సాక్షి,సిటీబ్యూరో : నాంపల్లి రైల్వేస్టేషన్‌లో బుధవారం చోటుచేసుకున్న ఎంఎంటీఎస్ ప్రమాద ఘటనలో పెనుముప్పు తప్పింది. అప్పటికే ప్రయాణికులు దిగిపోవడం, స్టేషన్‌లో డెడ్‌ఎండ్‌లో గోడకు ఇంజన్ తాకడంతో ప్రమాద తీవ్రత తగ్గింది. రైలు పూర్తి వేగంతో నడుస్తుండగా ఘటన జరిగి ఉంటే పెనుముప్పు ఏర్పడేదని రైల్వే అధికారులు చెబుతున్నారు. రైలు బోగీలను ముందుకు నెట్టే హై డ్రాలిక్ యంత్రాలు పాడైపోవడం వల్లే ఇంజన్ ముందుకు దూసుకెళ్లి గోడను ఢీకొట్టిందని అంటున్నారు. ఎంఎంటీఎస్ సర్వీసులు ప్రారంభమయ్యాక ఇటువంటి ఘటన జరగడం ఇదే ప్రథమం.
నిర్వహణలో నిర్లక్ష్యం..
నగరంలో 121 ఎంఎంటీఎస్ రైళ్లు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. రోజూ లక్షా 50 వేల మంది వీటిని ఆశ్రయిస్తున్నారు. ప్రయాణికులకు చేరువైన ఈ సర్వీసుల సంఖ్యను ఇటీవల పెంచడంతో లోకో పెలైట్‌లపై పని ఒత్తిడి పెరిగింది. అలాగే, రైళ్లను సకాలంలో తనిఖీ చేయకపోవడం, కొన్నిసార్లు తనిఖీలు లేకుండానే సర్టిఫికెట్లు ఇచ్చేస్తున్నారు. కీలకమైన హైడ్రాలిక్ యంత్రాలు పాడైనా, బ్రేక్‌బాక్సులు పనిచేయకున్నా అధికారులు పట్టించుకోవట్లేదని కిందిస్థాయిలో పనిచేసే ఇన్‌చార్జిలు సైతం నిర్లక్ష్యం వహిస్తున్నారని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.
ఫలక్‌నుమా-లింగంపల్లి, లింగంపల్లి-నాంపల్లి, నాంపల్లి-సికింద్రాబాద్ మధ్య ప్రస్తుతం ఎంఎంటీఎస్ రైళ్లు నడుస్తున్నాయి. ప్రతి 2-3 ట్రిప్పులకు ఒకసారి రైలును ఐడియలింగ్‌లో ఉంచాలి. కానీ సర్వీసుల సంఖ్య పెరడంతో ఇందుకు సమయం లభించట్లేదు. మరోవైపు క్రమం తప్పకుండా ఇంటర్మీడియట్ ఓవర్ హాలింగ్ (ఐఓహెచ్), పీరియాడికల్ ఓవర్ హాలింగ్ (పీఓహెచ్) నిర్వహించట్లేదనే ఆరోపణలున్నాయి. పైపై తనిఖీలు జరిపి రైళ్లను పట్టాలపైకి ఎక్కించేస్తున్నారని ఎంఎంటీఎస్ డ్రైవర్లు వాపోతున్నారు.
ఎంఎంటీఎస్ రైళ్లను నడిపేందుకు నిపుణులైన లోకోపెలైట్‌లనే వినియోగించాలి. కానీ గూడ్స్ రైళ్లను నడిపే వారిని ఈ సెక్టార్‌లో వినియోగిస్తున్నారు. పైగా వీరిపై పని భారం పెరిగింది. 6 గంటలే రైలు నడపాల్సి ఉండగా 8-10 గంటల పాటు నడుపుతున్నారు. పనిభారానికి తోడు ఆరోగ్యం బాగోలేకున్నా సెలవులు ఇవ్వరని, దీనివల్ల ఒత్తిడి పెరుగుతోందని ఓ లోకోపెలైట్ చెప్పారు.
ఉన్నతస్థాయి దర్యాఫ్తు: సీపీఆర్వో
ఘటనపై ఉన్నతస్థాయి అధికారుల కమిటీ వేయనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు తెలిపారు. అన్ని కోణాల్లో సమగ్రంగా దర్యాఫ్తు చేస్తామన్నారు. ప్రమాదం కారణం గా నాంపల్లి-సికింద్రాబాద్, నాంపల్లి-లింగంపల్లి మధ్య నడిచే 5 సర్వీసులు రద్దయ్యాయి. వీటి రద్దుతో పాటు వర్షం కారణంగా బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో రవాణా సౌకర్యాలు అందుబాటులో లేక ప్రయాణికులు ఇబ్బందుల పాలయ్యారు.
తప్పిన పెనుముప్పు
Published Thu, Oct 10 2013 5:02 AM | Last Updated on Fri, Sep 1 2017 11:29 PM
Advertisement
Advertisement