
సాక్షి, అమరావతి/లబ్బీపేట(విజయవాడ తూర్పు): గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ దంపతులు విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో మంగళవారం కరోనా టీకా వేయించుకున్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ కె.శివశంకర్ పర్యవేక్షణలో నర్సు ఝాన్సీ.. గవర్నర్ హరిచందన్, ఆయన సతీమణి సుప్రవ హరిచందన్‌లకు టీకా మొదటి డోసు వేశారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ.. వ్యాక్సిన్ ఎంతో సురక్షితమని, ఎలాంటి అనుమానం లేకుండా అందరూ టీకా వేయించుకోవాలని సూచించారు. ఈ నెల 30న రెండో డోసు తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు తెలిపారు.
ఇంత త్వరగా టీకా కనుగొనడం ద్వారా భారత శాస్త్రవేత్తలు మన దేశ వైజ్ఞానిక ఘనతను ప్రపంచానికి చాటిచెప్పారన్నారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో వైద్య సిబ్బంది ఎంతగానో కృషి చేశారని అభినందించారు. ఆయన వెంట గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, కృష్ణా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్, జేసీ ఎల్.శివశంకర్, సబ్‌కలెక్టర్ ధ్యానచంద్ర, ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం వీసీ శ్యామ్ ప్రసాద్, డీఎంహెచ్‌వో సుహాసిని తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment