
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ఇంజనీరింగ్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వాస్పత్రులను నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. వివిధ వర్గాల నుంచి ఈ వ్యవస్థ ఏర్పాటుచేయాలని వినతులు వస్తుండడంతో అధికారులు ఈవైపు అడుగులు వేస్తున్నారు. ఆస్పత్రులు నిర్మించడం.. ఆ తర్వాత వాటి నిర్వహణ గురించి పట్టించుకోకపోవడంతో చాలా ఆస్పత్రులు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. చిన్న బల్బు వెలగకపోయినా వాటిని తిరిగి పునరుద్ధరించే వ్యవస్థలేదు. చిన్నచిన్న డ్రైనేజీ పనులుగానీ, శ్లాబ్ లీకేజీలుగానీ, రంగులు వేయించడంగానీ ఇలా చాలా పనులు చేయించేందుకు ఓ వ్యవస్థలేదు. దీంతో భవనం నిర్మించిన నాలుగైదేళ్లకే నిర్మాణాలు దారుణ స్థితికి చేరుకుంటున్నాయి. దీనివల్ల రోగులు ఆస్పత్రులకు రావాలన్నా, సిబ్బంది పనిచేయాలన్నా వీటిని చూసి భయపడే పరిస్థితి ఏర్పడుతోంది.
జోన్ల వారీగా ఇంజనీర్ల కేటాయింపు
గతంలో వైద్యవిధాన పరిషత్ పరిధిలో ఉన్న కొద్దిపాటి ఇంజనీర్లు రాష్ట్ర మౌలిక వైద్యసదుపాయాల అభివృద్ధి సంస్థలోకి వెళ్లారు. అక్కడ కూడా కేవలం కొత్త నిర్మాణాలు చూస్తున్నారుగానీ, ఆస్పత్రుల నిర్వహణ చూడటంలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతమున్న ఇంజనీరింగ్ విభాగంతో సంబంధం లేకుండా జేఈల నుంచి ఎస్‌ఈల వరకూ జిల్లాలను జోన్లు వారీగా విభజించి ఇంజనీర్లను కేటాయిస్తే ఆస్పత్రులు కళకళలాడే అవకాశం ఉంటుందని కొంతమంది ఇంజనీరింగ్ నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇటీవల జిల్లాల్లో పర్యటించిన సుజాతారావు కమిటీ దృష్టికి కూడా ఈ విషయాలను తీసుకువచ్చారు. అంతేకాక.. మౌలిక వసతులుకు బడ్జెట్‌లో రూ.1,500 కోట్లు కేటాయించారు. ఈ నిధులను సక్రమంగా వినియోగించుకుని ఆస్పత్రుల నిర్వహణకు ప్రత్యేక ఇంజినీరింగ్ వ్యవస్థను ఏర్పాటుచేస్తే ప్రైవేట్ ఆస్పత్రులను తలదన్నే రీతిలో ప్రభుత్వాస్పత్రులను తీర్చిదిద్దవచ్చని ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్నారు.
టీడీపీ హయాంలో మొక్కుబడిగా నిర్వహణ
కాగా, రాష్ట్రంలో ఆరోగ్య ఉప కేంద్రాల నుంచి బోధనాసుపత్రుల వరకూ అన్ని ఆస్పత్రులు కలుపుకుంటే 2 కోట్లకు పైగా చదరపు అడుగుల్లో నిర్మాణాలున్నాయి. కానీ, వీటి నిర్వహణకు గత టీడీపీ సర్కారు ఏటా కేవలం రూ.5 కోట్లు మాత్రమే కేటాయిస్తూ వచ్చింది. అందులో 50 శాతం కూడా ఖర్చుచేయలేదు. చదరపు అడుగుకు కనీసం రూ.200 కేటాయిస్తే అద్భుతంగా నిర్వహించవచ్చని, ప్రస్తుత నిర్మాణాలకు రూ.540 కోట్లు ఖర్చుచేస్తే మూడేళ్ల పాటు వాటి నిర్వహణకు ఢోకా ఉండదని నిపుణులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment