విజయవాడ : విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చోటు చేసుకున్న కీచకపర్వం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వైద్యం కోసం ప్రభుత్వాసుపత్రికి వచ్చిన మహిళపై ఆసుపత్రి వైద్యుడు, రేడియాలజిస్ట్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఆసుపత్రికి వచ్చే మహిళలపై వారు తరచుగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఆ విషయం తెలియడంతో ఆసుపత్రి వర్గాలు రంగంలోకి దిగి... ఆ అంశం బయటకు రాకుండా బాధితురాలతో రాజీ కుదిర్చారు. అయితే ఆ విషయం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్కి తెలిసింది. దీంతో ఆయన ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై విచారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి కామినేని ఆదేశించారు. నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కామినేని గురువారం స్పష్టం చేశారు.