సాక్షి,నేరేడ్‌మెట్(హైదరాబాద్): ఆమెకు దాదాపు 60 ఏళ్లు. నేరేడ్‌మెట్ డివిజన్ ఆర్‌కెపురం బాలాజీ కాలనీలో నివసిస్తున్నారు. ఆమె ఒక్కరే ఇంట్లో ఉంటున్నారు. పేరు ముష్రాభేగం. ఇంతకీ ఆమె ఏం చేసిందో తెలుసా..ఇంటి ఆవరణలో చెత్తను పోగుచేసింది. కుళ్లిన కూరగాయలు..పండ్లు, కొబ్బరి మట్టలు, పాత దుస్తులు, దూది పరుపులు..గంపలు, ప్లాస్టిక్ కవర్లు ఇలా రకరకాల చెత్తనంతా జమ చేసింది. కొంత కాలంగా ఆమె సుమారు నాలుగు లారీల చెత్త ఇంటి ఆవరణలో పేరుకుపోయింది.
దీంతో విపరీతమైన దుర్వాసన వస్తోంది. రోజు రోజుకూ దోమలు పెరగడంతోపాటు దుర్వాసన తీవ్రమైంది. డెంగీ, మలేరియా, కరోనా రోగాల నేపథ్యంలో కాలనీలోని చుట్టుపక్కల వారు ఆందోళనకు గురయ్యారు. చెత్త తొలగించాలని సూచించినా ఆమె ససేమిరా అన్నారు. పైగా విచిత్రంగా మాట్లాడుతుండటంతో స్థానికులు గురువారం కార్పొరేటర్ కొత్తపల్లి మీనా ఉపేందర్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. కార్పొరేటర్ భర్త, టీఆర్‌ఎస్ సర్కిల్ ఉపాధ్యక్షుడు ఉపేందర్‌రెడ్డి నాయకులతో కలిసి ఆమె ఇంటికి వెళ్లారు. చెత్తను తొలగించాలని చెప్పినా ఆమె పట్టించుకోలేదు.
దీంతో జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య సిబ్బందిని పిలిచి తొలగించడానికి ప్రయత్నించారు. ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘నా చెత్త..నా ఇష్టం’ మీరెందుకు తొలగిస్తున్నారంటూ దబాయించే ప్రయత్నం చేశారు. ఆ తరువాత ఉపేందర్‌రెడ్డి నేరేడ్‌మెట్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌ఐ అనిల్, మహిళా కానిస్టేబుళ్లతో వెళ్లి నచ్చచెప్పినా మహిళ అదే తీరుగా మాట్లాడింది.
కాసేపు పోలీసులతో వాదనలు జరిగాయి. పోలీసులు గట్టిగా హెచ్చరించడంతో చెత్త తొలగింపునకు అంగీకరించారు. ఎంటామాలాజీ సిబ్బంది మందును పిచికారి చేశారు. అనంతరం మున్సిపల్ సిబ్బంది చెత్తను తొలగించారు. మొత్తం నాలుగు లారీల చెత్తను డంపింగ్‌యార్డుకు తరలించామని మల్కాజిగిరి మున్సిపల్ శానిటరీ ఇన్‌చార్జి నాగరాజు సాక్షితో చెప్పారు.
చదవండి: ఆరేళ్లుగా సహజీవనం: టాలీవుడ్ జూనియర్ ఆర్టిస్ట్ ఆత్మహత్య
Comments
Please login to add a commentAdd a comment