సాక్షి, అమరావతి: కోవిడ్–19 టీకా ఇక ఊరి ముంగిట్లోకి రానుంది. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోనే ఆరోగ్య శాఖ టీకాలు వేయనుంది. ఇందుకోసం పైలెట్ ప్రాజెక్ట్ కింద గుంటూరు జిల్లా కాజా–1, యడ్లపాడు మండలం సొలస గ్రామ సచివాలయాల్లో, కృష్ణా జిల్లా మైలవరం మండలం చంద్రగూడెం, జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు గ్రామ సచివాలయాల్లో శనివారం వ్యాక్సినేషన్ చేపట్టింది. ఇది విజయవంతం కావడంతో వీలైనంత త్వరగా ఇదే విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ఆరోగ్యశాఖ భావిస్తోంది. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో 45 ఏళ్లు దాటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, 60 ఏళ్లు దాటిన వారి వివరాలున్నాయి. వ్యాక్సినేషన్‌కు ముందు రోజే వారి ఆధార్ కార్డులను ఏఎన్‌ఎంలు, వలంటీర్ల ద్వారా సేకరించి నమోదు చేస్తారు. మరుసటి రోజు ఉదయం 8 గంటల నుంచే వాళ్లందరికీ వ్యాక్సిన్ ఇస్తారు. ఇలా క్షేత్ర స్థాయిలో అందరినీ సులభంగా గుర్తించవచ్చని, వీలైనంత త్వరగా వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తి చేయవచ్చన్నది అధికారుల భావన. దీంతో పాటు రోజూ ప్రాథమిక ఆస్పత్రి నుంచి బోధనాస్పత్రి వరకూ యథావిధిగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది.
నిన్న కరోనా నియంత్రణ.. నేడు వేగంగా వ్యాక్సినేషన్
దేశంలో ఏ రాష్ట్రమూ చేయని విధంగా కరోనా నియంత్రణలో ఆంధ్రప్రదేశ్ రోల్ మోడల్‌గా నిలిచింది. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్‌మెంట్ వ్యూహంతో అద్భుతంగా పనిచేసి.. అత్యుత్తమ ఫలితాలు సాధించిన విషయం తెలిసిందే. ఇదే తరహాలో ఇప్పుడు వ్యాక్సిన్ ప్రక్రియ కూడా చేపట్టాలని ప్రభుత్వం ప్రత్యేక వ్యూహంతో ముందుకెళుతోంది. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, 60 ఏళ్లు దాటిన వారు ఆస్పత్రులకు వచ్చి వ్యాక్సిన్ వేయించుకునేందుకు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఈ సమస్యను అధిగమించేందుకు ఇంటికి కూత వేటు దూరంలో వార్డు లేదా గ్రామ సచివాలయం వద్దకే వ్యాక్సిన్‌ను తీసుకొస్తే.. అలాంటి వారికి ప్రయోజనకరంగా ఉంటుందన్న ఉద్దేశంతోనే ఈ విధానాన్ని అమలుచేయనున్నారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా..
ఇంటికి దగ్గర్లోనే వ్యాక్సిన్ వేయడమనేది దేశంలో ఇప్పటి వరకూ ఏ రాష్ట్రమూ చేయలేదు. అలాంటిది మన రాష్ట్రంలో తొలిసారిగా గ్రామ/వార్డు సచివాలయం కేంద్రంగా టీకాలు వేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచించింది. దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా 19 వేల మంది పైచిలుకు ఉన్న ఏఎన్‌ఎంలు, 40 వేల మందికి పైగా ఉన్న ఆశా వర్కర్లను, వలంటీర్లను అధికారులు అప్రమత్తం చేశారు. ప్రభుత్వాస్పత్రుల్లోనే కాకుండా.. వార్డు/గ్రామ సచివాలయాల్లో రోజుకు లక్ష మందికి టీకా వేసే కార్యాచరణతో ముందుకెళుతున్నారు. ఓ వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియను క్షేత్ర స్థాయికి తీసుకెళుతూనే.. మరో వైపు ఆస్పత్రుల్లో పడకలను మళ్లీ సిద్ధం చేస్తున్నారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందీ లేకుండా 104కు కాల్ చేస్తే బెడ్‌లు కేటాయించే ప్రక్రియ ఉంటుంది. గ్రామ/వార్డు సచివాలయ పరిధిలో టీకా కార్యక్రమం జరిగితే మిగతా రాష్ట్రాల కంటే ముందుగా మన రాష్ట్రంలో వ్యాక్సినేషన్ పూర్తయ్యే అవకాశముంది.
వెంటనే వ్యాక్సిన్ ఇస్తాం..
ప్రస్తుతం వయసుల వారీ డేటా గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ఉంది. వాళ్లు కాకుండా ఇంకా ఎవరైనా ఉన్నారేమో గుర్తించాలని చెప్పాం. ఇలా అందరినీ గుర్తించి, సచివాలయానికి రప్పించి వెంటనే రిజిస్ట్రేషన్ చేసి వ్యాక్సిన్ వేస్తాం. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిగారి ఆదేశాల మేరకు త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా దీనిని అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నాం. ఈ ప్రక్రియలో వ్యాక్సినేషన్ వేగవంతమవుతుంది.
– కాటమనేని భాస్కర్, కమిషనర్, కుటుంబ సంక్షేమ శాఖ
Comments
Please login to add a commentAdd a comment