పల్లె వైద్యానికి గ్రహణం | Eclipse to the village 'treatment' | Sakshi
Sakshi News home page

పల్లె వైద్యానికి గ్రహణం

Published Sat, Oct 15 2016 4:14 PM | Last Updated on Mon, Sep 4 2017 5:19 PM

పల్లె వైద్యానికి గ్రహణం

పల్లె వైద్యానికి గ్రహణం

* ఆస్పత్రి అభివృద్ధి కమిటీల  ఏర్పాటులో జాప్యం
* రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేసిన అధికార పార్టీ
* విభేదాలతో పలువురు కోర్టుకు
* మూలనపడిన విలువైన యంత్రాలు
 
సాక్షి, గుంటూరు: పల్లె వైద్యానికి అధికార పార్టీ గ్రహణం పట్టింది. మైనింగ్‌లు మొదలుకొని, మద్యం వరకు దేనినీ వదలని తెలుగు తమ్ముళ్ళు ఇప్పుడు వైద్యశాలలపై పడుతున్నారు. కాసుల కక్కుర్తిలో ప్రతి పనికి అడ్డు తగులుతూ సొంత ప్రభుత్వ పథకాలను నీరుగారుస్తున్నారు. ప్రధానంగా జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖలో ఈ తంతు అధికంగా ఉంది. జిల్లాలో 83 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నప్పటికీ వాటిలో ఎక్కడా ఆస్పత్రి అభివృద్ధి కమిటీలు ఏర్పాటు చేయడం కానీ, వాటి ద్వారా నిధులు వినియోగించి పేదలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడడం గానీ జరగడం లేదు.
 
నిధులున్నా.. వినియోగమేదీ..
ప్రభుత్వాస్పత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు సరిపడా నిధులున్నా వినియోగించేందుకు ఆస్పత్రి అభివృద్ధి కమిటీ లనే ఏర్పాటు చేయలేదు. వాటి అనుమతి ఉంటేనే ఈ నిధులు వినియోగించాల్సిన పరిస్థితుల్లో కమిటీలను ఏడాదిన్నరగా ఏర్పాటు చేయకపోవడంతో అరకొర సౌకర్యాలతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మాతా శిశు మరణాలను తగ్గించటమే లక్ష్యంగా ప్రభుత్వం జిల్లాలో 11 ప్రభుత్వ ఆస్పత్రులకు స్కానింగ్‌ మిషన్‌లు మంజూరు చేసినా అవి నిరుపయోగంగా మారాయి. ఎనిమిది నెలల క్రితం జిల్లాకు వచ్చిన రూ.1.50 కోట్ల విలువ చేసే స్కానింగ్‌ మిషన్‌లు మూలన పడ్డాయి.
 
నిరుపయోగంగా యంత్రాలు..
ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతులు లేక ప్రసవాలకు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్నారనే విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం ఉచిత స్కానింగ్‌ పరీక్షల సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. రూ.1.50 కోట్లు వెచ్చించి జిల్లాలోని 11 ఆస్పత్రులకు వాటిని స్కానింగ్‌ మిషన్లను పంపించింది. సత్తెనపల్లి, రేపల్లె, చిలకలూరిపేట, మాచర్ల, నగరం, వినుకొండ, కొల్లిపర, పిట్టలవానిపాలెం, పొన్నూరు, పెదకూరపాడు, ప్రత్తిపాడు ప్రభుత్వ ఆస్పత్రులకు ఈ ఏడాది ఫిబ్రవరిలో వాటిని చేర్చారు. స్కానింగ్‌ మిషన్‌లు వచ్చి ఎనిమిది నెలలు దాటుతున్నా అవి నిరుపయోగంగా మూలన పడ్డాయి. స్కానింగ్‌లు చేయాలంటే తప్పనిసరిగా డీఎం అండ్‌ హెచ్‌ఓ కార్యాలయంలో స్కానింగ్‌ మిషన్‌ను రిజిస్ట్రేషన్‌ చేయించాలి. మిషన్‌ రిజిస్ట్రేషన్‌ చేయించేందుకు రూ.35 వేలు డీడీ రూపంలో డీఎంహెచ్‌ఓ కార్యాలయానికి చెల్లించాలి. సదరు సొమ్మును హెచ్‌డీఎస్‌ ఖాతాలో నుంచి డ్రా చేసేందుకు కమిటీలు ఏర్పాటు చేయకపోవడంతో స్కానింగ్‌ మిషన్‌ల రిజిస్ట్రేషన్లు ముందుకు సాగడం లేదు. 
 
రాజకీయ జోక్యం వల్లే జాప్యం...
రాజకీయ జోక్యం వల్లే హెచ్‌డీఎస్‌ కమిటీలను ఏర్పాటు చేయలేకపోతున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వం మండలస్థాయి అధికారులను హెచ్‌డీఎస్‌ కమిటీలో సభ్యులుగా నియమించింది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పిదప మండల స్థాయి అధికారులను తొలగించి వారి స్థానంలో తెలుగు తమ్ముళ్లకు చోటు కల్పించి హెచ్‌డీఎస్‌ కమిటీలను రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చారు. దీంతో అధికార పార్టీ నేతల మధ్య సఖ్యత లోపించి విభేదాలు తారస్థాయికి చేరాయి. ఈ విషయంపై వివాదం నెలకొని పలువురు కోర్టులను ఆశ్రయించడంతో హెచ్‌డీఎస్‌ కమిటీల నియామకాల్లో తెలుగు తమ్ముళ్లను పక్కన బెట్టాలని సూచించారు. అయినప్పటికీ వారి జోక్యం తగ్గకపోవడంతో నేటికీ పలు ఆస్పత్రుల్లో హెచ్‌డీఎస్‌ కమిటీలు ఏర్పడలేదు. ఒక్కో ఆస్పత్రిలో ఏడాదికి రూ.1.75 లక్షల నుంచి రెండున్నర లక్షల వరకు వివిధ రకాల అభివృద్ధి పనుల నిమిత్తం హెచ్‌డీఎస్‌ ఖాతాలకు ప్రభుత్వం ఎన్‌హెచ్‌ఎం పథకం ద్వారా విడుదల చేస్తుంది. ఏడాదిగా నిధులు హెచ్‌డీఎస్‌ ఖాతాలోనే మూలుగుతున్నాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ కామినేని శ్రీనివాస్, పలు మార్లు జిల్లాలో ఆస్పత్రులను తనిఖీ చేస్తున్నప్పటికీ ఆస్పత్రుల అభివృద్ధి కమిటీలు ఏర్పాటు చేసి రాజకీయ గ్రహణాన్ని తొలగించకపోవడం విమర్శలకు తావిస్తోంది.
 
కమిటీలు లేకే రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తులు లేవు...
జిల్లాలో 11 ఆస్పత్రులకు ఆరు నెలల క్రితం స్కానింగ్‌ మిషన్లు వచ్చాయి. రిజిస్ట్రేషన్‌ కాకపోవడంతో స్కానింగ్‌లు జరగడం లేదు. హెచ్‌డీఎస్‌ కమిటీలు లేక రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేయలేకపోతున్నారు. జిల్లాలో 40 శాతం ఆస్పత్రులకు కమిటీలు ఏర్పాటయ్యాయి. మిగతా ఆస్పత్రులకు కమిటీలు ఏర్పడగానే అనుమతులు మంజూరు చేస్తాం. 
– డాక్టర్‌ పద్మజారాణి, డీఎంఅండ్‌హెచ్‌వో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement