది.  
– వి.సుజాత, బాలింత, మిరియాల, పల్నాడు జిల్లా 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement