
సాక్షి, అమరావతి: మరోమారు ఉధృత రూపం దాలుస్తున్న కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనా కట్టడికి పటిష్ట చర్యలు తీసుకోవాల్సిందిగా వైద్య, ఆరోగ్య శాఖ, రెవెన్యూ, మున్సిపల్, పోలీసు అధికారులను ఆదేశిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ముఖ్యంగా కలెక్టర్లు, పోలీసు, రెవెన్యూ అధికారులు కరోనా కట్టడి చర్యలను పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్‌మెంట్‌ను కట్టుదిట్టంగా అమలు చేయడంతోపాటు, వాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్రం ఇటీవల అన్ని రాష్ట్రాలను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రాష్ట్రంలో చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎస్ అధికారులను ఆదేశించారు.