కాళేశ్వరం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని లింకు–1 బ్యారేజీల వద్ద గత ఏడాది వచ్చిన భారీ వరదలతో కాంక్రీటు దెబ్బతింది. అయితే మళ్లీ వానాకాలం వచ్చినప్పటికీ దెబ్బతిన్న చోట్ల ఇప్పటికీ మరమ్మతులు చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్‌పల్లిలోని మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజీ, అన్నారంలోని (సరస్వతి) బ్యారేజీల వద్ద వరద తాకిడికి గేట్ల ముందు భాగంలోని కాంక్రీటు దిమ్మెలు కొట్టుకుపోయాయి. గత సీజన్‌లో ఇది జరిగితే ఇప్పటికీ ఇరిగేషన్ శాఖ అధికారులు మరమ్మతుల విషయంలో ఆలోచన చేయడం లేదని, ఖరీఫ్ సీజన్ ఆరంభం అవుతున్నా పనుల్లో జాప్యం చేస్తున్నారని నీటిపారుదల రంగ నిపుణులు ఆక్షేపిస్తున్నారు.
గతేడాది ఉధృతంగా వరద
గత ఏడాది కురిసిన భారీవర్షాలకు బ్యారేజీలు కొంతమేర దెబ్బతిన్నాయి. ఎగువ గోదావరి నుంచి సరస్వతీ బ్యారేజీ వద్ద 17.50 లక్షల క్యూసెక్కుల వరద జూలై 14–15 తేదీల్లో ఉధృతంగా ప్రవహించింది. దీంతో బ్యారేజీలోని మొత్తం 66 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. వరద ఉధృతికి గేట్ల కింది భాగాన ఉన్న కాంక్రీట్ దిమ్మెలు లేచిపోయాయి. అలాగే గోదావరి వరదకు, ప్రాణహిత వరద తోడై మేడిగడ్డలోని లక్ష్మీబ్యారేజీ వద్ద 29 లక్షల క్యూసెక్కులకుపైగా వరద రావడంతో దిమ్మెలు చెల్లాచెదురుగా కొట్టుకుపోయాయి.
కాంక్రీటు దిమ్మెలు ఇలా..
బ్యారేజీల్లో గేట్లు ఎత్తినప్పుడు వరద తాకిడికి నేల కోతకు గురికాకుండా ముందు భాగంలో ఇంజనీరింగ్ శాఖ అధికారులు అత్యాధునిక టెక్నాలజీతో కాంక్రీటు దిమ్మెలను అమర్చారు. 3 అడుగుల వెడల్పు, పొడవుతో దిమ్మెలను బ్యారేజీ పొడవునా గేట్ల కింద ముందు భాగంలో కాంక్రీటు చేశారు. వరద తాకి డి కి నేల కోతకు గురికాకుండా ఈ దిమ్మెలు అడ్డుకుంటాయి. కానీ గత ఏడాది వచ్చిన భారీ వరద తాకిడికి ఈ దిమ్మెలు విరిగి ఎక్కడికక్కడ చెల్లాచె దురుగా పడి కొట్టుకుపోయాయి. అప్పటి నుంచీ అక్కడ మరమ్మతులు చేయలేదని చెబుతున్నారు.
డిజైన్స్ రాలేదని..
మేడిగడ్డ (లక్ష్మి), అన్నారం (సరస్వతి) బ్యారేజీల వద్ద అమర్చిన దిమ్మెలు కొట్టుకుపోయి ఏడాది కావస్తున్నా.. డిజైన్స్ తయారు చేయలేదని ఇంజనీ రింగ్ శాఖ పేర్కొంటోంది. ఈ నేపథ్యంలో మరమ్మ తులు చేయకుండానే మళ్లీ వర్షాకాలం ఆరంభమైంది. వర్షాలు ఏకధాటిగా కురిస్తే మరోసారి భారీ వరదలు వచ్చే అవకాశం ఉంది. బ్యారేజీల గేట్లు ఎత్తితే మరింత కోతకు గురయ్యే ప్రమాదం ఉంది. గత ఏడాది కురిసిన వర్షాలకు ఇప్పటికే గేట్ల ముందుభాగంలో కోతకు గురై, భారీగా ఇసుక మేటలు వేశాయి. దీంతో గేట్లకు కూడా ప్రమాదం పొంచి ఉందని నిపుణులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment