దూది, సూది మందుల్లేవు  | There is no Basic Facilities in the Govt Hospital | Sakshi
Sakshi News home page

దూది, సూది మందుల్లేవు 

Published Tue, Mar 5 2019 2:25 AM | Last Updated on Tue, Mar 5 2019 2:25 AM

There is no Basic Facilities in the Govt Hospital - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వాసుపత్రికి వెళితే.. రోగికి ఇంజెక్షన్‌ వేయాలంటే సిరంజీని బంధువులే కొని తేవాలి. అప్పుడే ఇంజెక్షన్‌ ఇస్తారు. కాలికి గాయమైతే దూది, మందు రోగులే కొనుక్కోవాలి. లేకుంటే ఏదైనా మందు రాసి పంపుతారు. సెలైన్‌ పెట్టాల్సి వస్తే రోగులు వాటిని కొనుక్కొచ్చి ఇవ్వాలి. జ్వరం వస్తే కనీసం ట్యాబ్లెట్లు కూడా అందుబాటులో ఉండవు. ఇదీ అనేక ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిస్థితి. అందుకే ఆయా ప్రభుత్వాసుపత్రులపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోంది. ఏదో గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణాల్లో ఉండే ప్రాంతీయ, జిల్లా ఆసుపత్రుల్లోనే కాదు, హైదరాబాద్‌ నడిబొడ్డున ఉన్న గాంధీ, ఉస్మానియా, నిలోఫర్‌ వంటి ప్రధాన బోధనాసుపత్రుల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. అందుకే వైద్యులపై రోగుల బంధువులు దాడులు చేసే పరిస్థితి నెలకొంటుందన్న విమర్శలు ఉన్నాయి. ఆసుపత్రులకు అవసరమైన నిధులను ప్రభుత్వం కేటాయిస్తున్నా అధికారులు మాత్రం వాటిని ఖర్చు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. 

కేటాయింపులే ఘనం.. 
వైద్య విధాన పరిషత్‌ ఆసుపత్రులు, ప్రజారోగ్య ఆసుపత్రులు, బోధనాసుపత్రులకు అవసరమైన మందులు, సర్జికల్‌ ఐటమ్స్‌ కోసం ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది. సిరంజీలు, గ్లౌవ్స్, దూది, బ్లేడ్లు, బ్యాండేజీ, కత్తెరలు ఇలా వందలాది సర్జికల్‌ ఐటమ్స్‌ ఆసుపత్రులకు చాలా అవసరం. ఇవి లేకుండా కనీస ప్రాథమిక వైద్యం చేయడం కష్టం. ఇలాంటి వాటిని కూడా కొనుగోలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రభుత్వాసుపత్రులు ఇచ్చే ఇండెంట్‌ ప్రకారం రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) వాటిని సరఫరా చేయాలి. 2017–18 ఆర్థిక సంవత్సరంలో మందుల కోసం ప్రభుత్వం రూ.175 కోట్లు కేటాయించింది. సర్జికల్‌ ఐటమ్స్‌ కోసం రూ.75 కోట్లు కేటాయించింది. ఆ ఏడాది మొత్తం నిధులను ఖర్చు చేశారు. ఆ ప్రకారం ఆసుపత్రులకు మందులు, సర్జికల్‌ ఐటమ్స్‌ సరఫరా జరిగాయి. అయినా అక్కడక్కడ కొరత ఉండనే ఉంది. ఇక 2018–19 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం మందులు, సర్జికల్‌ ఐటమ్స్‌ కోసం బడెట్లో నిధులు భారీగానే కేటాయించింది.

మందుల కోసం రూ.320 కోట్లు కేటాయిస్తే ఇప్పటివరకు రూ.210 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. సర్జికల్‌ ఐటమ్స్‌ కోసం ప్రభుత్వం రూ.185 కోట్లు కేటాయిస్తే రూ.55 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. అందులో రూ.90 కోట్లకు ఇండెంట్‌ పిలిచారు. బోధనాసుపత్రుల నుంచి రూ.45 కోట్లకు ఇండెంట్‌ వచ్చింది. మిగిలిన ఆసుపత్రుల నుంచి కూడా ఇండెంట్‌ పంపుతున్నారు. కానీ అధికారులు ఈ ఇండెంట్‌ ప్రకారం సర్జికల్‌ ఐటమ్స్‌ సరఫరా చేసేందుకు ససేమిరా అంటున్నారని కొందరు వైద్యాధికారులు చెబుతున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో చేసిన ఖర్చు కన్నా ఈసారి ఎందుకు ఎక్కువ అవసరమన్న వింత వాదనను టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ అధికారులు తెస్తున్నట్లు విమర్శలొస్తున్నాయి. పాత వాడకం ప్రకారమే ఈసారి కూడా నిధులు ఇస్తామన్న వైఖరి సమంజసం కాదంటున్నారు. ప్రభుత్వం బడ్జెట్‌ పెంచడమే నేరమా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం నిధులు కేటాయిస్తే వీరికి వచ్చిన నష్టమేంటని నిలదీస్తున్నారు.

అవసరం మేరకు కేటాయింపులు
సర్జికల్‌ ఐటమ్స్‌ కోసం అవసరమైన కేటాయింపులు చేస్తూనే ఉన్నాం. ఎక్కడా ఇబ్బంది లేదు. ఎక్కడెక్కడ కొరత ఉన్నాయో ఆన్‌లైన్‌ ద్వారా తెలుస్తుంది. ఆ ప్రకారం కేటాయింపులు చేసి కొనుగోలు చేస్తాం. అనవసరంగా ఎవరి కోసమో కొనుగోలు చేయబోం. ప్రస్తుతం వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఏమేరకు ఇండెంట్లు కావాలన్న దానిపై చర్చిస్తున్నాం. 
– చంద్రశేఖర్‌రెడ్డి, ఎండీ, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement