అక్రమాలపై జేసీ కొరడా
రిమ్స్ క్యాంపస్: కమిషనర్ ఏమీ పట్టించుకోరు.. దాంతో వారు ఆడిందే ఆట, పాడిందే పాట.. కానీ ప్రత్యేకాధికారి ఊరుకోలేదు. అవకతవకలపై కన్నెర్ర చేశారు. అక్రమార్కులపై షోకాజ్ కొరడా ఝుళిపించారు. అది వారికి కంటగింపుగా మారింది. ఈయన పెత్తనమేమిటంటూ ఇంతెత్తున లేస్తున్నారు. సామూహిక సెలవులు పెట్టి సత్తా చూపాలని యోచిస్తున్నారు. ఇదంతా జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం మున్సిపాలిటీలో చర్చనీయాంశంగా మారింది. మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి అయిన జాయింట్ కలెక్టర్, మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధానికి తెర లేపింది.
నిధుల దుర్వినియోగంపై ఆరాతో మొదలు
మున్సిపాలిటీలో కీలకమైన ఇంజినీరింగ్ విభాగంలోని కొందరు అధికారులు ముడుపులకు అలవాటు పడి కాంట్రాక్టర్ల కొమ్ము కాస్తున్నారన్న ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికల ముందు జిల్లాకు జేసీగా వచ్చిన జి.వీరపాండ్యన్ మున్సిపల్ ప్రత్యేకాధికారిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల అనంతరం ఇంజినీరింగ్ విభాగంపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. ఆరోపణలను దృష్టిలో పెట్టుకొని 12, 13వ ఆర్థిక సంఘ నిధుల వినియోగంపై ఆరా తీశారు. దాంతో ఇంజినీరింగ్ అధికారుల లీలలు, కాంట్రాక్టర్ల అక్రమాలు బట్టబయలయ్యాయి.
అప్పటి నుంచి సమీక్ష సమావేశాల్లో ఇంజినీరింగ్ అధికారుల పనితీరును ఎండగడుతూ వచ్చారు. బాగున్న రోడ్లపైనే మళ్లీ మళ్లీ రోడ్లు వేస్తున్నారని, కాంట్రాక్టర్ల జేబులు నింపుతున్నారని నిలదీశారు. తాజా ఓ అభివృద్ధి పనివిషయంలో రూ. 11 లక్షల నిధులు గోల్‌మాల్ అయినట్లు గుర్తించిన ఆయన గత నెల 27న నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఇంజినీరింగ్ అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. టెండర్‌లో ఒక ధర కోట్ చేసిన కాంట్రాక్టర్లు తర్వాత ఇంజినీరింగ్ అధికారుల సహకారంతో నిర్మాణ సామాగ్రి ధరలు పెరిగాయన్న సాకుతో అధిక మొత్తానికి బిల్లులు మంజూరు చేయించుకుంటున్నారని జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి కారకులన్న ఆరోపణతో సదరు అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయడంతోపాటు సంబంధిత ఫైలుపై సంతకం పెట్టకుండా పెండింగులో ఉంచినట్లు తెలిసింది.
తమనే టార్గెట్ చేస్తున్నారేందుకు?
కాగా తమనే జేసీ ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ఇంజినీరింగ్ అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. తాము విధులు సక్రమంగానే నిర్వర్తిస్తున్నామని, ఎక్కడో ఏవో చిన్న పొరపాట్లు జరిగితే వాటిని భూతద్దంలో చూపడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. జేసీ తీరుకు నిరసనగా మూకుమ్మడి సెలవులు పెట్టాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. దీనిపై తమ యూనియన్ రాష్ట్ర నాయకులతో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాలని వారు భావిస్తున్నారు.
ఏమీ పట్టని కమిషనర్
తన ఆధీనంలో ఉన్న మున్సిపాలిటీలో ఇంత రచ్చ జరుగుతున్నా మున్సిపల్ కమిషనర్ తనకేమీ సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆయన ఏ విషయాన్ని పూర్తిస్ధాయిలో పట్టించుకోరని మున్సిపల్ ఉద్యోగులే వ్యాఖ్యానిస్తున్నారు. కాగా ఇక్కడి రాజకీయాలను తట్టుకోలేనంటూ కమిషనర్ బదిలీ కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారని తెలిసింది. అంత వరకు సెలవుపై వెళ్లాలన్న ఆలోచనలో ఉన్నట్లు కూడా సమాచారం.
సెలవులు పెట్టే ఆలోచన లేదు : రామ్మెహనరావు, ఎం.ఈ
ఇంజినీరింగ్ అధికారులకు జేసీ షోకాజ్ నోటీసులు ఇచ్చిన మాట వాస్తవమే. అయితే దీనికి నిరసనగా మూకుమ్మడి సెలవులు పెడతారన్న దాంట్లో వాస్తవం లేదు. మేం సెలవులు పెట్టే ఆలోచనలో లేం. ఎక్కడ తప్పులు జరిగాయన్న దానిపై విచారణ జరుపుతాం.