engineering department
-
జాకీతో బిల్డింగ్‌ను లేపాలని ప్రయత్నించి...
కుత్బుల్లాపూర్: రోడ్డు కిందకు ఉన్న ఇంటిని హైడ్రాలిక్ జాకీ పెట్టి లేపాలని ప్లాన్ వేశాడో ఇంటి యజమాని. అది బెడిసికొట్టి.. భవనం అదుపుతప్పి పక్క భవనంపైకి ఒరిగింది. పక్క భవన యజమాని జీహెచ్ఎంసీ అధికారులను అప్రమత్తం చేయడంతో డీఆర్ఎఫ్, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగం అధికారులు రంగంలోకి దిగారు. వివరాల్లోకి వెళ్తే.. కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని శ్రీనివాస్ నగర్ సీఎస్కే స్కూల్ గల్లీలో నాగేశ్వరావు అనే వ్యక్తి 2001లో ఇంటిని నిర్మించాడు. తరువాత రోడ్డు వేయడంతో జీ ప్లస్2 భవనం.. రోడ్డు కంటే కిందకు అయ్యింది. అయితే పలువురు సూచించారని చెప్పి.. హైడ్రాలిక్ మెషీన్ పెట్టి బిల్డింగ్‌ను పైకి లేపాలని ప్లాన్ వేశాడు. శనివారం మధ్యాహ్నం హైడ్రాలిక్ మిషన్ తెప్పించి ఇంటిని పైకి లేపించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో భవనం 10 ఇంచుల వరకు జరిగి, పక్క భవనంపైకి ఒరిగింది. దీంతో ఇంట్లో ఉన్నవారు పరుగులు పెట్టారు. పక్క భవనం యజమాని వెంటనే జీహెచ్ఎంసీ అధికారులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న సర్కిల్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ సాంబయ్య, టౌన్ ప్లానింగ్ అధికారి ప్రభావతి, డీఆర్ఎఫ్, ఇంజనీరింగ్ విభాగం అధికారులు వచ్చారు. ఇంట్లో ఉన్న వారిని బయటకు పంపించి బిల్డింగ్ పరిస్థితిని పరిశీలించారు. వర్షాకాలం కావడంతో బిల్డింగ్‌ను తొలగించాలా? లేదా? అన్న విషయంపై అధికారులు స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. 2001లో నిర్మించినట్టు భవన యజమాని చెబుతున్నా.. 1990లోనే నిర్మించారని ఇరుగుపొరుగు అంటున్నారు. పాత భవనం, సరైన కండిషన్లో లేనందున భవనాన్ని కూల్చడమే మంచిదని అసిస్టెంట్ సిటీ ప్లానర్ సాంబయ్య మీడియాకు తెలిపారు. -
కాళేశ్వరం బ్యారేజీలకు మరమ్మతులేవి?
కాళేశ్వరం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని లింకు–1 బ్యారేజీల వద్ద గత ఏడాది వచ్చిన భారీ వరదలతో కాంక్రీటు దెబ్బతింది. అయితే మళ్లీ వానాకాలం వచ్చినప్పటికీ దెబ్బతిన్న చోట్ల ఇప్పటికీ మరమ్మతులు చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్‌పల్లిలోని మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజీ, అన్నారంలోని (సరస్వతి) బ్యారేజీల వద్ద వరద తాకిడికి గేట్ల ముందు భాగంలోని కాంక్రీటు దిమ్మెలు కొట్టుకుపోయాయి. గత సీజన్లో ఇది జరిగితే ఇప్పటికీ ఇరిగేషన్ శాఖ అధికారులు మరమ్మతుల విషయంలో ఆలోచన చేయడం లేదని, ఖరీఫ్ సీజన్ ఆరంభం అవుతున్నా పనుల్లో జాప్యం చేస్తున్నారని నీటిపారుదల రంగ నిపుణులు ఆక్షేపిస్తున్నారు. గతేడాది ఉధృతంగా వరద గత ఏడాది కురిసిన భారీవర్షాలకు బ్యారేజీలు కొంతమేర దెబ్బతిన్నాయి. ఎగువ గోదావరి నుంచి సరస్వతీ బ్యారేజీ వద్ద 17.50 లక్షల క్యూసెక్కుల వరద జూలై 14–15 తేదీల్లో ఉధృతంగా ప్రవహించింది. దీంతో బ్యారేజీలోని మొత్తం 66 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. వరద ఉధృతికి గేట్ల కింది భాగాన ఉన్న కాంక్రీట్ దిమ్మెలు లేచిపోయాయి. అలాగే గోదావరి వరదకు, ప్రాణహిత వరద తోడై మేడిగడ్డలోని లక్ష్మీబ్యారేజీ వద్ద 29 లక్షల క్యూసెక్కులకుపైగా వరద రావడంతో దిమ్మెలు చెల్లాచెదురుగా కొట్టుకుపోయాయి. కాంక్రీటు దిమ్మెలు ఇలా.. బ్యారేజీల్లో గేట్లు ఎత్తినప్పుడు వరద తాకిడికి నేల కోతకు గురికాకుండా ముందు భాగంలో ఇంజనీరింగ్ శాఖ అధికారులు అత్యాధునిక టెక్నాలజీతో కాంక్రీటు దిమ్మెలను అమర్చారు. 3 అడుగుల వెడల్పు, పొడవుతో దిమ్మెలను బ్యారేజీ పొడవునా గేట్ల కింద ముందు భాగంలో కాంక్రీటు చేశారు. వరద తాకి డి కి నేల కోతకు గురికాకుండా ఈ దిమ్మెలు అడ్డుకుంటాయి. కానీ గత ఏడాది వచ్చిన భారీ వరద తాకిడికి ఈ దిమ్మెలు విరిగి ఎక్కడికక్కడ చెల్లాచె దురుగా పడి కొట్టుకుపోయాయి. అప్పటి నుంచీ అక్కడ మరమ్మతులు చేయలేదని చెబుతున్నారు. డిజైన్స్ రాలేదని.. మేడిగడ్డ (లక్ష్మి), అన్నారం (సరస్వతి) బ్యారేజీల వద్ద అమర్చిన దిమ్మెలు కొట్టుకుపోయి ఏడాది కావస్తున్నా.. డిజైన్స్ తయారు చేయలేదని ఇంజనీ రింగ్ శాఖ పేర్కొంటోంది. ఈ నేపథ్యంలో మరమ్మ తులు చేయకుండానే మళ్లీ వర్షాకాలం ఆరంభమైంది. వర్షాలు ఏకధాటిగా కురిస్తే మరోసారి భారీ వరదలు వచ్చే అవకాశం ఉంది. బ్యారేజీల గేట్లు ఎత్తితే మరింత కోతకు గురయ్యే ప్రమాదం ఉంది. గత ఏడాది కురిసిన వర్షాలకు ఇప్పటికే గేట్ల ముందుభాగంలో కోతకు గురై, భారీగా ఇసుక మేటలు వేశాయి. దీంతో గేట్లకు కూడా ప్రమాదం పొంచి ఉందని నిపుణులు అంటున్నారు. -
తెలంగాణ ఎంసెట్‌లో ఏపీ స్వీప్
సాక్షి, నెట్వర్క్: తెలంగాణలో బీటెక్, బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టీకల్చర్, బీవీఎస్సీ, బీఎస్సీ ఫారెస్ట్రీ, బీఫార్మసీ, బయోటెక్నాలజీ, ఫార్మ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఆ రాష్ట్ర ఎంసెట్‌లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు దుమ్ములేపారు. అటు ఇంజనీరింగ్ విభాగంలోనూ, ఇటు మెడికల్ అండ్ అగ్రికల్చర్ విభాగంలోనూ టాప్ ర్యాంకులు కొల్లగొట్టి సత్తా చాటారు. ఇంజనీరింగ్ విభాగంలో సనపల అనిరుధ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగంలో బూరుగుపల్లి సత్యరాజ్ జశ్వంత్ తెలంగాణ స్థాయిలో ఫస్ట్ ర్యాంకులతో భళా అనిపించారు. ఇంజనీరింగ్ విభాగంలో 2, 3, 5, 6, 8, 9, 10 ర్యాంకులు మన రాష్ట్ర విద్యార్థులకే దక్కాయి. అదేవిధంగా అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగంలోనూ 2, 4, 5, 7, 8 ర్యాంకులు ఎగరేసుకుపోయారు. తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం హైదరాబాద్‌లో తెలంగాణ ఎంసెట్ ఫలితాలను విడుదల చేశారు. కాగా ఇంజనీరింగ్ ర్యాంకర్లందరూ ఐఐటీల్లో చేరతామని, మెడికల్ విభాగం ర్యాంకర్లంతా వైద్య వృత్తిలో స్థిరపడతామని వెల్లడించారు. విజేతల అభిప్రాయాలు వైద్య రంగంలో ఉన్నతవిద్యనభ్యసిస్తా.. మాది చీరాల. నాన్న నాసిక సుధాకర్‌బాబు, అమ్మ శ్రీదేవి మగ్గం నేస్తారు. విజయవాడలోని ప్రైవేటు కాలేజీలో ఇంటర్మిడియెట్ చదివాను. వైద్య రంగంలో ఉన్నత విద్యనభ్యసించడమే నా లక్ష్యం. – నాసిక వెంకటతేజ, సెకండ్ ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్ (అగ్రి అండ్ మెడికల్ విభాగం) కార్డియాలజిస్ట్ లేదా న్యూరాలజిస్టునవుతా.. మాది తెనాలి. నాకు ఇంటర్ బైపీసీలో 983 మార్కులు వచ్చాయి. వైద్య రంగంలో స్థిరపడాలనేది నా ఆకాంక్ష. ఇప్పటికే నీట్ రాశాను. ఎంబీబీఎస్ చేసి ఆ తర్వాత కార్డియాలజిస్ట్, న్యూరాలజిస్ట్ లేదా గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌గా స్థిరపడాలనేదే నా కోరిక. – దుర్గెంపూడి కార్తికేయరెడ్డి, నాలుగో ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్ (అగ్రి అండ్ మెడికల్ విభాగం) వైద్య రంగంలో స్థిరపడతా.. మాది శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట. అమ్మానాన్న ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులే. నాకు నీట్‌లోనూ మంచి ర్యాంకు వస్తుందనే నమ్మకం ఉంది. వైద్య రంగంలో స్థిరపడాలనేది నా కోరిక. – బోర వరుణ్ చక్రవర్తి, ఐదో ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్ (అగ్రి అండ్ మెడికల్ విభాగం) మంచి వైద్య కళాశాలలో మెడిసిన్ చేస్తా.. మాది నెల్లూరు. అమ్మానాన్న హారతి, శంకర్ వైద్యులుగా పనిచేస్తున్నారు. మంచి మెడికల్ కళాశాలలో మెడిసిన్ చదవడమే నా లక్ష్యం. – హర్షల్సాయి, ఏడో ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్ (అగ్రి అండ్ మెడికల్ విభాగం) కష్టపడి చదివా.. మాది గుంటూరులోని ఏటీ అగ్రహారం. అమ్మానాన్న ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులే. కష్టపడి చదవడంతో తెలంగాణ ఎంసెట్‌లో ఎనిమిదో ర్యాంక్ సాధించాను. – సాయి చిది్వలాస్రెడ్డి, 8వ ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్ (అగ్రి అండ్ మెడికల్ విభాగం) కంప్యూటర్స్ సైన్స్ చదువుతా.. మాది గుంటూరు. నాన్న శ్రీనివాసరెడ్డి రైతు. ఇంటర్ ఎంపీసీలో 971 మార్కులు వచ్చాయి. జేఈఈ అడ్వాన్స్‌లో ర్యాంక్ సాధించి ఐఐటీ బాంబేలో సీటు సాధించడమే లక్ష్యం. – యక్కంటి ఫణి వెంకట మణిందర్‌రెడ్డి, సెకండ్ ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్ (ఇంజనీరింగ్ విభాగం) జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు సాధించడమే లక్ష్యం మాది ఎన్టీఆర్ జిల్లా నందిగామ. ఇంటర్మిడియెట్ ఎంపీసీలో 983 మార్కులు సాధించాను. ఇటీవల జేఈఈ మెయిన్‌లో ఓపెన్ కేటగిరీలో 263వ ర్యాంక్ వచ్చింది. వచ్చే నెలలో జరగనున్న జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు సిద్ధమవుతున్నా. ఇందులో మంచి ర్యాంక్ సాధించడమే నా లక్ష్యం. – చల్లా ఉమేష్ వరుణ్, థర్డ్ ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్ (ఇంజనీరింగ్ విభాగం) సివిల్స్ సాధించి ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం మాది అనంతపురం జిల్లా తాడిపత్రి. ఇటీవల జేఈఈ మెయిన్‌లో ఆలిండియాలో 97వ ర్యాంకు సాధించాను. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లోనూ ర్యాంకు సాధించి ఐఐటీ బాంబేలో చేరతా. తర్వాత సివిల్స్ రాసి ప్రజలకు సేవ చేయాలన్నదే నా లక్ష్యం. – పొన్నతోట ప్రమోద్ కుమార్‌రెడ్డి, ఐదో ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్ (ఇంజనీరింగ్ విభాగం) ఐఐటీ బాంబేలో చేరతా.. మాది విశాఖపట్నం జిల్లా గాజువాక. నాన్న బిజినెస్‌లో ఉండగా అమ్మ ఫార్మసిస్టుగా పనిచేస్తున్నారు. ఇంటర్ ఎంపీసీలో 987 మార్కులు వచ్చాయి. జేఈఈ మెయిన్‌లో ఆలిండియాలో 110వ ర్యాంకు వచ్చింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లోనూ మంచి ర్యాంకు సాధించి ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్‌లో చేరతా. – మరడాన ధీరజ్ కుమార్, ఆరో ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్ (ఇంజనీరింగ్ విభాగం) ఐఐటీ బాంబేలో ఇంజనీరింగ్ చదువుతా.. మాది శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి. నాన్న గణేష్ వ్యాపారి, అమ్మ జ్యోతి గృహిణి. జేఈఈ మెయిన్‌లో 729వ ర్యాంక్ సాధించాను. వచ్చే నెలలో నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు సిద్ధమవుతున్నా. ఐఐటీ బాంబేలో ఇంజనీరింగ్‌లో చేరాలనేదే నా లక్ష్యం. – బోయిన సంజన, 8వ ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్ (ఇంజనీరింగ్ విభాగం) కంప్యూటర్ ఇంజనీర్‌నవుతా.. మాది నంద్యాల. ఇంటర్ ఎంపీసీలో 956 మార్కులు వచ్చాయి. జేఈఈ అడ్వాన్స్‌లో ర్యాంకు సాధించి మంచి ఐఐటీలో కంప్యూటర్ సైన్స్‌లో చేరతా. కంప్యూటర్ ఇంజనీర్‌ను కావడమే లక్ష్యం. – ప్రిన్స్ బ్రన్హంరెడ్డి, తొమ్మిదో ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్ (ఇంజనీరింగ్ విభాగం) అడ్వాన్స్‌లోనూ ర్యాంక్ సాధిస్తా.. మాది విజయనగరం జిల్లా గుర్ల. నాన్న అప్పలనాయుడు రైల్వే కానిస్టేబుల్, అమ్మ ప్రభుత్వ టీచర్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల జేఈఈ మెయిన్‌లో 99 శాతం పర్సంటైల్ సాధించాను. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంక్ సాధించి ఐఐటీ బాంబేలో చేరతా. – మీసాల ప్రణతి శ్రీజ, పదో ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్ (ఇంజనీరింగ్ విభాగం) -
కళ్లకు కట్టేలా ‘ఇంజనీరింగ్ పర్యాటకం’
సాక్షి, అమరావతి: పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. వినోద, విహార యాత్రలకే పరిమితం కాకుండా ఇంజనీరింగ్ అద్భుత నిర్మాణ పాటవాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తోంది. తాజాగా విదేశాల్లో ‘ఇంజనీరింగ్ పర్యాటకం’ కొత్త ధోరణిగా అవతరిస్తోంది. వంతెనలు, డ్యామ్‌లు, పోర్టులు, భారీ కట్టడాలు చూసిన వెంటనే సందర్శకులను ఆకర్షిస్తాయి. అటువంటి వాటిల్లో చారిత్రక, వారసత్వ నిర్మాణాల విలువలను భావితరాలకు, యువ ఇంజనీర్లకు స్ఫూర్తినిచ్చేలా పర్యాటకం తోడ్పాటునందిస్తోంది. విదేశాల్లో ఎక్కువగా.. వంతెనలు, నీటి ప్రాజెక్టులు ఆయా ప్రాంతాలకు చిహ్నాలు. వాటి నిర్మాణం వెనుక కథ ఆసక్తిగా ఉంటుంది. ఎంతో మంది రేయింబవళ్లు ఏళ్లపాటు కష్టపడి చేపట్టిన నిర్మాణాల సంక్లిష్టతను, సామర్థ్యాన్ని అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా, యూకే, జర్మనీ, ఇంగ్లండ్‌లు భావితరాలకు అందిస్తున్నాయి. చారిత్రక ఇంజినీరింగ్ ప్రదేశాలను పర్యాటక స్థలాలుగా తీర్చిదిద్దడంలో విజయం సాధించాయి. భారీ యంత్రాలు లేని సమయంలో వంతెనలు, డ్యామ్‌ల రూపకల్పనకు సంబంధించిన ఆనాటి సాంకేతికత విలువలను మ్యూజియంల రూపంలో భద్రపరుస్తున్నాయి. వీటిని ప్రజలు సందర్శించేలా మౌలిక వసతులు కల్పిస్తూ పర్యాటక రంగం విస్తరణకు దోహదపడుతున్నాయి. చైనాలో ప్రతి వంతెనకు ఒక మ్యూజియం ఉంటుంది. ఆ వంతెన ముఖ్య విషయాలను అందులో ప్రదర్శిస్తారు. భారత్‌లో అయితే ఏపీలో ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ విశేషాలను, నమూనాలను ప్రదర్శించేందుకు, యూపీలో పాత నైనీ బ్రిడ్జికు ప్రత్యేక మ్యూజియంలు ఉన్నాయి. రాష్ట్రంలో ఎన్నో ప్రాంతాలు.. సమాజ సంస్కృతి, అభివృద్ధి శ్రేయస్సుకు మూల స్తంభాలుగా డ్యామ్‌లు, వంతెనలు నిలుస్తున్నాయి. రోడ్డు వంతెన అయినా..రైలు వంతెన అయినా, సైన్యం నిర్మించినది అయినా, సస్పెన్షన్ బ్రిడ్జిలు, సపోర్డెట్ బ్రిడ్జ్‌లు, కంటిన్యూస్ స్పాన్ బ్రిడ్జిలు దేశంలో, రాష్ట్రంలో అనేకం పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఏపీ పర్యాటకంలో ఇంజనీరింగ్ టూరిజం కేవలం 2.28 శాతం మాత్రమే. అయినప్పటికీ వాటికున్న ఆదరణ చాలా ఎక్కువగా ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర పర్యాటక శాఖ ప్రముఖ ఇంజనీరింగ్ నిర్మాణ ప్రాంతాలైన డ్యామ్‌లు, రిజర్వాయర్లు, సైన్స్ సెంటర్లు, హార్బర్లు, పోర్టులు, వంతెనలను విదేశీ తరహా పర్యాటకంగా అభివృద్ధికి కసరత్తు చేస్తోంది. ధవళేశ్వరం, ప్రకాశం బ్యారేజీ, పోలవరం, శ్రీశైలం, నాగార్జున సాగర్ వంటి ప్రాధాన నిర్మాణాలతోపాటు వివిధ రిజర్వాయర్లు, వంతెనల టూరిజాన్ని ప్రోత్సహించేందుకు ఆయా ప్రాంతాలను గుర్తించనుంది. రాజమహేంద్రవరంలోని రోడ్డు కమ్ రైలు బ్రిడ్జి గోదావరి అందాల్లో ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తోంది. ఇప్పటికే విశాఖలో సబ్‌మెరైన్, జెట్ మ్యూజియంలు ఆకట్టుకుంటున్నాయి. ప్రణాళిక ప్రకారం అభివృద్ధి రాష్ట్రంలో అపార పర్యాటక వనరులు ఉన్నాయి. వాటిని ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నాం. ప్రముఖ ఇంజనీరింగ్ నిర్మాణ ప్రాంతాలను కూడా పర్యాటక స్థలాలుగా గుర్తించేందుకు కసరత్తు జరుగుతోంది. దేశ పర్యాటక రంగంలో ఏపీని అగ్రగామిగా నిలబెట్టేందుకు కృషి చేస్తున్నాం. – ఆర్కే రోజా, పర్యాటక శాఖ మంత్రి -
ఎంసెట్ ‘ఇంజనీరింగ్’కు 84.38% మంది హాజరు
సాక్షి, అమరావతి: ఏపీ ఎంసెట్–2020కి సంబంధించి ఇంజనీరింగ్ విభాగంలో నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్షలు బుధవారంతో ముగిశాయి. ఈ నెల 17 నుంచి ప్రారంభమైన ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 1,85,946 మంది దరఖాస్తు చేసుకోగా 1,56,899 మంది(84.38 శాతం) మంది హాజరయ్యారని ఉన్నత విద్యామండలి ప్రత్యేకాధికారి(ఏపీ సెట్స్) డాక్టర్ ఎం.సుధీర్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌తో పాటు ఏపీలోని 47 పట్టణాల్లోని 118 పరీక్ష కేంద్రాల్లో రోజుకు రెండు చొప్పున మొత్తం 14 సెషన్లలో కంప్యూటరాధారితంగా ఈ పరీక్ష నిర్వహించారు. కోవిడ్ నేపథ్యంలో ఈసారి పరీక్ష కేంద్రాల పెంపుతో పాటు సెషన్ల సంఖ్యనూ పెంచారు. ఇంజనీరింగ్ విభాగం పరీక్షలు ముగియడంతో.. అగ్రి, ఫార్మా, మెడికల్ విభాగం పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ విభాగంలో 87,637 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈనెల 25తో ఈ పరీక్షలు పూర్తవుతాయి. అగ్రి, మెడికల్ విభాగం తొలిరోజు పరీక్షకు 86.89 శాతం మంది హాజరయ్యారు. కాగా, ఎంసెట్–2020 ప్రాథమిక ‘కీ’ని ఈనెల 26న విడుదల చేయనున్నారు. ‘కీ’పై అభ్యంతరాలను ఈనెల 28 వరకు స్వీకరిస్తారు. -
నీటి పరీక్ష.. పనుల నాణ్యతపై సమీక్ష
సాక్షి, అమరావతి: గ్రామ సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగుల్లో ఎవరు ఏ పనులు చేయాలనేది నిర్ధారిస్తూ విభాగాల వారీగా ప్రభుత్వం ఇప్పటికే జాబ్ చార్ట్‌లను విడుదల చేసింది. సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు చేయాల్సిన పనులకు సంబంధించి జాబ్ చార్ట్‌ను కూడా రూపొందించింది. దీని ప్రకారం ఇంజనీరింగ్ అసిస్టెంట్లు కుళాయిల ద్వారా తాగునీటిని విడుదల చేసే సమయంలో ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం విధిగా నీటి పరీక్షలు నిర్వహించాలి. సచివాలయ పరిధిలో తాగునీటి సరఫరాలో ఎటువంటి సమస్యలు తలెత్తినా సదరు ఉద్యోగి బాధ్యత వహించాల్సి ఉంటుంది. గ్రామ సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్ జాబ్ చార్ట్ పేర్కొన్న పనుల వివరాలివీ... - రోజూ ఉదయాన్నే క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలి. తన సచివాలయ పరిధిలోని ఇంజనీరింగ్ కార్యకలాపాలు, పనుల నాణ్యతను తనిఖీ చేయాలి. - పారిశుధ్యం, తాగునీటి సరఫరాకు సంబంధించి సమస్యలేమైనా ఉంటే గుర్తించి సంబంధిత ఇంజనీరింగ్ శాఖకు తెలియజేయాలి. - తాగునీటి పైపు లైన్లలో లీకేజీలను గుర్తించి వాటి నిరోధానికి చర్యలు తీసుకోవాలి. - పంప్ హౌస్‌లు, సర్వీసు రిజర్వాయర్లను తనిఖీ చేయాలి. పైప్‌లైన్ చివరి పాయింట్ వరకు నీటి సరఫరా జరుగుతోందా లేదా పరిశీలించాలి. - గృహ నిర్మాణాలతో పాటు సివిల్ పనులన్నిటినీ అమలు చేయించాలి. సివిల్ పనులు, గృహ నిర్మాణాల్లో ఇండియన్ స్టాండర్డ్ కోడ్ ప్రకారం నాణ్యతా ప్రమాణాలను పాటిస్తున్నారా లేదా అనేది పరిశీలించి మూవ్మెంట్ రిజిస్టర్ నిర్వహించాలి. - రహదారుల నిర్వహణ పనులను గుర్తించాలి. ఎక్కడైనా గుంతలు పడితే పూడ్చేందుకు అవసరమైన అంచనా ప్రతిపాదనలను రూపొందించాలి. - స్పందనలో వచ్చిన సమస్యలపై నోట్‌ను రూపొందించాలి. ఆయా గ్రామాల సమస్యలను కూడా నోట్లో పొందుపరిచి పరిష్కారం నిమిత్తం పంచాయతీ కార్యదర్శికి అందజేయాలి. - పారిశుధ్య నిర్వహణ, కార్యకలాపాలు, వ్యర్థాల నిర్వహణపై పంచాయతీ కార్యదర్శితో సమన్వయం చేసుకోవాలి. - భవన నిర్మాణాల అనుమతి దరఖాస్తుల ఆధారంగా సాంకేతిక తనిఖీలను నిర్వహించాలి. - డ్రెయినేజీ, వాటర్ ట్యాంక్‌లో నూటికి నూరు శాతం పూడిక తీయించాలి. - గృహాలతో పాటు మౌలిక సదుపాయాల పనులకు సంబంధించిన సవివరమైన ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లను అంచనాలతో రూపొందించాలి. - క్షేత్రస్థాయి పర్యటనల సందర్భంగా పనుల అమలు తీరుతెన్నులను ఫీల్డ్ రిజిస్టర్లో నమోదు చేయాలి. పనుల పురోగతి ఫొటోలు కూడా తీయాలి. - క్షేత్రస్థాయి కార్యకలాపాలను డాక్యుమెంటేషన్ చేసి ప్రజాప్రతినిధులకు ప్రతిరోజూ అందించాలి. - ఇంజరింగ్ విభాగాలకు సంబంధించిన ఆస్తులన్నింటినీ పరిరక్షించాలి. - పనులకు సంబంధించిన టెండర్ అగ్రిమెంట్ల విషయమై పంచాయతీ కార్యదర్శితో సంప్రదింపులు జరపాలి. బిల్లుల రూపకల్పన, క్వాలిటీ కంట్రోల్ నివేదికలను రూపొందించాలి. - స్వచ్ఛ ఆంధ్రాతో పాటు ఇతర కార్యకలాపాలకు హాజరు కావాలి. వర్షాకాలంలో ట్యాంకులు, రహదారులకు గండ్లు పడితే యుద్ధప్రాతిపదికన పనులు చేయించి మంచినీటి సరఫరాకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి - వేసవిలో తాగునీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరాను పర్యవేక్షించాలి. - రహదారులు, భవనాలు, స్కూల్స్ నిర్వహణ పనులను పర్యవేక్షించాలి. ప్రభుత్వ భవనాలు, స్కూలు భవనాలను తనిఖీ చేస్తూ తరచూ ఫిట్నెస్ సర్టిఫికెట్లను సమర్పించాలి. -
3,285 కిలో మీటర్లు
సాక్షి, అమరావతి: ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై)లో కేంద్ర– రాష్ట్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా 3,285 కిలో మీటర్ల పొడవున కొత్తగా గ్రామీణ లింకు రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. అయ్యే వ్యయంలో 60 శాతం కేంద్ర ప్రభుత్వం, మిగిలిన 40 శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తాయి. పీఎంజీఎస్‌వై మూడో దశ అమలులో భాగంగా కేంద్రం దేశవ్యాప్తంగా లక్షా 25 వేల కిలోమీటర్ల గ్రామీణ లింకు రోడ్ల నిర్మాణానికి ముందుకొచ్చింది. ఇందులో భాగంగా రాష్ట్రానికి 3,285 కిలోమీటర్ల పొడవు రోడ్లను మంజూరు చేసింది. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ జిల్లాల వారీగా పనులు గుర్తించే ప్రక్రియ మొదలైందని ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ సుబ్బారెడ్డి చెప్పారు. పనుల గుర్తింపు ప్రక్రియతో పాటు ఆయా పనుల నిర్మాణానికి అయ్యే అంచనాలను కూడా సిద్దం చేయాలని జిల్లా ఎస్ఈలను ఆదేశించినట్టు తెలిపారు. 13 జిల్లాల్లో దాదాపు 650 కొత్త రోడ్లు ఈ కార్యక్రమంలో చేపట్టే అవకాశం ఉందన్నారు. మొత్తం రూ.1,971 కోట్లు ఖర్చు అవుతుందని ప్రాథమిక అంచనా వేస్తున్నామని.. ఇందులో రూ.1,314 కోట్లు కేంద్రం మంజూరు చేసే అవకాశం ఉందన్నారు. అక్టోబరు 15 కల్లా పనుల అంచనాలతో కూడిన ప్రతిపాదనలను పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ కేంద్రానికి పంపనుంది. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో మరో 535 కిలోమీటర్ల పనులు రాష్ట్రంలో తీవ్రవాద ప్రభావిత జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో మరో 535 కిలోమీటర్ల రోడ్డు పనులు కూడా మంజూరయ్యాయి. ఈ ప్రాంతాల్లో రోడ్డు కనెక్టివిటీ ప్లాన్ కార్యక్రమంలో భాగంగా 4 జిల్లాల్లో 62 రోడ్డు పనులు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ కొత్తగా చేపడుతుంది. ఇందులో విశాఖ జిల్లాకే 44 పనులు మంజూరయ్యాయి. రూ.320 కోట్లు ఖర్చు అవుతుందని పంచాయతీరాజ్ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేయగా, ఇందులో రూ.192 కోట్లు కేంద్రం రాష్ట్రానికి నిధులిస్తోంది. -
ప్రభుత్వ ఆస్పత్రుల నిర్వహణ ఇక పక్కాగా..
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ఇంజనీరింగ్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వాస్పత్రులను నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. వివిధ వర్గాల నుంచి ఈ వ్యవస్థ ఏర్పాటుచేయాలని వినతులు వస్తుండడంతో అధికారులు ఈవైపు అడుగులు వేస్తున్నారు. ఆస్పత్రులు నిర్మించడం.. ఆ తర్వాత వాటి నిర్వహణ గురించి పట్టించుకోకపోవడంతో చాలా ఆస్పత్రులు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. చిన్న బల్బు వెలగకపోయినా వాటిని తిరిగి పునరుద్ధరించే వ్యవస్థలేదు. చిన్నచిన్న డ్రైనేజీ పనులుగానీ, శ్లాబ్ లీకేజీలుగానీ, రంగులు వేయించడంగానీ ఇలా చాలా పనులు చేయించేందుకు ఓ వ్యవస్థలేదు. దీంతో భవనం నిర్మించిన నాలుగైదేళ్లకే నిర్మాణాలు దారుణ స్థితికి చేరుకుంటున్నాయి. దీనివల్ల రోగులు ఆస్పత్రులకు రావాలన్నా, సిబ్బంది పనిచేయాలన్నా వీటిని చూసి భయపడే పరిస్థితి ఏర్పడుతోంది. జోన్ల వారీగా ఇంజనీర్ల కేటాయింపు గతంలో వైద్యవిధాన పరిషత్ పరిధిలో ఉన్న కొద్దిపాటి ఇంజనీర్లు రాష్ట్ర మౌలిక వైద్యసదుపాయాల అభివృద్ధి సంస్థలోకి వెళ్లారు. అక్కడ కూడా కేవలం కొత్త నిర్మాణాలు చూస్తున్నారుగానీ, ఆస్పత్రుల నిర్వహణ చూడటంలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతమున్న ఇంజనీరింగ్ విభాగంతో సంబంధం లేకుండా జేఈల నుంచి ఎస్ఈల వరకూ జిల్లాలను జోన్లు వారీగా విభజించి ఇంజనీర్లను కేటాయిస్తే ఆస్పత్రులు కళకళలాడే అవకాశం ఉంటుందని కొంతమంది ఇంజనీరింగ్ నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇటీవల జిల్లాల్లో పర్యటించిన సుజాతారావు కమిటీ దృష్టికి కూడా ఈ విషయాలను తీసుకువచ్చారు. అంతేకాక.. మౌలిక వసతులుకు బడ్జెట్లో రూ.1,500 కోట్లు కేటాయించారు. ఈ నిధులను సక్రమంగా వినియోగించుకుని ఆస్పత్రుల నిర్వహణకు ప్రత్యేక ఇంజినీరింగ్ వ్యవస్థను ఏర్పాటుచేస్తే ప్రైవేట్ ఆస్పత్రులను తలదన్నే రీతిలో ప్రభుత్వాస్పత్రులను తీర్చిదిద్దవచ్చని ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్నారు. టీడీపీ హయాంలో మొక్కుబడిగా నిర్వహణ కాగా, రాష్ట్రంలో ఆరోగ్య ఉప కేంద్రాల నుంచి బోధనాసుపత్రుల వరకూ అన్ని ఆస్పత్రులు కలుపుకుంటే 2 కోట్లకు పైగా చదరపు అడుగుల్లో నిర్మాణాలున్నాయి. కానీ, వీటి నిర్వహణకు గత టీడీపీ సర్కారు ఏటా కేవలం రూ.5 కోట్లు మాత్రమే కేటాయిస్తూ వచ్చింది. అందులో 50 శాతం కూడా ఖర్చుచేయలేదు. చదరపు అడుగుకు కనీసం రూ.200 కేటాయిస్తే అద్భుతంగా నిర్వహించవచ్చని, ప్రస్తుత నిర్మాణాలకు రూ.540 కోట్లు ఖర్చుచేస్తే మూడేళ్ల పాటు వాటి నిర్వహణకు ఢోకా ఉండదని నిపుణులు చెబుతున్నారు. -
ఏపీ ఎంసెట్ రెండో దశ ఫలితాలు విడుదల
కాకినాడ: ఏపీ ఎంసెట్–17 రెండో దశ ఫలితాలను శనివారం సాయంత్రం విడుదల చేసినట్లు ఏపీ ఎంసెట్ కన్వీనర్ సీహెచ్ సాయిబాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఇంజనీరింగ్ విభాగంలో రీ వాల్యుయేషన్‌లో మార్కులు పొందిన అభ్యర్థులు 1,627, సీబీఎస్ఈ 1,413, దూరవిద్యా కేంద్ర విద్యార్థులు 86, ఇతర బోర్డులు 456 మందితోపాటు అగ్రికల్చర్ విభాగంలో 1,021, ఇతరులుకు కలిపి మొత్తం మీద 4,861 అభ్యర్థులకు ర్యాంకులు విడుదల చేశామన్నారు. ఇంకా ర్యాంకులు ఎవరికైనా రాకపోయినా, ర్యాంకులపై సందేహాలున్నా 0884–2340535 నంబర్‌కు సంప్రదించవచ్చన్నారు. -
నదిలేని మెతుకుసీమకు నీరొద్దా?
- రైతులు కరువుతో అల్లాడాలా? - విపక్షాలపై మంత్రి హరీశ్ ఫైర్ సిద్దిపేట : ‘‘నది లేని మెదక్ జిల్లాకు సాగునీరు వద్దా? మెతుకుసీమ కరువుతో అల్లాడాల్సిందేనా? రైతుల ఆకలి చావులు, ఆత్మహత్యలు, ముంబై వలసలు కొనసాగాల్సిందేనా?...’’ అంటూ భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ప్రతిపక్షాలపై మండిపడ్డారు. ప్రాజెక్టులు కడితే తమ రాజకీయ భవిష్యత్తు అంధకారంగా మారుతుందన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్, టీడీపీలు ఓర్వలేక కుట్రలు పన్నుతున్నాయని, ఆ పార్టీలకు పుట్టగతులుండవని దుయ్యబట్టారు. నది లేని చోట రిజర్వాయర్లు కట్టి నిష్ర్పయోజనమని ఓ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్, ఆయనకు వత్తాసుగా ప్రతిపక్ష నాయకుడు మాట్లాడడం అర్థరహితమన్నారు. ఆదివారం సాయంత్రం సిద్దిపేటలో.. కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణకు సంబంధించి 341 మంది రైతులకు రూ.37.74 కోట్ల పరిహారాన్ని మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు చరిత్రలో నిలిచిపోతుందన్నారు. రైతుల ఆత్మహత్యలు, ఆకలి చావులు, ముంబై వలసలతో మెతుకు సీమ అన్నదాత పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. ‘‘నదిలేని చోట ప్రాజెక్టులు కట్టడం వ్యర్థమని వ్యాఖ్యలు చేస్తున్న నాయకులు వెలిగొండ లో 40 టీఎంసీలు, ఎస్సారెస్పీపై 10 టీఎంసీల గోరాకల్, సుజల స్రవంతి ప్రాజెక్ట్‌కు అనుసంధానంగా 7 టీఎంసీల అవుకు, అల్గానూర్ రిజర్వాయర్లు ఎలా కట్టారు? వీటికి ఎక్కడ నదులున్నాయి? గత పాలకులు ఎలాంటి అనుమతులు లేకుండానే అక్రమంగా రిజర్వాయర్లు కట్టిన విషయాన్ని విమర్శకులు గుర్తుంచుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం హక్కుపూరిత ధోరణితో ప్రాజెక్ట్‌లు నిర్మిస్తోంది. మల్లన్నసాగర్ ద్వారా రైతుకు తాగు, సాగునీరు అందిస్తాం. కాలువల ద్వారా చివరి ఆయకట్టుకు నీరందించడం సాధ్యం కాదు. అందుకే ఇంజనీరింగ్ శాఖ పరిశీలన మేరకు రిజర్వాయర్లను కడుతున్నాం’’ అని వివరించారు. వారిది మూడో పంట తాపత్రయం పులిచింతల కోసం 13 గ్రామాలను ముంచి, పోలవరం కోసం 6 మండలాలను లాక్కున్న సీమాంధ్రులు మూడో పంట కోసం తాపత్రయపడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో రెండో పంట కోసం ప్రాజెక్టుల నిర్మాణానికి సీఎం కేసీఆర్ పనిచేస్తుంటే ప్రతిపక్షాలు అడ్డుకోవడం అర్థరహితమన్నారు. వచ్చే ఏడాది దసరా నాటికి సిద్దిపేట నియోజకవర్గానికి గోదావరి జలాలను తరలించి తీరుతామని స్పష్టం చేశారు. గతంలో భూసేకరణలో భూమి కోల్పోయిన నిర్వాసితులు పరిహారం కోసం నేటికీ కోర్టు చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి పరిస్థితి పునరావ ృతం కాకుండా తమ ప్రభుత్వం జీవో 123 ద్వారా మెరుగైన, సత్వర పరిహారం అందించేందుకు చర్యలు చేపడుతోందన్నారు. ఈ జీవోను విమర్శిస్తున్న నాయకులు సింగూరు భూనిర్వాసితులు 30 ఏళ్ల నుంచి పడుతున్న వ్యథపై ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. మిడ్‌మానేరు భూసేకరణ బాధితులు 12 సంవత్సరాలుగా పరిహరం కోసం ఎదురుచూస్తున్నారని, ఎల్లంపల్లి భూ నిర్వాసితులు ఇంకా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారన్నారు. నంగునూరు మండలం కౌడాయిపల్లి కెనాల్ నిర్మించి నేటికీ 15 సంవత్సరాలు గడిచాయన్నారు. ఇన్నేళ్లు పరిహారం కోసం ఎదురుచూసిన వారికి తమ ప్రభుత్వంలో పరిష్కారం లభించిందన్నారు. ఇంజనీర్.. హరీశ్‌రావు మంత్రి హరీశ్ రావు ఇంజనీర్ ఆవతారమెత్తారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ సమగ్ర రూపాన్ని స్థానిక ప్రజాప్రతినిధులకు వివరించారు. రంగనాయక సాగర్, అనంతగిరి రిజర్వాయర్లపై దాదాపు అరగంటపాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అంతకుముందు సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని ప్రజాప్రతినిధులను వెంకటాపూర్ సొరంగంలోకి తీసుకెళ్లి పనులను దగ్గరుండి చూపించారు. గత ప్రభుత్వం చేపట్టిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు అప్పటి రూపం, తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రీడిజైన్ చేసి చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ మధ్య వ్యత్యాసాన్ని వివరించారు. రంగనాయక్ సాగర్ కుడి కాలువ నిర్మాణ పనులకు భూసేకరణ నిర్వహించాల్సి ఉందని, అందుకు నంగునూరు మండల ప్రజాప్రతినిధులు చొరవ చూపి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు. -
పనులు ముందు..టెండర్లు తర్వాత
ఒంగోలు అర్బన్ : ఒంగోలు నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ విభాగం అంతా తమ ఇష్టం అన్నట్లు వ్యవహరిస్తోంది. సివిల్ వర్కులకి సంబంధించిన టెండర్ల విషయంలో ఎంఈతో పాటు ఇతర అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. దీంతో నగరపాలక సంస్థకి ఓపెన్టెండర్ల వలన రావాల్సిన 20 నుంచి 30 శాతం మిగులు ఆదాయానికి గండిపడుతోంది. కేవలం కొంతమంది కాంట్రాక్టర్లకే పనులు కేటాయించాలనే ఉద్దేశంతో ఇంజినీరింగ్ విభాగం నిబంధనలను తుంగలో తొక్కిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. టెండర్లు ఖరారు కాకుండానే... పనులకు సంబంధించిన టెండర్లు ఖరారు చేయకుండానే కాంట్రాక్టర్లకు అప్పగిస్తున్నారు. కొంతమంది కాంట్రాక్టర్లకు ముందుగానే పనులు కేటాయించి... ఆ పనులు చేస్తుండగా టెండర్లు ఏవిధంగా ఖరారు చేస్తారని కొందరు కౌన్సిలర్లు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంలో అధికార పార్టీ నేతల హస్తం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ అడ్డగోలు విధానం వలన పనులకు సంబంధించిన ఎంబుక్స్‌లో కూడా వారికి అనుకూలమైన తేదీలు వేసుకొని మరీ నమోదు చేయాల్సి వస్తుందని పలువురు కాంట్రాక్టర్లు, మాజీ కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి, కలెక్టర్ ఉండే హెడ్ క్వార్టర్స్‌లోనే ఉన్నా ఏమాత్రం జంకు లేకుండా ఈ విధంగా అడ్డగోలుగా ముందు పనులు కేటాయించి తర్వాత టెండర్లు పిలుస్తున్నారంటే ఇంజినీరింగ్ విభాగం నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. - సక్రమంగా బాధ్యతలు నిర్వహించాల్సిన అధికారులు వక్రమార్గంలో పనిచేస్తూ నగరపాలక సంస్థకి నష్టం తెస్తుంటే మరోవైపు నగర ప్రజలపై అధిక మొత్తంలో పన్నులు పెంచి భారం మోపుతున్నారు. ఇప్పటికైనా ప్రత్యేక అధికారి అయిన కలెక్టర్ సుజాత శర్మ ఈ అవకతవకలపై దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోకుంటే నగరపాలక సంస్థకి పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లుతుంది. - ఈ నెల 7వ తేదీ రూ.73.31 లక్షల విలువైన మొత్తం 13 పనులకు సంబంధించిన టెండర్లు నమోదయ్యాయి. వీటిలో ఏ ఒక్క టెండరూ ఖరారు కాలేదు. - ఏ కాంట్రాక్టర్‌కీ వర్క్ ఆర్డర్ ఇవ్వలేదు. అయినా ఆ 13 పనుల్లో కొన్ని పనులు దాదాపుగా పూర్తి కావస్తున్నాయి. దీన్నిబట్టి చూస్తే ఇంజినీరింగ్ విభాగం ఏవిధంగా పనిచేస్తుందో ఇట్టే అర్థమవుతుంది. టెండర్లు ఖాయం కాకుండా ముందుగా జరుగుతున్న పనులు ఇవీ... - కమ్మపాలెంలో కరవది డొంక పోతురాజు కాలువ వద్ద ఉన్న శ్మశాన వాటిక ప్రహరీ, రంగులకి సంబంధించి రూ.4,40,171 లక్షల విలువైన పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయి. ఇంతవరకు టెండర్ ఖరారు కాలేదు. అక్కడే రూ.4,49,625 లక్షల విలువైన డ్రైనేజి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. - స్థానిక బాలకృష్ణాపురంలో రూ.4,51,147 లక్షలతో సిమెంట్ రోడ్లు శరవేగంగా జరుగుతున్నాయి. వీటికి సంబంధించిన టెండరు ఖరారు కాలేదు. - రంగారాయుడు చెరువు, గాంధీపార్కు వద్ద రూ.3,14,333 లక్షల విలువైన ట్రాక్ లైటింగ్ పనులు కూడా జరిగిపోతున్నాయి. ఇప్పటికి 20 అడుగుల లైటింగ్ పోల్స్, 10 అడుగుల లైటింగ్ పోల్స్ ఏర్పాటు చేశారు. ఇంకా ఈ పనులకు టెండర్ ఖరారు కాలేదు. -
టీఎస్ ఎంసెట్-2015 వెబ్ కౌన్సెలింగ్
తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ (ఇంజనీరింగ్ విభాగం)- 2015 కౌన్సెలింగ్ ప్రక్రియ నేటినుంచి ప్రారంభం కానుంది. ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగంలో ఉత్తీర్ణత సాధించిన 1,04,373 అభ్యర్థులకు.. పరీక్షలో ఉత్తీర్ణత కోసం ఎంత కృషి చేశారో.. అంతే స్థాయిలో కౌన్సెలింగ్ ప్రక్రియకు హాజరై, వెబ్ ఆప్షన్స్ ఎంపికలో అప్రమత్తతో వ్యవహరిస్తూ సరైన కాలేజీని, కోర్సును ఎంపిక చేసుకోవడం కూడా ముఖ్యం. ఈ విషయంలో అభ్యర్థులకు ఉపయోగపడేలా ఎంసెట్ వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ వివరాలు.. టీఎస్ ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియలో తొలి దశ అయిన సర్టిఫికెట్ వెరిఫికేషన్ నేడు ప్రారంభం కానుంది. అభ్యర్థులు తమ ర్యాంకుల ప్రకారం పేర్కొన్న హెల్ప్‌లైన్ సెంటర్లకు నిర్దేశిత తేదీల్లో హాజరు కావాలి. ఈ ఏడాది తెలంగాణ వ్యాప్తంగా 20 హెల్ప్‌లైన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఇందులో కొన్నిటిని ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు ప్రత్యేకంగా కేటాయించారు. ఈ కేటగిరీ అభ్యర్థులు ఆ హెల్ప్‌లైన్ సెంటర్లలోనే హాజరు కావాలి. స్పెషల్ కేటగిరీ అభ్యర్థులకు: ఫిజికల్లీ హ్యాండీ క్యాప్డ్, సీఏపీ, ఎన్సీసీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, ఆంగ్లో ఇండియన్ కేటగిరీల అభ్యర్థులు హైదరాబాద్‌లోని మసాబ్‌ట్యాంక్‌లోని సాంకేతిక విద్యాభవన్‌లో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ సెంటర్లో మాత్రమే సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరు కావాలి. సర్టిఫికెట్లు సిద్ధం చేసుకోండి: వెబ్ కౌన్సెలింగ్ సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరవుతున్న అభ్యర్థులు సిద్ధం చేసుకోవాల్సిన సర్టిఫికెట్లు.. టీఎస్ ఎంసెట్ ర్యాంక్ కార్డ్ టీఎస్ ఎంసెట్ హాల్ టికెట్ ఇంటర్మీడియెట్ మెమో కమ్ పాస్ సర్టిఫికెట్ టెన్త్ క్లాస్ మార్క్స్ మెమో నాన్ లోకల్ విద్యార్థులై, తల్లిదండ్రులు పదేళ్లుగా తెలంగాణలో నివసిస్తుంటే సంబంధిత రెసిడెన్స్ సర్టిఫికెట్ 2015, జనవరి 1 తర్వాత జారీచేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రం ఆధార్ కార్డ్ స్పెషల్ కేటగిరీ అభ్యర్థులు.. నిర్దేశిత అధికారులు జారీచేసిన సర్టిఫికెట్లు. ఒరిజినల్ కాపీలతోపాటు రెండు సెట్ల జి రాక్స్ కాపీలతో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరు కావాలి. రిజిస్ట్రేషన్ టు వెబ్ ఆప్షన్స్: సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో అభ్యర్థులు సంబంధిత హెల్ప్‌లైన్ సెంటర్‌కు హాజరవ్వాలి. నిర్దేశిత ఫీజు చెల్లించి (ఓసీ/బీసీ అభ్యర్థులు రూ. 800, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు రూ.400) రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత తమ ర్యాంకును పిలిచినప్పుడు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆఫీసర్ వద్ద తమ ధ్రువపత్రాలను తనిఖీ చేయించుకుని రిసీట్ ఆఫ్ సర్టిఫికెట్స్ ఫామ్ తీసుకోవాలి. అందులోనే రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. దీని ఆధారంగానే తదుపరి దశలో వెబ్ ఆప్షన్స్ ఎంట్రీకి వీలవుతుంది. వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ: సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ను విజయవంతంగా పూర్తిచేసుకున్న విద్యార్థులకు తమ ర్యాంకుల ఆధారంగా నిర్దేశిత తేదీల్లో వెబ్సైట్లో ఆప్షన్స్ (కాలేజీ, కోర్సుల ప్రాధాన్యతలు) ఇచ్చే అవకాశం లభిస్తుంది. దీనికి సంబంధించి దశల వారీ ప్రక్రియలు.. ముందుగా ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ బ్రౌజర్ ద్వారా ఓపెన్ చేయాలి. తర్వాత తమ రిజిస్ట్రేషన్ నంబరు, హాల్ టికెట్ నంబరు, ర్యాంకు, పుట్టిన తేదీ వివరాలతో పాస్వర్డ్ జనరేట్ చేసుకోని లాగ్ అవుట్ అవ్వాలి. తర్వాత క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ బటన్‌పై క్లిక్ చేసి.. తాము సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో ఇచ్చిన మొబైల్ నెంబర్‌కు పంపిన లాగిన్ ఐడీ, తాము జనరేట్ చేసుకున్న పాస్వర్డ్ వివరాలు పొందుపరిచి డిస్ప్లే ఆప్షన్స్ ఎంట్రీ ఫామ్ బటన్‌పై క్లిక్ చేయాలి.అప్పుడు కళాశాలలు, కోర్సుల వివరాలతో కూడిన స్క్రీన్ ఓపెన్ అవుతుంది. అభ్యర్థులు తమ ప్రాధాన్యం ఆధారంగా వాటిని పూరించాలి. ఇలా ఎన్ని ఆప్షన్లయినా ఇవ్వొచ్చు. ఎలాంటి పరిమితి లేదు. అన్ని ఆప్షన్లు ఇచ్చిన తర్వాత సేవ్ అండ్ లాగ్ అవుట్, కన్ఫర్మ్ అండ్ లాగ్ అవుట్ బటన్లపై క్లిక్ చేస్తే తాము ఇచ్చిన ఆప్షన్లతో కూడిన ఫామ్ కనిపిస్తుంది. దాన్ని ప్రింటవుట్ తీసుకుని లాగ్ అవుట్ అవ్వొచ్చు. అభ్యర్థులు తమకు కేటాయించిన తేదీల్లో ఎన్నిసార్లయినా లాగిన్ అయి ఆప్షన్లు మార్చుకోవచ్చు. అదే విధంగా ఆప్షన్ల ఎంట్రీ తేదీలు ముగిసిన తర్వాత కూడా తాము ఇచ్చిన ఆప్షన్లు మార్చుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇందుకోసం సంబంధిత హెల్ప్‌లైన్ సెంటర్‌కు వెళ్లాలి. సీట్ అలాట్మెంట్ అభ్యర్థులు ఇచ్చిన ఆప్షన్లు, వారి ర్యాంకు అందుబాటులో సీట్లు ఆధారంగా సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. దీనికి నిర్దేశిత తేదీలు ప్రకటిస్తారు. ఆ తేదీల్లో వెబ్సైట్లో లాగిన్ అయితే సీట్ అలాట్మెంట్ ఆర్డర్ కనిపిస్తుంది. దాన్ని ప్రింటవుట్ తీసుకొని, సంబంధిత హెల్ప్‌లైన్ సెంటర్లో లేదా అభ్యర్థులు తమ లాగిన్ ద్వారా రిపోర్ట్ చేయొచ్చు. తర్వాత కళాశాలలో చేరినప్పుడు మాత్రమే ఫీజు చెల్లించి, ఒరిజినల్ సర్టిఫికెట్లు అందజేయాల్సి ఉంటుంది. తొలి దశలో సీటు లభించి రిపోర్ట్ చేసినా మలి దశ కౌన్సెలింగ్‌లోనూ పాల్గొనొచ్చు. ఆసక్తికి అనుగుణంగా బ్రాంచ్ ఎంపిక అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ తర్వాత వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ ఇచ్చేందుకు మంచి సమయం అందుబాటులో ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని కాలేజీ, బ్రాంచ్ విషయంలో కసరత్తు చేయాలి. ముఖ్యంగా బ్రాంచ్ ఎంపికలో ఆసక్తికి ప్రాధాన్యం ఇవ్వాలి. కళాశాలలకు సంబంధించిన వివరాలను వీలైనంత త్వరగా అభ్యర్థులకు అందుబాటులో ఉంచే ప్రయత్నం చేస్తున్నాం. ఇది కూడా వెబ్ ఆప్షన్స్ ఎంట్రీకి ముందే ఉంటుంది. కాబట్టి వాటిని వెల్లడించగానే సదరు కళాశాలల నాణ్యత, ప్రమాణాల గురించి పరిశీలించి మంచి కళాశాలను ఎంపిక చేసుకోవాలి. పీజీ కోర్సులు కూడా ఉన్న కళాశాలలైతే ల్యాబ్స్, ఫ్యాకల్టీ పరంగా మరింత సదుపాయాలు ఉంటాయి. - ప్రొఫెసర్ ఎన్.వి.రమణ రావు, టీఎస్ ఎంసెట్-2015 కన్వీనర్. -
అప్పనంగా ఇచ్చేశారు !
- కాంట్రాక్ట్ లేబర్ టెండర్లలో ఇష్టారాజ్యం - రూ.23 లక్షలకుపైగా పనులు ఇచ్చేసిన వైనం - మరో రూ.71 లక్షల పనులపై కన్ను - చిత్తూరు కార్పొరేషన్లో విచిత్రమైన వ్యవహారం చిత్తూరు (అర్బన్): చిత్తూరు కార్పొరేషన్లో ఈ ఏడాది మే నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు ఇంజినీరింగ్ శాఖలో కాంట్రాక్టు పద్ధతిలో పని చేసేందుకు గత నెల ఈ-ప్రొక్యూర్మెంట్ టెండర్లు పిలిచారు. ఇందులో 10 మంది వీధిదీపాల నిర్వాహకులు, 77 మంది బోరు ఆపరేటర్లు, నీటి పైపులైన్ల నిర్వాహకులు, 9 మంది సెక్యూరిటీ గార్డులు, ఆరుగురు కంప్యూటర్ ఆపరేటర్ల కోసం టెండర్లు పిలిచారు. వీరిలో కంప్యూటర్ ఆపరేటర్లకు నెలకు రూ.9,500, మిగిలిన వారికి నెలకు రూ.8,400 చెల్లిస్తామని అధికారులు టెండర్లలో పేర్కొన్నారు. కాంట్రాక్టర్ 0-3 శాతం వరకు నిర్వహణ వ్యయాన్ని కోట్ చేస్తే ఎవరు తక్కువ ధరకు పనులు చేస్తారో వారికి టెండర్ ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. ఇందుకు ఏడుగురి నుంచి దరఖాస్తులు అందాయి. ఆన్లైన్ టెండర్లను ఇటీవల అధికారులు ఓపెన్ చేశారు. వీరిలో ఇద్దరు కాంట్రాక్టర్లు వ్యాట్ రిజిస్ట్రేషన్ చేసుకోలేదని వారి దరఖాస్తులను తిరస్కరించారు. బాలాజీ క్రియేటివ్ కన్స్ట్రక్షన్స్, సీఎస్ అండ్ కో, జేఎంసీ, వి.మునిరత్నం, దండుమారియమ్మ అనే ఐదుగురు కాంట్రాక్టర్లు అన్ని అర్హతలతో టెండరు దాఖలు చేశారు. అయితే ఈ పనులను చేయడానికి తమకు ఎలాంటి నిర్వహణ వ్యయం అవసరం లేదని, ఉచితంగా సేవలు చేస్తామని టెండర్లు వేశారు. ఈ వ్యవహారాన్ని పరిష్కరించడానికి నాలుగు మార్గాలున్నాయి. మొదటిది అందరి పేర్లను ఓ చీటీలో రాసి లాటరీ పద్ధతి ద్వారా టెండరు ఖరారు చేయవచ్చు. రెండోది గత అనుభవం ఎక్కువగా ఉన్న వారికి టెండరు ఇవ్వాలి. మూడోది ఎవరు ముందు టెండరు వేశారో వారికి పనులు అప్పగించవచ్చు. చివరగా ఏదీ వద్దనుకుంటే టెండరు ప్రక్రియను రద్దుచేసి కొత్తగా టెండర్లు పిలవచ్చు. కానీ ఇక్కడ అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారు. పరిపాలన అనుమతి పేరిట రూ.24 లక్షల విలువైన పనులను మునిరత్నం అనే వ్యక్తికి అప్పగించారు. అయితే రూ.50 లక్షలు మించిన బోరు ఆపరేటర్ల పనికి కౌన్సిల్ అనుమతి తప్పనిసరి కావడంతో (రూ.71 లక్షలు విలువ) దాన్ని పెండింగ్‌లో ఉంచారు. ఇది కూడా మునిరత్నం అనే కాంట్రాక్టర్‌కు అప్పగించడానికి రంగం సిద్ధమైంది. అధికార పార్టీకి చెందిన ఓ వ్యక్తి టెండరు వేసినా నిబంధనలు పాటించలేదని కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు న్యాయపరంగా చర్యలకు సిద్ధమవుతున్నారు. ఈ వ్యవహారంలో కార్పొరేషన్లో పనిచేసే ఓ అధికారి పాలకవర్గాన్ని పూర్తిగా తప్పుదారి పట్టించినట్టు ఆరోపణలు ఉన్నాయి. కమిషనర్ అనుమతితోనే.. ఐదుగురు ఒకే ధరలో టెండరు వేస్తే అందులో సాంకేతిక అంశాలు ఉంటే నేను పరిష్కారం చెప్పవచ్చు. కానీ ఇందులో సాంకేతిక అంశాలు లేవు. అందుకే పరిపాలన ఆమోదం కోసం కమిషనర్‌కు ఫైలు పంపి, ఆయన ద్వారా స్టాండింగ్ కమిటీలో ఉంచాం. అక్కడ ఆమోదం చెప్పడంతో మునిరత్నానికి పనులు ఇచ్చాం. ఇందులో నా పాత్ర ఏమీ లేదు. -
ఆరు శాఖలకే పరిమితమైన సమావేశం
సీతంపేట: సీతంపేట ఐటీడీఏ 68వ పాలక వర్గ సమావేశం తూతూ మంత్రంగానే ఆదివారం ముగిసింది. సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ పరిధిలో 26 ప్రభుత్వ శాఖలు ఉండగా కేవలం ఆరు శాఖలపైనే చర్చకు పరిమితమైంది. వాస్తవంగా అన్ని శాఖలపై చర్చ జరగాల్సి ఉండగా 20 శాఖలను అసలు పట్టించుకోలేదు. అజెండాలో కూడా ఆయా శాఖలకు మంజూరైన నిధులు, చేసిన ఖర్చులు, కార్యకలాపాలు రూపొందించారు. అరుుతే కేవలం ఆరు శాఖలపైనే చర్చ జరిపి పాలకవర్గ సమావేశం అయ్యిందనిపించారు. వ్యవసాయశాఖ, ట్రాన్స్‌కో, గ్రామీణ నీటి పారుదల విభాగం, గిరిజన సంక్షేమం, ఇంజినీరింగ్ విభాగం, గిరిజన ప్రాంతాల్లో స్వచ్ఛందసంస్థల కార్యకలాపాలు, అటవీశాఖపై మాత్రమే చర్చ జరిగింది. ముఖ్యమైన గిరిజన సంక్షేమశాఖ, ఉద్యానవనశాఖ, ఐఏపీ, జాతీయగ్రామీణాభివృద్ధి పథకం, ప్రత్యేక ఉపాధి పథకం, వెలుగు, గృహనిర్మాణశాఖ, మలేరియా విభాగం, వైద్యశాఖ, గిరిజన సహకార సంస్థ, ట్రైకార్, స్త్రీ శిశుసంక్షేమశాఖ, భూగర్భజలశాఖ తదితర శాఖలపై చర్చజరగాల్సి ఉన్నప్పటకీ వీటి జోలుకు ఎవరూ పోలేదు. సమయం లేదన్న సాకుతో ముగించారు. ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమైన సమావేశాన్ని మధ్యాహ్నం రెండు గంటలకు ముగించారు. ఒకానొక దశలో పలాస ఎమ్మెల్యే శ్యాంసుందర్ శివాజీ కూడా సమావేశంపై అసంతృప్తి చెందారు. అన్ని శాఖలపై చర్చజరగకుండా సమస్యలు ఎలా పరిష్కారమౌతాయని మంత్రి అచ్చెన్నాయుడును ప్రశ్నించారు. పూర్తిస్థాయిలో సమావేశం జరిగితే సమస్యలపై సభ్యులు ప్రశ్నించడానికి అవకాశముండేదన్నారు. కొన్ని శాఖలపై జెడ్పీ సమావేశంలో చర్చించినందున ఇప్పుడు చర్చించడం లేదని మంత్రి అచ్చెన్న చెప్పడం గమనార్హం. ఇకపై జిల్లా పరిషత్ సమావేశం జనవరిలో, ఐటీడీఏ పాలక వర్గ సమావేశం ఫిబ్రవరిలో పెడితే బాగుంటుందని శివాజీ సూచించారు. నోరు కదపని ఎంపీ పాలకవర్గ సమావేశానికి శ్రీకాకుళం ఎంపీ రామ్మెహన్‌నాయుడు హాజరైనప్పటికీ కనీసం నోరు కదపలేదు. సమావేశంలో పలాస శాసనసభ్యుడు శ్యాంసుందర్ శివాజీ, పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణలు మాత్రమే సమస్యలపై ప్రశ్నలవర్షం కురిపించారు. అవునంటే కాదనిలే అన్న చందంగా ఒకానొక సందర్భంలో మంత్రి అచ్చెన్న ఒకటి మాట్లాడితే దానికి ప్రభుత్వవిప్ కూన రవికుమార్ అడ్డుతగలడం కనిపించింది. అటవీశాఖ పర్మిషన్ లేకపోయినా, గిరిజన సంక్షేమశాఖ రహదారులు నిర్మించాలని, గిరిజనుల ఆవాస ప్రాంతాలు కాబట్టి డీఎఫ్‌వో చూసీచూడనట్టు వ్యవహరించాలని మంత్రి అచ్చెన్న కోరారు. దీనికి స్పందించిన విప్ రవికుమార్ స్పందిస్తూ చట్టబద్ధంగా రహదారులు వేయాలన్నారు. అన్ని శాఖలపై చర్చ జరగకపోవడంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులకు సమస్యలపై చర్చించే అవకాశం లేకపోయింది. -
ఎత్తుకు పైఎత్తులు
సాక్షి ప్రతినిధి, విజయనగరం : పంచాయతీరాజ్ ఇంజినీరింగ్‌శాఖలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. పూర్వపు ఈఈ, ప్రస్తుత డీఈఈ శ్రీనివాస్‌కుమార్ లక్ష్యంగా చేసుకుని జెడ్పీ చైర్పర్సన్ ఎత్తులు వేస్తుంటే, అందుకు ఆయన మద్దతు ఎమ్మెల్యేలు పైఎత్తులు వేస్తున్నారు. గత పాలకులకు అనుకూలంగా వ్యవహరించిన ఇన్చార్జి ఈఈ శ్రీనివాస్‌కుమార్ టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ ఎమ్మెల్యేల అండతో పంచాయతీరాజ్‌లో ఇంకా పెత్తనం చెలాయిస్తున్నారని, తమకు తెలి యకుండా వ్యవహారాలు నడుపుతున్నారన్న అనుమానంతో ఆయన్ని ఎలాగైనా సాగనంపాలని జెడ్పీ పెద్దలు పథక రచన చేశారు. అందుకు తగ్గట్టుగానే ఆయన కున్న ఇన్చార్జి ఈఈ బాధ్యతలను తొలగించి, డీఈఈగా వెనక్కి పంపించేలా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ చేయించారు. ఈఈ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించినతరువాత ఎమ్మెల్యేలు సూచించిన వారిని పాత తేదీతో అవుట్ సోర్సింగ్ టెక్నికల్ అసిస్టెంట్లగా నియమించినట్టు అభియోగాలు వచ్చాయి. ఈ వ్యవహారంపై రాష్ట్ర మంత్రి మృణాళిని తీవ్రంగా స్పందించారు. టెక్నికల్ అసిస్టెంట్ల నియామకాలను నిలిపేసి, డీఈఈ శ్రీనివాస్‌ను సరెండర్ చేయాలని పంచాయతీరాజ్ ఎస్ఈకి మంత్రి తరఫున ఓఎస్డీ నుంచి ఒక లేఖ వచ్చింది. రహస్యంగా పంపించిన మంత్రి ఓఎస్డీ లేఖను వ్యూహాత్మకంగా చైర్పర్సన్ వర్గీయులు లీక్ చేశారని, జెడ్పీలో అంతా పథకం ప్రకారం జరుగుతోందని రాష్ట్ర మంత్రి వర్గీయులు అనుమానానికొచ్చినట్టు తెలిసింది. ఇదే అదనుగా శ్రీనివాస్‌కు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలు కూడా మంత్రితో మాట్లాడినట్టు గుసగుసలు విన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సదరు ఎమ్మెల్యే లంతా కలిసికట్టుగా, వ్యూహాత్మకంగా పంచాయతీరాజ్ మంత్రి అయ్యన్నపాత్రుడ్ని కలిసి తమను నమ్ముకున్న డీఈఈ శ్రీనివాస్‌కు మార్కు ఎటువంటి హాని జరగకుండా చూసుకోవడమే కాకుండా, పీఏ టూ ఎస్ఈగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయించినట్టు తెలిసింది. దీంతో చైర్పర్సన్ వర్గీయులు కంగుతిన్నారు. ఆ ఉత్తర్వులు బయటపెట్టొద్దని, పంచాయతీరాజ్ మంత్రి, సీఈతో మా ట్లాడుతానని జిల్లా ఎస్ఈకి చైర్పర్సన్ వర్గీయులు లోపాయికారీగా చెప్పినట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మొత్తానికి అ టు చైర్పర్సన్, ఇటు డీఈఈ వర్గీయులు ప్రతిష్టకు పోయి, ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ముందుకెళ్తున్నారు. డీఈఈ శ్రీనివాస్ మాత్రం ఎక్కడ పోగుట్టుకున్నానో అక్కడే వెదుక్కోవాలన్న ఆలోచనతో పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. ఇదెక్కడికి దారితీస్తుందో, ఎంతవర కు వెళ్తుందో చూడాలి. -
అక్రమాలపై జేసీ కొరడా
రిమ్స్ క్యాంపస్: కమిషనర్ ఏమీ పట్టించుకోరు.. దాంతో వారు ఆడిందే ఆట, పాడిందే పాట.. కానీ ప్రత్యేకాధికారి ఊరుకోలేదు. అవకతవకలపై కన్నెర్ర చేశారు. అక్రమార్కులపై షోకాజ్ కొరడా ఝుళిపించారు. అది వారికి కంటగింపుగా మారింది. ఈయన పెత్తనమేమిటంటూ ఇంతెత్తున లేస్తున్నారు. సామూహిక సెలవులు పెట్టి సత్తా చూపాలని యోచిస్తున్నారు. ఇదంతా జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం మున్సిపాలిటీలో చర్చనీయాంశంగా మారింది. మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి అయిన జాయింట్ కలెక్టర్, మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధానికి తెర లేపింది. నిధుల దుర్వినియోగంపై ఆరాతో మొదలు మున్సిపాలిటీలో కీలకమైన ఇంజినీరింగ్ విభాగంలోని కొందరు అధికారులు ముడుపులకు అలవాటు పడి కాంట్రాక్టర్ల కొమ్ము కాస్తున్నారన్న ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికల ముందు జిల్లాకు జేసీగా వచ్చిన జి.వీరపాండ్యన్ మున్సిపల్ ప్రత్యేకాధికారిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల అనంతరం ఇంజినీరింగ్ విభాగంపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. ఆరోపణలను దృష్టిలో పెట్టుకొని 12, 13వ ఆర్థిక సంఘ నిధుల వినియోగంపై ఆరా తీశారు. దాంతో ఇంజినీరింగ్ అధికారుల లీలలు, కాంట్రాక్టర్ల అక్రమాలు బట్టబయలయ్యాయి. అప్పటి నుంచి సమీక్ష సమావేశాల్లో ఇంజినీరింగ్ అధికారుల పనితీరును ఎండగడుతూ వచ్చారు. బాగున్న రోడ్లపైనే మళ్లీ మళ్లీ రోడ్లు వేస్తున్నారని, కాంట్రాక్టర్ల జేబులు నింపుతున్నారని నిలదీశారు. తాజా ఓ అభివృద్ధి పనివిషయంలో రూ. 11 లక్షల నిధులు గోల్మాల్ అయినట్లు గుర్తించిన ఆయన గత నెల 27న నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఇంజినీరింగ్ అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. టెండర్లో ఒక ధర కోట్ చేసిన కాంట్రాక్టర్లు తర్వాత ఇంజినీరింగ్ అధికారుల సహకారంతో నిర్మాణ సామాగ్రి ధరలు పెరిగాయన్న సాకుతో అధిక మొత్తానికి బిల్లులు మంజూరు చేయించుకుంటున్నారని జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి కారకులన్న ఆరోపణతో సదరు అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయడంతోపాటు సంబంధిత ఫైలుపై సంతకం పెట్టకుండా పెండింగులో ఉంచినట్లు తెలిసింది. తమనే టార్గెట్ చేస్తున్నారేందుకు? కాగా తమనే జేసీ ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ఇంజినీరింగ్ అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. తాము విధులు సక్రమంగానే నిర్వర్తిస్తున్నామని, ఎక్కడో ఏవో చిన్న పొరపాట్లు జరిగితే వాటిని భూతద్దంలో చూపడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. జేసీ తీరుకు నిరసనగా మూకుమ్మడి సెలవులు పెట్టాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. దీనిపై తమ యూనియన్ రాష్ట్ర నాయకులతో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాలని వారు భావిస్తున్నారు. ఏమీ పట్టని కమిషనర్ తన ఆధీనంలో ఉన్న మున్సిపాలిటీలో ఇంత రచ్చ జరుగుతున్నా మున్సిపల్ కమిషనర్ తనకేమీ సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆయన ఏ విషయాన్ని పూర్తిస్ధాయిలో పట్టించుకోరని మున్సిపల్ ఉద్యోగులే వ్యాఖ్యానిస్తున్నారు. కాగా ఇక్కడి రాజకీయాలను తట్టుకోలేనంటూ కమిషనర్ బదిలీ కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారని తెలిసింది. అంత వరకు సెలవుపై వెళ్లాలన్న ఆలోచనలో ఉన్నట్లు కూడా సమాచారం. సెలవులు పెట్టే ఆలోచన లేదు : రామ్మెహనరావు, ఎం.ఈ ఇంజినీరింగ్ అధికారులకు జేసీ షోకాజ్ నోటీసులు ఇచ్చిన మాట వాస్తవమే. అయితే దీనికి నిరసనగా మూకుమ్మడి సెలవులు పెడతారన్న దాంట్లో వాస్తవం లేదు. మేం సెలవులు పెట్టే ఆలోచనలో లేం. ఎక్కడ తప్పులు జరిగాయన్న దానిపై విచారణ జరుపుతాం. -
ఇరిగేషన్ లెక్క తేలింది!
సాక్షి, హైదరాబాద్: సాగు నీటి పారుదల శాఖలో పోస్టులు, ఉద్యోగుల లెక్క తేలింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇరు ప్రాంతాల్లో ఉన్న పోస్టులు, ఉద్యోగుల సమగ్ర సమాచారాన్ని అధికారులు సిద్ధం చేశారు. ఈ విషయంపై మరింత స్పష్టత కోసం సోమవారం చీఫ్ ఇంజనీర్ల (సీఈల) సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత ఎవరు ఏ రాష్ట్రంలో పనిచేయాలనే విషయంపై స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు. రాష్ర్టవ్యాప్తంగా 5 ఈఎన్సీలు, 33 సీఈ పోస్టులు ఉన్నాయి. ఇంజనీరింగ్ విభాగంలో 7,986 పోస్టులు ఉన్నాయి. ఇరిగేషన్ శాఖలో మొత్తం 34,486 పోస్టులు ఉన్నట్టు గుర్తించారు. ప్రస్తుతం ఈ శాఖలో ఉన్నతాధికారుల పోస్టులు ప్రాంతాలవారీగానే ఉన్నాయి. కాడాకు ఒక కార్యదర్శి ఉండగా, రాయలసీమ, తెలంగాణ, ఆంధ్రా ప్రాజెక్టుల పర్యవేక్షణకు వేర్వేరుగా కార్యదర్శులు ఉన్నారు. ఇంజనీర్ ఇన్ చీఫ్‌లు (ఈఎన్సీలు) కూడా ఇదే మాదిరిగా ఉన్నారు. పరిపాలన విభాగానికి ఒక ఈఎన్సీ ఉండగా, ఇరు ప్రాంతాలకు ప్రత్యేక ఈఎన్సీలు ఉన్నారు. వాలంతరి, ఇంజనీరింగ్ రీసెర్చ్ లేబొరేటరీస్ (ఏపీఈఆర్‌ఎల్), జలవనరులు వంటి విభాగాలకు మాత్రమే ఉమ్మడి ఈసీలు ఉన్నారు. నీటి వనరుల వాటాపై సిద్ధమైన నివేదిక: రాష్ర్టంలోని వివిధ నదుల బేసిన్లలో ఉన్న నీటి వనరులు, వాటి పంపకాలకు సంబంధించిన సమాచారంతో అధికారులు ఓ నివేదికను సిద్ధం చేశారు. వివిధ నదులపై బచావత్ అవార్డు ప్రకారం పంచిన నీటి వివరాలనే ఇందులో పొందుపరిచారు. భారీ ప్రాజెక్టుల పరిధుల్లోనే కాక చిన్న, మధ్య తరహా ప్రాజెక్టులతో పాటు కుంటలు, చెరువుల పరిధిలో కూడా నీటి వాడకాన్ని అంచనా వేశారు. గోదావరి, కృష్ణా నదుల్లో ఎగువ ప్రాంతం నుంచి రావాల్సిన నీరు ఎంత? రాష్ట్రంలో ఉన్న నీటి లభ్యతలను అంచనా వేశారు. ఈ నీటిలో ఏయే ప్రాంతానికి ఎంతెంత వాటా ఉందన్న విషయాన్ని ప్రాజెక్టులవారీగా నివేదికలో పొందుపరిచారు. -
తండ్రిలాంటి వాడిని.. ఉద్యోగ సంఘాల నేతలతో కలెక్టర్
కలెక్టరేట్,న్యూస్‌లైన్: ‘నేను మీకు తండ్రిలాంటి వాడిని.. పిల్లలు తప్పు చేస్తే తండ్రి ఇంట్లో మందలించినట్లే ఉద్యోగులు తప్పు చేస్తే నేను అదే చేస్తున్నాను. అయినా నేను ఇంతవరకు ఓ ఇంజనీరు శాఖపై మాత్రమే దృష్టి సారించాను. మిగితా శాఖలపై అసలు దృష్టే పెట్టలేదు. తప్పుచేస్తున్న ఉద్యోగులను, నిర్ణయించిన లక్ష్యం చేరని ఉద్యోగులను మాత్రమే మందలిస్తున్నాను’ అని జిల్లా కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో పేర్కొన్నారు. బుధవారం ఉద్యోగ సం ఘాల ప్రతినిధులు కలెక్టర్‌తో సమావేశమయ్యా రు. కలెక్టర్ ప్రవర్తిస్తున్న తీరుతో ఉద్యోగులు మ నోవేదన చెందుతున్నారని పేర్కొన్నారు. కారణాలు లేకుండానే ఉద్యోగులను వేధిస్తున్నారని కలెక్టర్‌ను ఉద్దేశించి అన్నారు. దీంతో స్పందించి న కలెక్టర్ మాట్లాడుతూ నేను ఇప్పటివరకు ఎవరి మన సు నొప్పించలేదని, నావల్ల ఎవరికీ బీపీ, షుగర్ వచ్చిన దాఖలాలు లేవన్నారు. ఓ కుటుంబ పెద్దలా ఉద్యోగుల పనితీరును మెరు గుపరచడానికి కొంతమందిని మందలించ వల సి వస్తోందని పేర్కొన్నారు. అంతే కాని తనకు ఉద్యోగులపై ఎలాంటి కోపం లేదన్నారు. ఇదం తా చూస్తుంటే ఉద్యోగ సంఘాల వెనుక ఎవరి దో ప్రోద్బలం ఉన్నట్లు అనుమానం వస్తోందన్నారు. అవసరమైతే ఉద్యోగుల సమస్యలపై కలెక్టరేట్లో ‘ఉద్యోగవాణి’ఏర్పాటు చేస్తానన్నా రు. సమస్యలేవైనా ఉంటే అందులో చెప్పుకోవాలని ఉద్యోగలకు సూచించారు. అనంతరం తనకు గ్రూప్ అఫ్ మినిస్టర్స్‌తో వీడియో కాన్ఫరెన్స్ ఉందని, తరువాత కలుద్దామని చెప్పి వెళ్లిపోయారు. ఈ సమావేశంలో టీఎన్జీఓస్ అధ్యక్ష,కార్యదర్శులు గంగారాం, కిషన్, సుధాకర్, అమృత్‌రావు, తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు సూర్యప్రకాష్, వెం కటయ్య, జిల్లా ట్రెజరీ ఉద్యోగుల సంఘం నాయకులు రాములు, గంగాకిషన్, టీజీఓ అధ్యక్షులు బాబురావు, ఎంపీడీఓల సంఘం అధ్యక్షులు గోవింద్, కార్యదర్శి సాయన్న, వ్యవసాయధికారుల సంఘం నేతలు హరికృష్ణ, శ్రీక ర్, డా. బస్వరెడ్డి, డా.ప్రభాకర్, నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం నాయకులు శంకర్, రాంజీ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
ఒక ఉద్యోగి.. రెండు వేతనాలు..
ఖమ్మం అర్బన్, న్యూస్‌లైన్: నాగార్జునసాగర్ ప్రాజెక్టు (ఎన్నెస్పీ) ఇంజినీరింగ్‌శాఖలో తవ్వేకొద్దీ అవినీతి అక్రమాలు బయటపడుతున్నాయి. ఒక అవినీతిపై విచారణ చేపడుతుంటే మరో అవినీతి బాగోతం బయటకొస్తోంది. రూ.65 లక్షల అవినీతి వెలుగుచూడటంతో ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేసిన వ్యవహారం మరువకముందే... మరొకటి గురువారం బయటపడింది. ఒక ఉద్యోగి రెండు వేతనాలు పొందుతూ రూ.16 లక్షలు స్వాహా చేయడాన్ని ఆడిట్లో గుర్తించారు. ఇదంతా ఒక్క ఏడాదిలో జరిగిన అవినీతి కాదు. ఐదేళ్లుగా ఈ తతంగం జరుగుతున్నా గుర్తించేనాథుడే లేకపోవడం అక్రమాలకు పరాకాష్టగా చెబుతున్నారు. ఎలా జరిగింది..? ఒక ఉద్యోగికి అందరితో పాటు నేరుగా వేతనం ఇస్తున్నారు. అదనంగా ఆ ఉద్యోగి బ్యాంకు ఖాతాలో అంతే మొత్తం జమచేస్తున్నారు. ఇంత బహిరంగంగా నిధులు స్వాహా అవుతున్నా సంబంధిత డ్రాయింగ్ అధికారులు మిన్నకుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. వారి కనుసన్నల్లోనే ఇదంతా జరిగిందని పలువురు అంటున్నారు. ఇప్పటికే రోజుకో అవినీతి బాగోతంతో అబాసుపాలవుతున్న ఎన్నెస్పీకి ఈ ఘటనో పెద్ద కుదుపునిచ్చిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఖమ్మంలోని ఎన్నెస్పీ మానిటరింగ్ డివిజన్ కార్యాలయం నుంచి సుమారు 200 మందికి పైగా ఉద్యోగులకు, ఎన్.ఎం.ఆర్లుగా పని చేస్తున్న వారికి జీతాలు చెల్లిస్తారు. డివిజన్ పరిధిలోని నల్లగొండ జిల్లా హూజూర్‌నగర్ సబ్ డివిజన్లో వెంకటకృష్ణ వర్క్‌ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు. 2009 ఏడాది నుంచి 2013 మార్చి వరకు ఖమ్మం ఇరిగేషన్ కార్యాలయం నుంచి నెలకు రూ. 25 వేల నుంచి రూ.30 వేల వరకు ఆయన బ్యాంక్ ఖాతాలో జమ చేస్తూ వచ్చారు. అదే సమయంలో అంతేమొత్తం వేతనాన్ని ఆయనకు నేరుగా ఇస్తున్నారు. ప్రతినెలా ఉద్యోగులందరి మాదిరిగానే ఆయన ఈ వేతనం పొందుతున్నారు. ఇలా దాదాపు ఐదేళ్ల నుంచి వెంకటకృష్ణ రెండు వేతనాలు పొందుతూ వస్తున్నారు. ఈ అదనపు వేతనం చెల్లింపుల వెనుక పలువురి హస్తం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై విచారణ నిర్వహించిన ఉన్నతాధికారులు రూ.16 లక్షలకు పైగానే స్వాహా చేసినట్లు గుర్తించారు. వెంకటకృష్ణ బ్యాంక్‌ఖాతా స్టేట్మెంట్ను తెప్పించుకొని పరిశీలించారు. అవకతవకలు జరిగినట్లు గుర్తించి సంబంధిత ఉద్యోగికి మెమో జారీ చేశారు. దీనిపై వెంకటకృష్ణ వివరణ ఇస్తూ...‘అందరిలాగే నేను వేతనం తీసుకున్నాను. ఖమ్మం ఈఈ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న శ్రీనివాసరావు నాఖాతాకు డబ్బులు పంపేవారు. వాటిని ఆయన పేరుమీదే చీటీ కట్టేవాణ్ని. అంతేకానీ నాకేమీ తెలియదు..’ అని చెప్పినట్లు ఎన్నెస్పీ ఈఈ సుమతి తెలిపారు. ఇప్పటికే నిధులు స్వాహాతో పాటు ఎన్ఎంఆర్ల నియామకంలో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపణలు వస్తుండటంతో...ఎన్ఆర్ఎంలకు సంబంధించిన వివిధ రకాల సర్టిఫికెట్లను కూడా అధికారులు మరోసారి పరిశీలిస్తున్న తెలిసింది. ఎలా వెలుగులోకి వచ్చింది..? ఎన్నెస్పీలో జీతాల చెల్లింపులో పలు అవకతవకలు ఇప్పటికే బయటపడ్డాయి. గతంలో కొందరు చనిపోయిన వారి పేరుమీద వేతనాలు డ్రాచేశారు. సుమారు రూ.65 లక్షల వరకు ఇలా స్వాహా అయిన విషయం తెలిసిందే. దానికి సంబంధించి ఉన్నతాధికారులు ఫైల్ టు ఫైల్ ఆడిట్ చేస్తుండగా ఈ రూ.16 లక్ష ల స్వాహా వ్యవహారం వెలుగుచూసిందని అధికారులు చెబుతున్నారు. రూ.65 లక్షల నిధుల స్వాహా విషయమై ప్రాథమిక విచారణ అధికారిగా అప్పటి మిర్యాలగూడెం ఎన్నెస్పీ ఎస్ఈని నియమించారు. ఎన్నెస్పీ సీఈ ఎల్లారెడ్డి ఆదేశాల మేరకు ఆయన 15 రోజుల పాటు విచారణ చేశారు. రూ.65 లక్షల వరకు నిధులు స్వాహా అయినట్లు పేర్కొన్నారు. ఈ అవినీతికి సూత్రధారులుగా ఖమ్మం మానిటరింగ్ కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావు, కార్యాలయ సూపరింటెండెంట్ రాజారావులేనని పేర్కొంటూ సీఈకి నివేదిక అందజేశారు. ఆ నివేదికను సీఈ ప్రభుత్వానికి పంపించడంతో సంబంధిత ఉద్యోగులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఇప్పటికే వీరిద్దర్నీ పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు పంపిన విషయం తెలిసిందే. రూ.16 లక్షల స్వాహా కూడా వారి హయాంలోనే జరిగినట్లు గుర్తించారు. నిధుల స్వాహా వాస్తవమే: సుమతి, ఎన్నెస్పీ ఈఈ చనిపోయిన వారిపేరు మీద బిల్లులు డ్రాచేసిన విషయమై గతంలో విచారణ నిర్వహించాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇద్దరు బాధ్యులపై పోలీసు కేసు పెట్టాం. తాజా ఆడిట్లో హుజూర్నగర్ వర్క్ ఇన్స్పెక్టర్ పేరుతో రూ.16 లక్షలు డ్రా చేసినట్లు బయటపడటంతో మిర్యాలగూడెం ఎస్ఈ ఆదేశాల మేరకు మెమో జారీ చేశాం. వర్క్ ఇన్స్పెక్టర్ ఇచ్చిన వివరణను నివేదికలో పొందుపరిచి ఎస్పీకి పంపించాం. ఆయన ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం.