Hydraulic machines
-
జాకీతో బిల్డింగ్‌ను లేపాలని ప్రయత్నించి...
కుత్బుల్లాపూర్: రోడ్డు కిందకు ఉన్న ఇంటిని హైడ్రాలిక్ జాకీ పెట్టి లేపాలని ప్లాన్ వేశాడో ఇంటి యజమాని. అది బెడిసికొట్టి.. భవనం అదుపుతప్పి పక్క భవనంపైకి ఒరిగింది. పక్క భవన యజమాని జీహెచ్ఎంసీ అధికారులను అప్రమత్తం చేయడంతో డీఆర్ఎఫ్, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగం అధికారులు రంగంలోకి దిగారు. వివరాల్లోకి వెళ్తే.. కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని శ్రీనివాస్ నగర్ సీఎస్కే స్కూల్ గల్లీలో నాగేశ్వరావు అనే వ్యక్తి 2001లో ఇంటిని నిర్మించాడు. తరువాత రోడ్డు వేయడంతో జీ ప్లస్2 భవనం.. రోడ్డు కంటే కిందకు అయ్యింది. అయితే పలువురు సూచించారని చెప్పి.. హైడ్రాలిక్ మెషీన్ పెట్టి బిల్డింగ్‌ను పైకి లేపాలని ప్లాన్ వేశాడు. శనివారం మధ్యాహ్నం హైడ్రాలిక్ మిషన్ తెప్పించి ఇంటిని పైకి లేపించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో భవనం 10 ఇంచుల వరకు జరిగి, పక్క భవనంపైకి ఒరిగింది. దీంతో ఇంట్లో ఉన్నవారు పరుగులు పెట్టారు. పక్క భవనం యజమాని వెంటనే జీహెచ్ఎంసీ అధికారులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న సర్కిల్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ సాంబయ్య, టౌన్ ప్లానింగ్ అధికారి ప్రభావతి, డీఆర్ఎఫ్, ఇంజనీరింగ్ విభాగం అధికారులు వచ్చారు. ఇంట్లో ఉన్న వారిని బయటకు పంపించి బిల్డింగ్ పరిస్థితిని పరిశీలించారు. వర్షాకాలం కావడంతో బిల్డింగ్‌ను తొలగించాలా? లేదా? అన్న విషయంపై అధికారులు స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. 2001లో నిర్మించినట్టు భవన యజమాని చెబుతున్నా.. 1990లోనే నిర్మించారని ఇరుగుపొరుగు అంటున్నారు. పాత భవనం, సరైన కండిషన్లో లేనందున భవనాన్ని కూల్చడమే మంచిదని అసిస్టెంట్ సిటీ ప్లానర్ సాంబయ్య మీడియాకు తెలిపారు. -
పోలవరంలో మరో ముఖ్య ఘట్టం
సాక్షి, అమరావతి: పోలవరం స్పిల్ వే పనుల్లో మరో కీలక ఘట్టం మొదలైంది. స్పిల్ వే గేట్లను ఎత్తడానికి, దించడానికి వీలుగా ప్రపంచంలోనే అతి పెద్ద హైడ్రాలిక్ హాయిస్ట్ సిలిండర్లను అమర్చే ప్రక్రియను మేఘా సంస్థ సోమవారం ప్రారంభించింది. ఈ హైడ్రాలిక్ హాయిస్ట్ సిలిండర్లను జర్మనీకి చెందిన మాంట్ హైడ్రాలిక్ సంస్థ నుంచి దిగుమతి చేసుకున్నారు. జర్మనీ నుంచి సంస్థ ఇంజనీర్లు పోలవరానికి చేరుకుని గేట్లకు సిలిండర్ల బిగింపు పనులను పర్యవేక్షిస్తున్నారు. వరద పోటును తట్టుకునేలా... పోలవరం పూర్తి స్థాయి నీటి మట్టం 45.72 అడుగులు కాగా గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 194.6 టీఎంసీలు. ప్రాజెక్టులో నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరాక మిగులు జలాలను స్పిల్ వే ద్వారా దిగువకు విడుదల చేస్తారు. 1986 ఆగస్టు 16న ధవళేశ్వరం బ్యారేజీకి గోదావరి నుంచి 36 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చింది. గోదావరి చరిత్రలో ఇప్పటివరకూ వచ్చిన గరిష్ట వరద ప్రవాహం అదే. పోలవరం జలాశయం భద్రత దృష్ట్యా గోదావరికి 50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా సులభంగా దిగువకు విడుదల చేసేలా స్పిల్ వే నిర్మాణ డిజైన్లను కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) ఆమోదించింది. ఆ మేరకు 1,128 మీటర్ల పొడవున స్పిల్ వేను నిర్మిస్తున్నారు. స్పిల్ వే పిల్లర్లకు 25.72 అడుగుల నుంచి 45.72 అడుగుల మధ్య 20 మీటర్ల ఎత్తు, 16 మీటర్ల వెడల్పుతో 48 గేట్లను అమర్చాలి. ఇప్పటికే 29 గేట్లను అమర్చారు. ఒక్కో గేటు బరువు 300 టన్నులు ఉంటుంది. పోలవరం ప్రాజెక్టులోకి నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరాక వరదను దిగువకు విడుదల చేయాలంటే గేట్లను ఎత్తాలి. వరద ప్రవాహం తగ్గాక నీటిని గరిష్ట స్థాయిలో నిల్వ చేయాలంటే గేట్లను దించాలి. ఇలా గేట్లను ఎత్తడానికి, దించడానికి వీలుగా ఒక్కో గేటుకు కుడి వైపున ఒకటి, ఎడమ వైపున ఒకటి చొప్పున రెండు హైడ్రాలిక్ సిలిండర్లను అమర్చాలి. తాజాగా ఈ పనులు ప్రారంభమయ్యాయి. గేట్లు, హైడ్రాలిక్ సిలిండర్ల అమరిక ఇలా.. ► భారీ క్రేన్లతో ఆర్మ్ గడ్డర్లను ఎత్తి పిల్లర్లలో నిర్మించిన ట్రూనియన్ బీమ్‌కు బిగిస్తారు. రెండు పిల్లర్ల ట్రూనియన్ బీమ్ బ్రాకెట్లకు ఒక్కోదానికి నాలుగు ఆర్మ్ గడ్డర్ల చొప్పున బిగిస్తారు. రెండు పిల్లర్లకు బిగించిన ఆర్మ్ గడ్డర్స్‌ను హారిజాంటల్ గడ్డర్లతో అనుసంధానం చేస్తారు. ► భారీ క్రేన్ల సహకారంతో ఎనిమిది స్కిన్ ప్లేట్లను ఎత్తి రెండు పిల్లర్లకు అమర్చిన ఆర్మ్ గడ్డర్స్, హారిజాంటల్ గడ్డర్స్ మధ్య ఎగువన నాలుగు స్కిన్ ప్లేట్లు(ఎలిమెంట్స్), దిగువన నాలుగు స్కిన్ ప్లేట్లను అతికిస్తారు. స్కిన్ ప్లేట్ల మధ్య ఖాళీ ప్రదేశాలు లేకుండా వెల్డింగ్ చేస్తారు. దీంతో ఒక గేటు సిద్ధమవుతుంది. ► పిల్లర్లకు 45 మీటర్ల ఎత్తు వద్ద డౌన్ స్ట్రీమ్ (స్పిల్ వేకు దిగువ) వైపు కార్దానిక్ అరైంజ్మెంట్కు బిగిస్తారు. రెండు పిల్లర్లకు ఏర్పాటు చేసిన కార్దానిక్ అరైంజ్‌మెంట్.. గేటు అడుగున ఉన్న హారిజాంటల్ గడ్డర్‌కు అమర్చిన బ్రాకెట్ మధ్య స్పిల్ వేకు ఇరువైపులా డౌన్ స్ట్రీమ్‌లో ఒక్కొక్కటి 215 టన్నుల సామర్థ్యంతో కూడిన రెండు హైడ్రాలిక్ సిలిండర్లను బిగిస్తారు. స్పిల్ వే పిల్లర్లకు 55 మీటర్ల స్థాయిలో ఏర్పాటు చేసిన పవర్ ప్యాక్‌లతో కార్దానిక్ అరైంజ్మెంట్ను అనుసంధానం చేస్తారు. ప్రతి రెండు గేట్లకు ఒకచోట ఈ పవర్ ప్యాక్‌లను అనుసంధానం చేస్తూ స్పిల్ వే బ్రిడ్జిపై కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేస్తారు. గేట్లను ఎత్తాలకున్నప్పుడు కంట్రోల్ రూమ్ వద్దకు వెళ్లి పవర్ ప్యాక్ స్విచ్ ఆన్ చేస్తారు. గేటుకు అడుగున హారిజాంటల్ గడ్డర్‌కు ఇరు వైపులా బిగించిన హైడ్రాలిక్ బ్రాకెట్‌కు అమర్చిన హైడ్రాలిక్ హాయిస్ట్ సిలిండర్ సహకారంతో గేటుపైకి లేస్తుంది. నిమిషానికి అర మీటర్ చొప్పున గేటు పైకి లేస్తుంది. దించాల నుకున్నప్పుడు స్విచ్ ఆఫ్ చేస్తారు. పిల్లర్ 45 మీటర్ల స్థాయిలో కార్దానిక్ అరైంజ్మెంట్కు అమర్చిన హైడ్రాలిక్ హాయిస్ట్ సిలిండర్ల సహాయంతో గేటు కిందకు దిగుతుంది. ► జర్మనీ నుంచి ఇప్పటికే 70 సిలిండర్లు పోలవరానికి చేరుకున్నాయి. మిగిలిన 26 సిలిండర్లు మార్చి 15లోగా పోలవరానికి చేరుకుంటాయి. ఒకవైపు ఇప్పటికే అమర్చిన 29 గేట్లకు సిలిండర్లను బిగిస్తూ మరోవైపు మిగిలిన 19 గేట్లను బిగిస్తూ వాటికి సిలిండర్లను అమరుస్తారు. ఈ ప్రక్రియను ఏప్రిల్‌లోగా పూర్తి చేస్తామని అధికార వర్గాలు వెల్లడించాయి. -
తప్పిన పెనుముప్పు
సాక్షి,సిటీబ్యూరో : నాంపల్లి రైల్వేస్టేషన్లో బుధవారం చోటుచేసుకున్న ఎంఎంటీఎస్ ప్రమాద ఘటనలో పెనుముప్పు తప్పింది. అప్పటికే ప్రయాణికులు దిగిపోవడం, స్టేషన్లో డెడ్‌ఎండ్‌లో గోడకు ఇంజన్ తాకడంతో ప్రమాద తీవ్రత తగ్గింది. రైలు పూర్తి వేగంతో నడుస్తుండగా ఘటన జరిగి ఉంటే పెనుముప్పు ఏర్పడేదని రైల్వే అధికారులు చెబుతున్నారు. రైలు బోగీలను ముందుకు నెట్టే హై డ్రాలిక్ యంత్రాలు పాడైపోవడం వల్లే ఇంజన్ ముందుకు దూసుకెళ్లి గోడను ఢీకొట్టిందని అంటున్నారు. ఎంఎంటీఎస్ సర్వీసులు ప్రారంభమయ్యాక ఇటువంటి ఘటన జరగడం ఇదే ప్రథమం. నిర్వహణలో నిర్లక్ష్యం.. నగరంలో 121 ఎంఎంటీఎస్ రైళ్లు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. రోజూ లక్షా 50 వేల మంది వీటిని ఆశ్రయిస్తున్నారు. ప్రయాణికులకు చేరువైన ఈ సర్వీసుల సంఖ్యను ఇటీవల పెంచడంతో లోకో పెలైట్లపై పని ఒత్తిడి పెరిగింది. అలాగే, రైళ్లను సకాలంలో తనిఖీ చేయకపోవడం, కొన్నిసార్లు తనిఖీలు లేకుండానే సర్టిఫికెట్లు ఇచ్చేస్తున్నారు. కీలకమైన హైడ్రాలిక్ యంత్రాలు పాడైనా, బ్రేక్బాక్సులు పనిచేయకున్నా అధికారులు పట్టించుకోవట్లేదని కిందిస్థాయిలో పనిచేసే ఇన్చార్జిలు సైతం నిర్లక్ష్యం వహిస్తున్నారని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఫలక్‌నుమా-లింగంపల్లి, లింగంపల్లి-నాంపల్లి, నాంపల్లి-సికింద్రాబాద్ మధ్య ప్రస్తుతం ఎంఎంటీఎస్ రైళ్లు నడుస్తున్నాయి. ప్రతి 2-3 ట్రిప్పులకు ఒకసారి రైలును ఐడియలింగ్లో ఉంచాలి. కానీ సర్వీసుల సంఖ్య పెరడంతో ఇందుకు సమయం లభించట్లేదు. మరోవైపు క్రమం తప్పకుండా ఇంటర్మీడియట్ ఓవర్ హాలింగ్ (ఐఓహెచ్), పీరియాడికల్ ఓవర్ హాలింగ్ (పీఓహెచ్) నిర్వహించట్లేదనే ఆరోపణలున్నాయి. పైపై తనిఖీలు జరిపి రైళ్లను పట్టాలపైకి ఎక్కించేస్తున్నారని ఎంఎంటీఎస్ డ్రైవర్లు వాపోతున్నారు. ఎంఎంటీఎస్ రైళ్లను నడిపేందుకు నిపుణులైన లోకోపెలైట్లనే వినియోగించాలి. కానీ గూడ్స్ రైళ్లను నడిపే వారిని ఈ సెక్టార్లో వినియోగిస్తున్నారు. పైగా వీరిపై పని భారం పెరిగింది. 6 గంటలే రైలు నడపాల్సి ఉండగా 8-10 గంటల పాటు నడుపుతున్నారు. పనిభారానికి తోడు ఆరోగ్యం బాగోలేకున్నా సెలవులు ఇవ్వరని, దీనివల్ల ఒత్తిడి పెరుగుతోందని ఓ లోకోపెలైట్ చెప్పారు. ఉన్నతస్థాయి దర్యాఫ్తు: సీపీఆర్వో ఘటనపై ఉన్నతస్థాయి అధికారుల కమిటీ వేయనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు తెలిపారు. అన్ని కోణాల్లో సమగ్రంగా దర్యాఫ్తు చేస్తామన్నారు. ప్రమాదం కారణం గా నాంపల్లి-సికింద్రాబాద్, నాంపల్లి-లింగంపల్లి మధ్య నడిచే 5 సర్వీసులు రద్దయ్యాయి. వీటి రద్దుతో పాటు వర్షం కారణంగా బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో రవాణా సౌకర్యాలు అందుబాటులో లేక ప్రయాణికులు ఇబ్బందుల పాలయ్యారు.