గుంటూరు జీజీహెచ్‌లో వ్యాక్సిన్ వేయించుకుంటున్న డాక్టర్ కవిత
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్–19 వ్యాక్సిన్ ప్రక్రియ రెండో రోజూ చురుగ్గా కొనసాగింది. ఉదయం 9 గంటలకే వ్యాక్సిన్ ప్రక్రియ చేపట్టి సాయంత్రం వరకూ కొనసాగించారు. రెండవ రోజు 13,036 మందికి వ్యాక్సిన్ వేశారు. ఈ నెల 16న తొలిరోజు 19,108 మందికి వ్యాక్సిన్ వేసిన విషయం తెలిసిందే. ఆదివారం అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1,959 మందికి, అత్యల్పంగా కృష్ణా జిల్లాలో 480 మందికి వ్యాక్సిన్ వేశారు. కృష్ణా జిల్లా పెనమలూరు పీహెచ్‌సీ పరిధిలో బి.కవిత, నెల్లూరు జిల్లా కలిగిరిలో గణపట్ల వెంకట రత్నలు వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత స్వల్పంగా అస్వస్థతకు గురయ్యారు.
వారికి వైద్య పరీక్షలు నిర్వహించి, కొంత సేపు అక్కడే పరిశీలనలో ఉంచారు. అనంతరం పూర్తిగా కోలుకోవడంతో ఇంటికి పంపించారు. మొత్తంగా రెండు రోజుల్లో వ్యాక్సిన్ వేయించుకున్న వారి సంఖ్య 32,144కు చేరింది. మిగతా వారికి వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతుందని కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు తెలిపారు. వారంలో ఏడు రోజులూ వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగించాలా.. లేక ఆరు రోజులు పాటు వేసి ఒకరోజు విశ్రాంతి ఇవ్వాలా అన్నది నేడు నిర్ణయిస్తామని అధికారులు చెప్పారు. ఇదిలా ఉండగా చిన్నారులకు, గర్భిణులకు ఇచ్చే వ్యాధి నిరోధక టీకాలకు ఎలాంటి ఆటంకం లేకుండా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని అధికారులు సిబ్బందిని ఆదేశించారు.
టీకా విజయవంతం శుభపరిణామం
గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్
కరోనా మహమ్మారి అంతానికి దేశీయంగా రెండు టీకాలను విజయవంతంగా అభివృద్ధి చేయడం భారత దేశ ఘనతకు తార్కాణం అని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. అతి తక్కువ వ్యవధిలో టీకాలను అందుబాటులోకి తెచ్చి భారతీయ శాస్త్రవేత్తలు దేశ కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పారన్నారు. ఆరోగ్య సంరక్షణ నిపుణులు, ఆరోగ్య కార్మికులకు మొదటి దశ టీకా కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వైద్య, ఆరోగ్య శాఖకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆదివారం ఒక ప్రకటనలో అభినందనలు తెలిపారు. ఇది గొప్ప శుభపరిణామమని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment