కుత్బుల్లాపూర్: రోడ్డు కిందకు ఉన్న ఇంటిని హైడ్రాలిక్ జాకీ పెట్టి లేపాలని ప్లాన్ వేశాడో ఇంటి యజమాని. అది బెడిసికొట్టి.. భవనం అదుపుతప్పి పక్క భవనంపైకి ఒరిగింది. పక్క భవన యజమాని జీహెచ్‌ఎంసీ అధికారులను అప్రమత్తం చేయడంతో డీఆర్‌ఎఫ్, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగం అధికారులు రంగంలోకి దిగారు. వివరాల్లోకి వెళ్తే.. కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని శ్రీనివాస్ నగర్ సీఎస్కే స్కూల్ గల్లీలో నాగేశ్వరావు అనే వ్యక్తి 2001లో ఇంటిని నిర్మించాడు.
తరువాత రోడ్డు వేయడంతో జీ ప్లస్2 భవనం.. రోడ్డు కంటే కిందకు అయ్యింది. అయితే పలువురు సూచించారని చెప్పి.. హైడ్రాలిక్ మెషీన్ పెట్టి బిల్డింగ్‌ను పైకి లేపాలని ప్లాన్ వేశాడు. శనివారం మధ్యాహ్నం హైడ్రాలిక్ మిషన్ తెప్పించి ఇంటిని పైకి లేపించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో భవనం 10 ఇంచుల వరకు జరిగి, పక్క భవనంపైకి ఒరిగింది. దీంతో ఇంట్లో ఉన్నవారు పరుగులు పెట్టారు. పక్క భవనం యజమాని వెంటనే జీహెచ్‌ఎంసీ అధికారులకు సమాచారం అందించారు.
విషయం తెలుసుకున్న సర్కిల్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ సాంబయ్య, టౌన్ ప్లానింగ్ అధికారి ప్రభావతి, డీఆర్‌ఎఫ్, ఇంజనీరింగ్ విభాగం అధికారులు వచ్చారు. ఇంట్లో ఉన్న వారిని బయటకు పంపించి బిల్డింగ్ పరిస్థితిని పరిశీలించారు. వర్షాకాలం కావడంతో బిల్డింగ్‌ను తొలగించాలా? లేదా? అన్న విషయంపై అధికారులు స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. 2001లో నిర్మించినట్టు భవన యజమాని చెబుతున్నా.. 1990లోనే నిర్మించారని ఇరుగుపొరుగు అంటున్నారు. పాత భవనం, సరైన కండిషన్‌లో లేనందున భవనాన్ని కూల్చడమే మంచిదని అసిస్టెంట్ సిటీ ప్లానర్ సాంబయ్య మీడియాకు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment