పోలవరం ప్రాజెక్టు గేట్లకు హైడ్రాలిక్ సిలిండర్‌ను అమర్చుతున్న సిబ్బంది
సాక్షి, అమరావతి: పోలవరం స్పిల్ వే పనుల్లో మరో కీలక ఘట్టం మొదలైంది. స్పిల్ వే గేట్లను ఎత్తడానికి, దించడానికి వీలుగా ప్రపంచంలోనే అతి పెద్ద హైడ్రాలిక్ హాయిస్ట్ సిలిండర్లను అమర్చే ప్రక్రియను మేఘా సంస్థ సోమవారం ప్రారంభించింది. ఈ హైడ్రాలిక్ హాయిస్ట్ సిలిండర్లను జర్మనీకి చెందిన మాంట్ హైడ్రాలిక్ సంస్థ నుంచి దిగుమతి చేసుకున్నారు. జర్మనీ నుంచి సంస్థ ఇంజనీర్లు పోలవరానికి చేరుకుని గేట్లకు సిలిండర్ల బిగింపు పనులను పర్యవేక్షిస్తున్నారు.
వరద పోటును తట్టుకునేలా...
పోలవరం పూర్తి స్థాయి నీటి మట్టం 45.72 అడుగులు కాగా గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 194.6 టీఎంసీలు. ప్రాజెక్టులో నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరాక మిగులు జలాలను స్పిల్ వే ద్వారా దిగువకు విడుదల చేస్తారు. 1986 ఆగస్టు 16న ధవళేశ్వరం బ్యారేజీకి గోదావరి నుంచి 36 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చింది. గోదావరి చరిత్రలో ఇప్పటివరకూ వచ్చిన గరిష్ట వరద ప్రవాహం అదే. పోలవరం జలాశయం భద్రత దృష్ట్యా గోదావరికి 50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా సులభంగా దిగువకు విడుదల చేసేలా స్పిల్ వే నిర్మాణ డిజైన్లను కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) ఆమోదించింది.
ఆ మేరకు 1,128 మీటర్ల పొడవున స్పిల్ వేను నిర్మిస్తున్నారు. స్పిల్ వే పిల్లర్లకు 25.72 అడుగుల నుంచి 45.72 అడుగుల మధ్య 20 మీటర్ల ఎత్తు, 16 మీటర్ల వెడల్పుతో 48 గేట్లను అమర్చాలి. ఇప్పటికే 29 గేట్లను అమర్చారు. ఒక్కో గేటు బరువు 300 టన్నులు ఉంటుంది. పోలవరం ప్రాజెక్టులోకి నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరాక వరదను దిగువకు విడుదల చేయాలంటే గేట్లను ఎత్తాలి. వరద ప్రవాహం తగ్గాక నీటిని గరిష్ట స్థాయిలో నిల్వ చేయాలంటే గేట్లను దించాలి. ఇలా గేట్లను ఎత్తడానికి, దించడానికి వీలుగా ఒక్కో గేటుకు కుడి వైపున ఒకటి, ఎడమ వైపున ఒకటి చొప్పున రెండు హైడ్రాలిక్ సిలిండర్లను అమర్చాలి. తాజాగా ఈ పనులు ప్రారంభమయ్యాయి.
గేట్లు, హైడ్రాలిక్ సిలిండర్ల అమరిక ఇలా..
► భారీ క్రేన్లతో ఆర్మ్ గడ్డర్లను ఎత్తి పిల్లర్లలో నిర్మించిన ట్రూనియన్ బీమ్‌కు బిగిస్తారు. రెండు పిల్లర్ల ట్రూనియన్ బీమ్ బ్రాకెట్లకు ఒక్కోదానికి నాలుగు ఆర్మ్ గడ్డర్ల చొప్పున బిగిస్తారు. రెండు పిల్లర్లకు బిగించిన ఆర్మ్ గడ్డర్స్‌ను హారిజాంటల్ గడ్డర్లతో అనుసంధానం చేస్తారు.
► భారీ క్రేన్ల సహకారంతో ఎనిమిది స్కిన్ ప్లేట్లను ఎత్తి రెండు పిల్లర్లకు అమర్చిన ఆర్మ్ గడ్డర్స్, హారిజాంటల్ గడ్డర్స్ మధ్య ఎగువన నాలుగు స్కిన్ ప్లేట్లు(ఎలిమెంట్స్), దిగువన నాలుగు స్కిన్ ప్లేట్లను అతికిస్తారు. స్కిన్ ప్లేట్ల మధ్య ఖాళీ ప్రదేశాలు లేకుండా వెల్డింగ్ చేస్తారు. దీంతో ఒక గేటు సిద్ధమవుతుంది.
► పిల్లర్లకు 45 మీటర్ల ఎత్తు వద్ద డౌన్ స్ట్రీమ్ (స్పిల్ వేకు దిగువ) వైపు కార్దానిక్ అరైంజ్‌మెంట్‌కు బిగిస్తారు. రెండు పిల్లర్లకు ఏర్పాటు చేసిన కార్దానిక్ అరైంజ్‌మెంట్.. గేటు అడుగున ఉన్న హారిజాంటల్ గడ్డర్‌కు అమర్చిన బ్రాకెట్ మధ్య స్పిల్ వేకు ఇరువైపులా డౌన్ స్ట్రీమ్‌లో ఒక్కొక్కటి 215 టన్నుల సామర్థ్యంతో కూడిన రెండు హైడ్రాలిక్ సిలిండర్లను బిగిస్తారు. స్పిల్ వే పిల్లర్లకు 55 మీటర్ల స్థాయిలో ఏర్పాటు చేసిన పవర్ ప్యాక్‌లతో కార్దానిక్ అరైంజ్‌మెంట్‌ను అనుసంధానం చేస్తారు. ప్రతి రెండు గేట్లకు ఒకచోట ఈ పవర్ ప్యాక్‌లను అనుసంధానం చేస్తూ స్పిల్ వే బ్రిడ్జిపై కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేస్తారు. గేట్లను ఎత్తాలకున్నప్పుడు కంట్రోల్ రూమ్ వద్దకు వెళ్లి పవర్ ప్యాక్ స్విచ్ ఆన్ చేస్తారు. గేటుకు అడుగున హారిజాంటల్ గడ్డర్‌కు ఇరు వైపులా బిగించిన హైడ్రాలిక్ బ్రాకెట్‌కు అమర్చిన హైడ్రాలిక్ హాయిస్ట్ సిలిండర్ సహకారంతో గేటుపైకి లేస్తుంది. నిమిషానికి అర మీటర్ చొప్పున గేటు పైకి లేస్తుంది. దించాల నుకున్నప్పుడు స్విచ్ ఆఫ్ చేస్తారు. పిల్లర్ 45 మీటర్ల స్థాయిలో కార్దానిక్ అరైంజ్‌మెంట్‌కు అమర్చిన హైడ్రాలిక్ హాయిస్ట్ సిలిండర్ల సహాయంతో గేటు కిందకు దిగుతుంది.
► జర్మనీ నుంచి ఇప్పటికే 70 సిలిండర్లు పోలవరానికి చేరుకున్నాయి. మిగిలిన 26 సిలిండర్లు మార్చి 15లోగా పోలవరానికి చేరుకుంటాయి. ఒకవైపు ఇప్పటికే అమర్చిన 29 గేట్లకు సిలిండర్లను బిగిస్తూ మరోవైపు మిగిలిన 19 గేట్లను బిగిస్తూ వాటికి సిలిండర్లను అమరుస్తారు. ఈ ప్రక్రియను ఏప్రిల్‌లోగా పూర్తి చేస్తామని అధికార వర్గాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment